
- అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా
- దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి దళిత సంఘాల నిరసన సెగ తగిలింది. శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీసులో పంద్రాగస్టు వేడుకలను జరుపుకుని వెళ్తుండగా దళిత సంఘాలనేతలు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళిత ద్రోహి నర్సారెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నర్సారెడ్డి కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇటీవల గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ కు డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డికి మధ్య గొడవ జరగగా ఆయన పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం విజయ కుమార్ కు మద్దతుగా దళిత సంఘాల నేతలు సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
నర్సారెడ్డిని అరెస్టు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నర్సారెడ్డి చర్యల వల్ల దళితులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందని, ఈ విషయంపై చర్యలు తీసుకోక పోతే భవిష్యత్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పాత బస్టాండు చౌరస్తా వద్ద నర్సారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తోరోకో నిర్వహించారు.