సింపుల్​గా, టేస్టీగా.. పెరుగుతో శ్నాక్స్!

సింపుల్​గా, టేస్టీగా.. పెరుగుతో శ్నాక్స్!

శ్నాక్స్ తినడానికి సీజన్​, టైంతో పనిలేదు. ఏ టైంలోనైనా తినాలనిపిస్తుంది. అందుకోసం చాలామంది వంటింట్లో ఉన్న ఇంగ్రెడియెంట్స్, వెజిటబుల్స్​తో వేడి వేడిగా తయారుచేసి పెడుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ స్పెషల్​ శ్నాక్స్. పెరుగుతో చేసుకునే సింపుల్​గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

బ్రెడ్ కర్డ్ ఫైర్ రోల్స్ కావాల్సినవి :

పెరుగు – అర కిలో
బ్రెడ్ స్లైస్​లు – ఆరు
ఉప్పు, నూనె – సరిపడా    
ఉల్లిగడ్డ, క్యారెట్ – ఒక్కొక్కటి చొప్పున
పచ్చిమిర్చి – రెండు
కొత్తిమీర – కొంచెం
చక్కెర, ఎండు మిర్చి పలుకులు – ఒక్కోటి ఒక్కో టీస్పూన్ చొప్పున

తయారీ : పెరుగుని ఒక కాటన్​ బట్టలో వేసి నీళ్లన్ని పిండాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, చక్కెర, ఎండు మిర్చి పలుకులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బ్రెడ్​ స్లైస్​లు తీసుకుని, చేత్తో కొంచెం తడి చేయాలి. రెండు చివర్లలో క్రాస్​గా కట్ చేయాలి. బ్రెడ్​ పై పెరుగు మిశ్రమం పెట్టి, చేతిని నీటితో తడుపుతూ కోన్​ ఆకారంలో చుట్టాలి. వీటిని ఒవెన్​లో బేకింగ్ చేయొచ్చు. లేదంటే వేడి వేడి నూనెలో డీప్​ ఫ్రై చేయొచ్చు. 

పొటాటో స్టిక్స్ కావల్సినవి 

పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఆలుగడ్డలు – రెండు (చిన్నవి), పసుపు, కారం – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, ధనియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – సరిపడా, ఆవ నూనె – ఒక టీస్పూన్, మైదా – అర టీస్పూన్, ఒరెగానో, ఎండు మిర్చి పలుకులు – కొంచెం, గోధుమ పిండి – అర టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ఆవ నూనె, మైదా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి.  ఒరెగానో, ఎండు మిర్చి పలుకులు, గోధుమ పిండి వేసి కలపాలి. తర్వాత పాన్​లో నూనె వేడి చేసి, ఆలుగడ్డల ముక్కలు వేసి బాగా వేగిస్తే పొటాటో స్టిక్స్ రెడీ. 

పెరుగు దోశ కావాల్సినవి :

పెరుగు, బియ్యప్పిండి – ఒక్కోటి ఒక్కో కప్పు చొప్పున, ఉప్పు – సరిపడా, కరివేపాకు – కొంచెం, ఉల్లిగడ్డ – ఒకటి, పచ్చిమిర్చి – మూడు, అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – ఒక టీస్పూన్.

తయారీ : ఒక గిన్నెలో పెరుగు, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. కరివేపాకు, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు వేసి మళ్లీ కలపాలి. అందులో కొంచెం నీళ్లు పోసి, దోశ పిండిలా కలపాలి. పాన్​ వేడయ్యాక దోశ పోయాలి. తర్వాత నూనెతో రెండు వైపులా కాల్చాలి. 

పెరుగు పకోడి కావాల్సినవి :

పెరుగు – మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ – ఒకటి (చిన్నది)
పచ్చిమిర్చి – ఒకటి
కరివేపాకు – కొంచెం
మైదా – నాలుగు టేబుల్ స్పూన్లు
బొంబాయి రవ్వ – మూడు టేబుల్ స్పూన్లు
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు – సరిపడా

తయారీ : ఒక గిన్నెలో పెరుగు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, మైదా, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి కలపాలి. అందులో కొన్ని నీళ్లు పోసి పకోడి పిండిలా బాగా కలపాలి. తర్వాత పసుపు కూడా వేసి కలపాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి దానిపై స్పూన్​తో పెరుగు మిశ్రమాన్ని వేయాలి.  రెండు వైపులా బాగా కాల్చాలి. 

చల్ల మిర్చి కావాల్సినవి : 

పెరుగు – పావు కిలో, పచ్చిమిర్చి – పావు కిలో
ఉప్పు – మూడు టేబుల్ స్పూన్లు 

తయారీ : పచ్చిమిర్చిని నిలువుగా చీలిక పెట్టాలి. మిక్సీ జార్​లో పెరుగు వేసి బాగా గ్రైండ్​ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక రాత్రంతా ఉంచాలి. పొద్దున్నే తీసి, ఒక బట్ట పై పేర్చి ఎండబెట్టాలి. సాయంత్రం మళ్లీ తీసి అదే పెరుగులో వేసి మూత పెట్టాలి. ఇలాగే నాలుగైదు రోజులు ఎండబెట్టాలి. తేమ లేకుండా బాగా ఎండిన వాటిని, వేడి వేడి నూనెలో వేగించాలి.  

కర్డ్ రింగ్స్ కావాల్సినవి :

పెరుగు, బియ్యప్పిండి – ఒక్కోటి ఒక్కో కప్పు చొప్పున
కొత్తిమీర, కరివేపాకు – కొంచెం
కారం – అర టేబుల్ స్పూన్
నూనె – ఒక టీస్పూన్
ఉప్పు – సరిపడా
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్ 

తయారీ : ఒక పాన్​లో పెరుగు వేసి, బాగా కలపాలి. తర్వాత అందులో కొత్తిమీర, కరివేపాకు, కారం, నూనె వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమం తెర్లేదాకా కాగబెట్టాలి. ఆ తర్వాత బియ్యప్పిండి, ఉప్పు వేసి ముద్దగా కలపాలి. అందులో నుంచి కొంచెం పిండి తీసుకుని, చేత్తో రోల్​ చేసి, రింగుల్లా చుట్టాలి. మరో పాన్​లో కొంచెం నూనె వేడి చేసి, ఈ రింగుల్ని వేగించాలి.