భవిష్యత్ లో మంచి రోజులొస్తాయ్ : హరీశ్ రావు

భవిష్యత్ లో మంచి రోజులొస్తాయ్ : హరీశ్ రావు

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో అధికారంలో లేమని బాధపడొద్దని, భవిష్యత్​లో మంచి రోజులొస్తాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలకు ధైర్యం చెప్పారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్  ఎమ్మెల్యేలతో మంగళవారం సంగారెడ్డిలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పి స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్​ పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేయాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదని అధికారం లేనప్పుడు కుంగిపోమన్నారు. ఈ సారి కాంగ్రెస్సోళ్లకు ప్రజలు అవకాశం ఇచ్చారని, వాళ్లు మనకన్నా బాగా పని చేయాలని కోరుకుందాం అన్నారు.

కేవలం 2 శాతం ఓట్లతో మనం ఓడిపోయామని ఇప్పుడు ప్రజల గొంతుకగా మారి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. పరీక్షలో విద్యార్థి ఫెయిల్ అయినట్లే మనము ఫెయిలయ్యామని, మళ్లీ పాస్ అవుతామని ధైర్యంగా పని చేయాలని సూచించారు. 2001 నుంచి 2014 వరకు ఎన్నో జయఅపజయాలను చూసినా ఏరోజు అధైర్య పడలేదన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పొప్పులను, లోటుపాట్లను  సరిదిద్దుకొని భవిష్యత్​లో మళ్లీ అధికారం సాధించే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ బాధపడొద్దని ఏ టైంలో తనకు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, టిఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.