సింగరేణి గరం గరం..ఓపెన్ కాస్ట్ ల్లో పెరిగిన ఎండ వేడి..వేడి, పొగతో కార్మికులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి

సింగరేణి గరం గరం..ఓపెన్ కాస్ట్ ల్లో పెరిగిన ఎండ వేడి..వేడి, పొగతో కార్మికులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి
  • బయటకన్నా 4 –5 డిగ్రీల ఉష్టోగ్రత ఎక్కువ 
  •  పని వేళలను మార్పుచేయని ఆఫీసర్లు

గోదావరిఖని, వెలుగు : సమ్మర్ ఎండల తీవ్రతతో  సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (ఓసీపీ)లు మరింత హీటెక్కాయి. బయటి వేడి కన్నా 4 –5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతోంది. దీంతో ఓసీపీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారులు పనివేళలను మార్చకపోవడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఓసీపీలనే సింగరేణి ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అండర్ గ్రౌండ్ మైన్ల (యుజీ)తో సంస్థకు భారీగా నష్టం వస్తుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

యుజీల్లో మిగిలిన బొగ్గు నిల్వలను తీసేందుకే ఓసీపీలుగా మార్చింది.  సింగరేణిలో ప్రస్తుతం 17 ఓసీపీలు ఉండగా.. వీటిలో14 వరకు యుజీలుగా మార్చినవే. గతంలో యుజీల్లో బొగ్గు వెలికితీసిన తర్వాత కొంతకాలం అందులో ఎలాంటి మైన్​యాక్టివిటీ చేయకపోవడంతో గ్యాస్​తయారవుతుంది. యుజీని ఓసీపీగా మార్చిన తర్వాత ఆ గ్యాస్​బయటకు వెలువడి ఆక్సిజన్​తో కలిసి బొగ్గును మండిస్తుంది. ఇలా ఓసీపీల్లో నిత్యం బొగ్గు మండిపోతుండగా వేడి ఎక్కువగా ఉంటుంది. అయితే.. బొగ్గు మంటలను నీటితో.. ఇసుకతో గానీ కప్పివేస్తూ బొగ్గు వెలికితీత పనులను అధికారులు చేయిస్తుంటారు. నీటిని సరిగా చల్లకపోవడం వల్ల పొగ  విపరీతంగా వచ్చి  కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఇంజిన్ల హీట్ తో వెహికల్స్ కు రెస్ట్ 

ఓసీపీల్లో బొగ్గును సర్ఫేస్​కు తీసుకొచ్చేందుకు డంపర్లను, వాటిలో బొగ్గును నింపేందుకు షావల్​ వెహికల్స్​ను వినియోగిస్తారు. కొన్ని వెహికల్స్​పని గంటలు, ఎక్పైరీ డేట్, కిలోమీటర్లు పూర్తయి సర్వే ఆఫ్​(వెహికల్​ను పక్కకు పెట్టడం) అయినా వాటినే నడిపిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతతో ఆ వెహికల్స్ ఇంజన్లు హీటెక్కుతున్నాయి.  దీంతో కొంత సేపు వాటిని ఆపాల్సి వస్తుంది.  ఇంజిన్​చల్లారిన తర్వాత తిరిగి మెషీన్లను నడపాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. ఇది బొగ్గు వెలికితీతపై ప్రభావం చూపుతుంది. 

మారని పనివేళలతో కార్మికుల ఆందోళన

ఓసీపీల్లో మూడు షిప్టుల్లో కార్మికులు, ఉద్యోగులకు డ్యూటీ వేళలు ఉండగా.. మొదటిది ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రెండోది 3 గంటల నుంచి రాత్రి11 గంటల వరకు, మూడోది రాత్రి11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 7 గంటల వరకు ఉంటాయి. అయితే.. సమ్మర్ లో షిప్ట్ ల వేళలను మార్చాలని కొంతకాలంగా యూనియన్​ లీడర్లు కోరుతున్నారు. ఉదయం షిప్ట్ 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో షిప్ట్  సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వర కు మార్చాలని డిమాండ్​చేస్తున్నారు. దీనిపై సింగరేణి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 

46 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువే.. 

ఓసీపీల్లో మట్టి తొలగింపు (ఓవర్​బర్డెన్​)తో పాటు బొగ్గు తీసేందుకు బ్లాస్టింగ్​చేస్తుంటారు.  దీంతో ఉద్యోగులు, ఓబీ కంపెనీకి చెందిన సిబ్బంది క్వారీలోకి వెళ్లి పని చేస్తారు. ప్రస్తుతం కోల్​బెల్ట్ ఏరియాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. బయట ఉండే ఉష్ణోగ్రత కన్నా క్వారీలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా5 డిగ్రీలు ఎక్కువగానే ఉంటుంది. దాదాపు 46 డిగ్రీలకుపైగానే  నమోదువుతోంది. క్వారీల్లో ఎండవేడికి అనుగుణంగా ఉద్యోగులు, కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు రెస్ట్​షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ఓఆర్ఎస్​, మజ్జిగ ప్యాకెట్లు మాత్రమే ఇస్తుండగా.. సరిపడా రెస్ట్​షెల్టర్లనైతే ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల గ్రీన్​మ్యాట్​ఏర్పాటు చేసి వదిలిపెట్టారని, దీంతో ఎండకు తట్టుకోలేకపోతున్నామని కార్మిక యూనియన్​ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.