సింగరేణికి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

సింగరేణికి  ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి స్వీకరించిన సీఎండీ బలరామ్​

హైదరాబాద్, వెలుగు: సింగరేణిని జాతీయ స్థాయి ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు వరించాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న గనుల్లో స్టార్ రేటింగ్ లో సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ముంబైలో గురువారం జరిగిన అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నుంచి సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ అవార్డు స్వీకరించారు.

 రామగుండం –-3 ఏరియాకు చెందిన ఆర్‌‌‌‌జీ ఓసీ –-1 ఎక్స్‌‌‌‌టెన్షన్, ఇల్లందు ఏరియాకు చెందిన జేకే –-5 ఓసీ, శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్‌‌‌‌కే – -6 భూగర్భ గని, ఆర్‌‌‌‌కే న్యూటెక్ గనులు అవార్డులు దక్కించుకున్నాయి. ఆయా గనులు ఉత్పత్తి సాంకేతికత, పర్యావరణ హిత చర్యలు, కార్మిక సంక్షేమం, రక్షణ చర్యలు, నిర్వహణ వంటి 84 అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలను సాధించాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఏటా దేశవ్యాప్తంగా ఉత్తమ గనులను ఎంపిక చేసి స్టార్ రేటింగ్‌‌‌‌లను ప్రకటిస్తుంది. 

100 మార్కులకు 91 కంటే ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ లభిస్తుంది. కేంద్ర బొగ్గు శాఖ పరిశీలక బృందం గనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత అత్యుత్తమ గనులను ఎంపిక చేసి, మరో కమిటీ ద్వారా ఫైవ్ స్టార్ రేటింగ్ గనులను ఖరారు చేస్తారు. సీఎండీ ఎన్. బలరామ్ మాట్లాడుతూ నాలుగు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం సింగరేణి చరిత్రలోనే అరుదైన విజయమని పేర్కొన్నారు. 

అధికారులు, కార్మికుల కృషి, అంకితభావానికి అవార్డులు నిదర్శనమని తెలిపారు.  సింగరేణికి చెందిన మరో 14 గనులు 80 నుంచి 90 మార్కులు సాధించి ఫోర్ స్టార్ రేటింగ్‌‌‌‌ 20 గనులు త్రీ స్టార్ రేటింగ్‌‌‌‌ను పొందాయని చెప్పారు. గతంలో కొన్ని గనులకు టూ స్టార్ రేటింగ్‌‌‌‌ లభించగా, ఈసారి అన్ని గనులూ కనీసం త్రీ స్టార్ రేటింగ్ సాధించడం విశేషమని తెలిపారు.