కేంద్రం వద్దన్నా సీఎండీగా శ్రీధర్​ దిగట్లేదు

కేంద్రం వద్దన్నా సీఎండీగా శ్రీధర్​ దిగట్లేదు
  • ​​​​​​మితిమీరుతున్న రాజకీయ జోక్యం
  • ఆర్థిక సంవత్సరం ముగిసినా లాభాల ప్రకటన లేదు
  • గడువు దాటినా గుర్తింపు సంఘం ఎన్నికల్లేవ్

మందమర్రి, వెలుగు:  ఓ దిక్కు కేంద్ర ప్రభుత్వం వద్దన్నా సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను కొనసాగిస్తారు.. మరో దిక్కు వివిధ కుంభకోణాల్లో బాధ్యులైన ఆఫీసర్ లపై కనీస చర్యలు తీసుకోరు.. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలైనా లాభాలు ప్రకటించరు.. గడువు దాటినా గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టరు.. ఇంకో దిక్కు కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది.. ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఖర్చు పెట్టాల్సిన డీఎంఎఫ్ టీ ఫండ్స్ ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయి.. ఇలా సింగరేణిలో గతంలో ఎన్నడూ లేనంతగా  విచ్చలవిడితనం పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చైర్ వదలని ఆఫీసర్లు
2015 జనవరి1న సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ పదవీకాలం 2016 డిసెంబర్ 31నే ముగిసింది. కానీ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఒకసారి రెండేళ్లు, రెండుసార్లు ఏడాది ఎక్స్​టెన్షన్ ఇచ్చింది. ఐదేళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని రూల్స్ చెబుతున్నాయి. కానీ శ్రీధర్ ఇప్పటికే సీఎండీ పదవిలో ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. జనవరి2021లో సింగరేణి సీఎండీగా శ్రీధర్​ను కంటిన్యూ చేసేందుకు కేంద్రం నో చెప్పినా ఆయన మాత్రం కుర్చీ దిగలేదు. సింగరేణి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్​లో శ్రీధర్ ఎక్స్​టెన్షన్​  కోసం పెట్టిన రిజెల్యూషన్​ను సెంట్రల్ కోల్ మినిస్ర్టీ ప్రతినిధి వ్యతిరేకించారు. సీఎండీగా శ్రీధర్​ను కంటిన్యూ చేయడం కేంద్రానికి ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినా.. రాష్ట్ర సర్కార్ సాయంతో  ఆర్డినరీ రిజెల్యూషన్​పాస్ చేయించుకొని ఆయన పదవిలో కొనసాగుతున్నారు. మరోవైపు రిటైర్డు ఉద్యోగులను సలహాదారులుగా  నియమిస్తూ ఏటా రూ. కోట్లు సంస్థపై భారం పెంచుతున్నారు. ఒడిశాలోని నైనీ బ్లాక్, న్యూపాత్రపాద బొగ్గు బ్లాకుల కోసం రిటైర్డు జీఎంను సలహాదారునిగా నియమించారు. మైనింగ్ అడ్వైజర్, జైపూర్ ఎస్టీపీపీ, అటవీశాఖ, ఈఆర్పీ, లీగల్ అడ్వైజర్​ఇలా రకరకరాల పేర్లతో సలహాదారులను నియమించుకొని నెలనెలా లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు.

డైరెక్టర్లు లేక గాడితప్పిన పాలన
సింగరేణిలో పూర్తిస్థాయి డైరెక్టర్లు లేక పాలన గాడి తప్పుతోంది. రాష్ట్ర సర్కార్​కు అండగా ఉన్న కీలక ఆఫీసర్ ఒకరు ఇతరులను నియమిస్తే సర్కార్ పనులు సాఫీగా సాగవని భావించి పట్టించుకోవడం లేదనే  ఆరోపణలున్నాయి. గతేడాది సెప్టెంబర్​లో సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్, ప్లానింగ్) పోస్టుకు ఈస్ర్టన్​కోల్​ఫీల్డ్స్ డైరెక్టర్ గా పని చేస్తున్న వీరారెడ్డిని ఎంపిక చేస్తే ఇప్పటివరకు ఆయన బాధ్యతలు తీసుకోలేదు. 2014 నుంచి ఐఏఎస్ ఆఫీసర్ చేపట్టాల్సిన డైరెక్టర్(పా) పోస్టు ఖాళీగా ఉంది. డైరెక్టర్(ఫైనాన్స్)గా కొనసాగుతున్న బలరామ్​కు డైరెక్టర్ పా, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ తో పాటు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్​బాధ్యతలు సైతం అప్పగించారు. దీని వల్ల పాలన గాడి తప్పుతోందనే విమర్శలున్నాయి.

