
హైదరాబాద్: తెలంగాణ స్టార్ షట్లర్ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జంట.. స్లొవేనియా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి–రోహన్ 12–21, 13–21తో మూడోసీడ్ జాస్పెర్ టోఫ్ట్–క్లారా గ్రావెర్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. 29 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో టోఫ్ట్ జంట బలమైన ర్యాలీలు, క్రాస్ కోర్టు విన్నర్స్‌తో చెలరేగింది.
5–5తో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన టోఫ్ట్–క్లారా జోడీ వరుస పాయింట్లతో హోరెత్తించింది. స్కోరు12–11 వద్ద వరుసగా 8 పాయింట్లు నెగ్గింది. ఇక రెండో గేమ్‌లోనూ డెన్మార్క్ ప్లేయర్ల ఆధిపత్యమే కొనసాగింది. 2–0తో మొదలైన దూకుడు చివరి వరకు కొనసాగింది. 11–8 వద్ద వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.