
- టెక్నాలజీ ఉపయోగించి మృతులను గుర్తిస్తున్నం: సీఎస్ రామకృష్ణారావు
- సిగాచి పరిశ్రమ ఘటనా స్థలం సందర్శన.. అధికారులతో సమీక్ష
- త్వరలో బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తామని వెల్లడి
పటాన్చెరు, వెలుగు: సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఆఖరి మృతదేహం దొరికే వరకూ సహాయ చర్యలు కొనసాగుతాయని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. మృతులను గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సిగాచి ఫ్యాక్టరీని శుక్రవారం సీఎస్ రామకృష్ణారావు సందర్శించారు. పరిశ్రమలో ఘటన తీరును, పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీ దాన కిశోర్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అగ్నిమాపక శాఖ అధికారులు, పొల్యూషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, పరిశ్రమల శాఖ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిశ్రమల భద్రతా ప్రమాణాలు, సేఫ్టీ మెకానిజంపై సంబంధిత శాఖలనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో రియాక్టర్లు, డ్రైయర్లు, ఫైర్ ఫైట్ సిస్టం, ఉద్యోగుల రక్షణ మార్గాలపై ఆరా తీశారు. ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితోపాటు మృతుల వివరాలు, మృతుల ఐడెంటిఫికేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం ఐలా భవన్లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
సీఎం ప్రకటించిన విధంగా త్వరలో మృతుల, క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులు ఆందోళన చెందొద్దని కోరారు.