
గోదావరిఖని, వెలుగు: సింగరేణి గనుల్లో ప్రమాదాల నివారణకు మేనేజ్మెంట్ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేప్టీ(మైనింగ్) ఎన్.నాగేశ్వరరావు సూచించారు. గురువారం గోదావరిఖని సింగరేణి ఎల్లందు క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో సింగరేణి ఆర్జీ 1 ఏరియా జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య అధ్యక్షతన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఎస్ మాట్లాడుతూ.. గనుల్లో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గేలా, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందుకు సంబంధించి ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం గనుల్లో జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికులను స్మరిస్తూ అధికారులు, యూనియన్ నాయకులు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఎలక్ట్రికల్ డీఎంఎస్ రాజ్‌కుమార్, సింగరేణి డైరెక్టర్ ఎల్.వి.సూర్యనారాయణ, సేప్టీ జీఎం చింతల సూర్యనారాయణ, డీడీఎంఎస్‌లు దిలీప్‌కుమార్, రాజీవ్ ఓంప్రకాశ్వర్మ, కనకం ప్రేమ్ కుమార్, రీజియన్ సేప్టీ జీఎం ఎస్.మధుసూధన్, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, ఏరియా సేప్టీ ఆఫీసర్ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.