
బాలీవుడ్ సెలబ్రెటీ కపూల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ హాస్పిటల్ లో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ ద్వారా కియారా తమ మొదటిబిడ్డకు జన్మనిచ్చిందని.. తల్లి మరియు కుమార్తె ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
2021లో విడుదలైన ‘షేర్షా’లో హీరో సిద్ధార్థ్, కియారా జంటగా నటించారు. అక్కడి నుంచి మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. 2023 ఫిబ్రవరి 7న కుటుంబసభ్యుల సమక్షంలో రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. 2025 ఫిబ్రవరి నెలలో కియారా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చింది.
ప్రస్తుతం కియారా అద్వానీ సౌత్..నార్త్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లు పట్టేస్తోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయింది. ఇటీవలే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో మెరిసింది. కియారా నటించిన 'వార్ 2' ఈ ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.