సింగపూర్ పాస్‌ పోర్టు ప్రపంచంలోనే పవర్‌‌ ఫుల్..

సింగపూర్ పాస్‌ పోర్టు ప్రపంచంలోనే పవర్‌‌ ఫుల్..
  • భారత పాస్​పోర్టుకు 80వ ర్యాంకు
  • హెన్లీ పాస్​పోర్ట్ ఇండెక్స్ విడుదల
  • వీసా ఆన్ అరైవల్ విధానంలో ఇండియన్లు 55 దేశాలకు వెళ్లొచ్చు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్​పోర్ట్​గా సింగపూర్ పాస్​పోర్ట్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది కూడా టాప్​లో నిలిచింది. ‘ది హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్’ తాజా నివేదికలో సింగపూర్ పాస్ పోర్ట్ టాప్​లో నిలవగా.. భారత్ 80 వ స్థానం దక్కించుకుంది. నిరుడు 85వ స్థానంలో ఉన్న ఇండియా ఈసారి 5 స్థానాలు మెరుగుపడింది. ముందస్తు వీసా లేకుండా పౌరులు ఎన్ని దేశాల్లో పర్యటించవచ్చన్న డేటాను ఆధారంగా తీసుకుని ‘ద హెన్లీ పాస్ పోర్ట్  ఇండెక్స్’ వివిధ దేశాలకు ర్యాంకులు కేటాయిస్తుంది.

 ముఖ్యంగా ది ఇంటర్నేషనల్  ఎయిర్  ట్రాన్స్ పోర్ట్  అసోసియేషన్ (ఐఏటీఏ), హెన్లీ అండ్  పార్టనర్స్ రీసర్చ్  డేటాను కూడా తీసుకుని ఈ ర్యాంకులు ఇస్తారు. 2026 ఇండెక్స్  ప్రకారం.. ఇండియన్  పాస్ పోర్ట్  హోల్డర్లు వీసా లేకుండా 55 దేశాలకు వెళ్లవచ్చు. అయితే.. 2025లో ఈ ఇండెక్స్​లో భారత్  85వ ర్యాంకులో ఉన్నప్పటికీ వీసా లేకుండా 57 దేశాలకు ప్రయాణించే వెసులుబాటు ఉండేది.

 శ్రీలంక, పాకిస్తాన్,  అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్  వంటి పొరుగు దేశాల పౌరుల కన్నా ఇండియన్  పాస్ పోర్ట్  ఉన్నవారికి ఇంటర్నేషనల్  ట్రావెల్  ఫ్రీడం పెరిగిందని ఇండెక్స్  వెల్లడించింది. అయితే.. ప్రపంచంలోని చాలా దేశాల్లో భారత పాస్ పోర్ట్  హోల్డర్లు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ ఇండెక్స్​లో టాప్​లో ఉన్న దేశాలతో పోలిస్తే భారత పాస్ పోర్ట్ హోల్డర్లకు ఆయా దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని వివరించింది.

సింగపూర్  పాస్​పోర్ట్​తో.. 

ప్రపంచంలోని మొత్తం 227 దేశాలకు సింగపూర్  పాస్‌‌ పోర్ట్  హోల్డర్లు 192 దేశాల్లో వీసా లేకుండానే జర్నీ చేయవచ్చు. ఇక జపాన్, దక్షిణ కొరియా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్  ఉన్నవారు దాదాపు 188 దేశాల్లో వీసా లేకుండా తిరగవచ్చని ఇండెక్స్  వివరించింది. డెన్మార్క్, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్​కు ఈ ఇండెక్స్​లో మూడో ర్యాంకు దక్కింది. ఈ దేశాల పాస్​పోర్ట్  ఉన్నవారు 186 దేశాలకు వీసా లేకుండానే జర్నీ చేయవచ్చు.

ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ద నెదర్లాండ్స్, నార్వే నాలుగో ప్లేస్ లో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్  హోల్డర్లు ముందస్తు వీసా అవసరం లేకుండా 185 దేశాలకు వెళ్లవచ్చు. హంగేరీ, పోర్చుగల్, స్లొవేకియా, యూఈఏ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ హోల్డర్లు 184 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. కాగా, ముందస్తు వీసా తీసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ ఆ దేశాల్లో ల్యాండయ్యాక ‘వీసా ఆన్ అరైవల్’  వీసా తీసుకోవాల్సి ఉంటుంది.