సింగరేణిపై రాజకీయ పెత్తనం 
సింగరేణికి సంబంధించిన వివిధ అంశాలపై బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్​లో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజాప్రతినిధులు సింగరేణిలో నేరుగా జోక్యం చేసుకోకపోయేవాళ్లు. కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో ప్రజాప్రతినిధులు తరచూ వేలు పెడుతున్నారు.ఈ క్రమంలో గుర్తింపు సంఘంగా గెలిచిన యూనియన్ల ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. 2017 అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. సీఎం కార్మికులకు ఇచ్చిన పలు హామీలను అమలు చేసే విషయంలో యాజమాన్యం ఆ సంఘంతో సంప్రదించకుండానే అనేక ఉత్తర్వులు జారీ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనిది కోల్​బెల్ట్ ప్రాంతాల ప్రజాప్రతినిధులకు సింగరేణిలో ప్రొటోకాల్ పాటించేలా సర్కారు నిర్ణయించింది. ప్రతి ఏటా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల లీడర్లను పిలిచి సంస్థ సాధించిన లాభాల నుంచి వాటాను సీఎం ప్రకటించేవారు. కానీ ఇప్పుడు ఏ యూనియన్​ను పిలవకుండానే సీఎం నేరుగా లాభాల వాటాను ప్రకటిస్తున్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్(డీఎంఎఫ్​టీ) కింద ఆరు జిల్లాలకు 2015 నుంచి 2021 జనవరి వరకు రూ.2,729.35 కోట్లు కేటాయించింది. ఆ ఫండ్స్​ను సింగరేణి ప్రభావిత గ్రామాలు, పట్టణాల్లో  మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉండగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు సింగరేణేతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

అవినీతి, అక్రమాలపై చర్యలేవి?
సింగరేణిలో పెద్దఎత్తున బొగ్గు అక్రమ రవాణా చేసినా, ఇసుక దొంగతనంగా తరలించినా, సింగరేణి సామగ్రిని దారి మళ్లించినా, ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. బొగ్గు క్వాలిటీ తగ్గించినా, ఓసీపీ గనుల్లో మట్టి వెలికి తీసే కాంట్రాక్టర్ సంస్థకు అనుకూలంగా లీడ్​ను తగ్గించినా, మెడికల్ అన్ ఫిట్​ కేసుల్లో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నా యాక్షన్​ ఉండడం లేదు. దీంతో ఇదే అదనుగా మరిన్ని కొత్త కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయి. మేడిపల్లి ఓసీపీ గని నుంచి సీహెచ్​పీకి వెళ్లాల్సిన బొగ్గు లారీలు పక్కదారి పట్టిన వ్యవహారంలో ఎంక్వైరీ ఇంకా కొలిక్కి రాలేదు. గతంలో జరిగిన మెడికల్ అన్​ఫిట్​కేసుల్లో కొంతమంది సింగరేణి డాక్టర్ల బ్యాంకు అకౌంట్లలో పెద్దమొత్తంలో సొమ్ము జమ అయినట్లు గుర్తించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బెల్లంపల్లి ఏరియా నుంచి 600 పైగా లారీల బొగ్గు అక్రమ రవాణా అయినట్లు పోలీసులు గుర్తించినా దీనిపై ఎంక్వైరీ అర్ధంతరంగా ఆగింది. శ్రీరాంపూర్ ఓపెన్​కాస్ట్​ గనిలో మూడేళ్ల కింద రూ.200 కోట్ల డీజిల్ స్కాం వెలుగులోకి వస్తే రెండేళ్లు ఎంక్వైరీ చేయించిన సింగరేణి యాజమాన్యం కేవలం 28 మంది ఆఫీసర్లు, ఇతర ఎంప్లాయీస్​కు చార్జీషీట్ జారీ చేసి మిన్నకుంది. ఇందులో అప్పటి డైరెక్టర్, ఏరియా జీఎంతో పాటు కీలక ఆఫీసర్ల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. స్కాం జరిగిన  ఓబీ కాంట్రాక్ట్ కంపెనీలోనే మాజీ డైరెక్టర్ ప్రస్తుతం ఉద్యోగిగా కొనసాగుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక అనేక అనుమానాలున్నాయి. కోయగూడెం ఓసీపీలో డీజిల్ కుంభకోణంపై కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. శ్రీరాంపూర్ ఏరియాలో రిటైర్డు  జీఎంపై పెద్ద ఎత్తున అవినీతి కంప్లెయింట్స్ ఉన్నాయి. జైపూర్​లోని  ఎస్టీపీపీలో ఇసుక అక్రమ రవాణా జరిగినా, ఇనుప స్క్రాప్ పక్కదారి పట్టినా చర్యలు లేవు. 

గడువు దాటినా ఎన్నికల్లేవ్
కాలపరిమితి ముగిసినప్పటికీ సింగరేణిలో టీబీజీకేఎస్ ఇప్పటికీ గుర్తింపు సంఘంగా కొనసాగుతోంది. 2017 అక్టోబర్ 11న గెలిచిన టీబీజీకేఎస్ రెండేళ్లు మాత్రమే గుర్తింపు సంఘం హోదాలో ఉండాలని ఇప్పటికే లేబర్ కమిషనర్ సింగరేణి యాజమాన్యానికి పలుసార్లు లెటర్లు ఇష్యూ చేశారు. ఏడాది క్రితమే రెండేళ్ల టైం పూర్తయినా రాష్ట్ర సర్కార్ నేటికీ ఎలక్షన్స్ నిర్వహించకపోవడంతో ఇప్పటికీ టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా దర్జాగా కొనసాగుతోంది. సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను ప్రకటించడంలోనూ యాజమాన్యం ప్రతి ఏటా ఆలస్యం చేస్తోంది. 2020–-21 ఫైనాన్సియర్ ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలను ప్రకటించలేదు. లాభాల్లోంచి కార్మికుల వాటాను రాష్ట్ర సర్కార్ ప్రకటించాల్సి ఉండడంతో లేట్​ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై గుర్తింపు సంఘం లీడర్లుగానీ, ప్రజాప్రతినిధులు గానీ ఒత్తిడి చేసే పరిస్థితి లేకుండా పోయింది.