సింగరేణి దవాఖాన్లలో  స్పెషలిస్టుల కొరత.. మూడు నెలల కింద ఇంటర్వ్యూలు పూర్తి

సింగరేణి దవాఖాన్లలో  స్పెషలిస్టుల కొరత.. మూడు నెలల కింద ఇంటర్వ్యూలు పూర్తి
  • నేటికీ అందని జాయినింగ్​ ఆర్డర్స్​
  • 120 మంది టెక్నీషియన్​, వైద్య సిబ్బంది నియామకాలు పెండింగ్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం కష్టసాధ్యంగా మారుతోంది. సింగరేణి హాస్పిటల్స్​లో డాక్టర్లు, వైద్య సిబ్బంది, టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు, కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాల్సిన హాస్పిటళ్లలో సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

స్పెషలిస్ట్ డాక్టర్లను 32 మందిని నియమించేందుకు యాజమాన్యం గతంలో నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయినప్పటికీ మూడు నెలలుగా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో డాక్టర్లు ఇతర ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రుల వైపు  వెళ్లిపోతున్నారు.

అందని వైద్య సేవలు, ఆందోళనలో రోగులు..

సింగరేణి కార్యకలాపాలు విస్తరించిన ఆరు జిల్లాల్లో కంపెనీ ఆధ్వర్యంలో ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో హాస్పిటళ్లతో పాటు మరో 21 డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటి ద్వారా అధికారులు, కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా డాక్టర్లు, టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని కార్మికులు చెబుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు 32 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికీ ఇప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో డాక్టర్లు ఇతర ఆసుపత్రుల్లో అవకాశాలు వెతుక్కుంటున్నారని సమాచారం.

టెక్నీషియన్లు, నర్సుల నియామకాల్లోనూ జాప్యం..

సింగరేణిలో ల్యాబ్, ఎక్స్    రే టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు తదితర వైద్య సిబ్బంది 120 మందికి పైగా ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా నియమించాలని వైద్య విభాగం ప్రణాళికలు రూపొందించారు. దీంతో సమస్య తీరుతుందని అందరూ భావించారు. కానీ నియామక నోటిఫికేషన్​ ప్రతిపాదనలకే పరిమితమైంది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతోంది.

దీంతో రోగులకు నాణ్యమైన చికిత్స అందడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.