- ప్రాజెక్టుల భూ బాధితుల హెచ్చరిక
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రభుత్వాలు మారుతున్నా ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతుల బతుకులు మారడం లేదని పలు ప్రాజెక్టుల భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. 2016లో నిర్వహించిన దీక్షలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన తమకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 123 ద్వారా భూములను బలవంతంగా సేకరించారని, ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని వాపోయారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్, అంతగిరి, గౌరవెల్లి ప్రాజెక్టులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా అనేకమంది నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అందలేదన్నారు.
ఆఫీసర్లకు పలుమార్లు విన్నవించినా, కోర్టులను ఆశ్రయించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి భూములు, ఇళ్లు కేటాయించి, అర్హులైన నిర్వాసితులను విస్మరించారని ఆరోపించారు. ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆలోపే పరిహారం చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కుటుంబాలతో కలిసి పాదయాత్రగా సీఎం ఇంటికి చేరుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో భూ నిర్వాసితులు ఎండీ హయతుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, పోచయ్య, ప్రవీణ్, బాబు, ప్రభాకర్, ఎల్లారెడ్డి, ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
