
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని ఆ సంస్థ సీఎండీ ఎన్. బలరాం నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నస్పూర్ సింగరేణి డిస్పెన్సరీలో రూ.33 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్‌రే మిషన్ యూనిట్‌ను సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, బి.జనక్‌ప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి వెనుకడబోమన్నారు.
శ్రీరాంపూర్ ఏరియాలో కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు నెలాఖరు నాటికి రూ.16 కోట్లతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ పనులు ప్రారంభిస్తామన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, ఓబీ వెలికితీతకు కార్మికులు, ఆఫీసర్లు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఆరోగ్య కరదీపిక పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి, ఐఆర్ అండ్ పీఎం జీఎం హనుమంతరావు, ఎస్ఓ టు జీఎంరఘుకుమార్, ఏజీఎంలు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని వినతి
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియాలో అమలు చేస్తున్న వేతనాలను సింగరేణిలో వర్తింపజేయాలని కోరుతూ సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఇప్టూ) లీడర్లు, కార్మికులు వినతిపత్రం అందజేశారు. లీడర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, సీఎండీలు కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోలేదని, వారి సంక్షేమం, చట్టపరమైన హక్కులను కల్పించడంపై నిర్లక్ష్యం చేశారన్నారు.
వేతనాలు పెంచుతూ లాభాల్లో వాటా కేటాయించాలని కోరారు. 11వ పీఆర్సీలో భాగంగా రాష్ట్ర సర్కారుఇతర ఔట్సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచినా కాంట్రాక్ట్ కార్మికులపై వివక్ష చూపిందన్నారు. సీఎండీని కలిసిన వారిలో యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మనందం తదితరులు ఉన్నారు.