వైద్యుల కొరతకు -చెక్.. సింగరేణిలో స్పెషలిస్టు డాక్టర్ల రిక్రూట్ మెంట్

వైద్యుల కొరతకు -చెక్.. సింగరేణిలో స్పెషలిస్టు డాక్టర్ల రిక్రూట్ మెంట్
  • ప్రధాన ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు నిర్ణయం
  • మరోవైపు మెషీన్లున్నా.. వేధిస్తోన్న టెక్నీషియన్ల కొరత

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి ఆస్పత్రుల్లో త్వరలోనే డాక్టర్ల కొరత తీరనుంది. ఇటీవల ప్రధాన ఆస్పత్రుల్లో ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లల నియామక  ప్రక్రియ పూర్తి అయింది.  దీంతో కార్మికులు, ఉద్యోగులు, కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. సింగరేణివ్యాప్తంగా కొత్తగూడెంలో మెయిన్ ఆస్పత్రి ఉండగా.. రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి, మణుగూరు, ఇల్లందులో ఏరియా ఆస్పత్రులు, వివిధ ప్రాంతాల్లో మరో 21 డిస్పెన్సరీలు ఉన్నాయి.

వీటిలో 821 బెడ్స్​,180 మంది డాక్టర్లు,57 మంది స్పెషలిస్టులు,123 మంది మెడికల్​ఆఫీసర్లు,1,120 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 42 వేల మంది కార్మికులు, ఉద్యోగులతో పాటు వీరిపై ఆధారపడి 60 వేల మంది వరకు కుటుంబసభ్యులు, ఇంకో 40 వేల దాకా రిటైర్డ్ కార్మికులు ఉంటారు. వీరికి సింగరేణి ఆస్పత్రుల్లోనే వైద్యసేవలు అందించాలి. అయితే.. ఏండ్లుగా ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లు లేరు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్​చేస్తున్నారు. చిన్న జబ్బులకు, ఆపరేషన్లకు బయటకు పంపిస్తుండగా సింగరేణిపై ఆర్థికభారం పడుతోంది. మరోవైపు సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారు. దీంతో సింగరేణిలో వేధించే డాక్టర్ల కొరత తీర్చేందుకు సంస్థ అధికారులు ఇటీవల 32 మంది స్పెషలిస్టు డాక్టర్లను రిక్రూట్ చేసింది.  

మెషీన్లు కొనుగోలు చేసినా...

మరోవైపు టెక్నీషియన్ల కొరత కూడా ఉంది. రూ.కోట్లు పెట్టి మెషీన్లు కొనుగోలు చేసినా వినియోగించేందుకు టెక్నీషియన్లు లేరు. సింగరేణిలో  ఏటా వైద్యసేవలకు రూ.140కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో సూపర్​స్పెషాలిటీ వైద్యానికి రూ.100 కోట్లు, మెడిసిన్ కు రూ.40కోట్లు అందిస్తోంది. డాక్టర్లలో కొందరు స్పెషలిస్టులు ఉన్నప్పటికీ ట్రీట్ మెంట్ చేయకుండా ప్రతి చిన్న కేసును కూడా ప్రైవేట్ కు రెఫర్ చేస్తున్నారు. అదేవిధంగా వైద్యానికి దూర ప్రాంతాలకు పంపిస్తుండగా పేషెంట్ వెంట మరో అటెండెంట్​ వెళ్లాల్సి ఉంటుంది. ఇది కార్మిక కుటుంబానికి అదనపు భారంగా మారింది. రెఫర్ చేయడాన్ని మానుకోవాలని ఇటీవల సింగరేణి అధికారులు ఆదేశించారు.

135 మందికి ఇంటర్వ్యూలు  

సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లోని ఖాళీల భర్తీకి కీలకమైన 9 విభాగాల్లో 32 మంది స్పెషలిస్టు డాక్టర్లను ఎంపిక చేశారు. ఇందులో జనరల్ సర్జన్ 4 , గైనకాలజిస్ట్ 7, పిడియాట్రీషియన్ 4,  చెస్ట్ ఫిజీషియన్ 3 పోస్టులు, ఈఎన్ టీ సర్జన్ 2, అనస్థిటిస్ట్- 7, పాథాలజిస్ట్-1, హెల్త్ ఆఫీసర్-3, సైకియాట్రిస్ట్-1 పోస్టులకు 135 మందిని ఇంటర్వ్యూలు చేశారు. త్వరలోనే వీరి సేవలు అందుబాటులోకి రానుండగా.. పూర్తిస్థాయిలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది.

ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల నియామకంతో దూర ప్రాంతాలకు వెళ్లే సమస్య కూడా తొలగనుంది.  మరోవైపు సింగరేణి ఏరియాలో గుండెపోటు మరణాలు కూడా పెరుగుతుండడంతో గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో క్యాథ్​ల్యాబ్​ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. పీపీఈ పద్ధతిలో క్యాథ్​ల్యాబ్​సేవలను అందించనున్నట్లు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీంతో సింగరేణి కార్మికులతో పాటు ఉద్యోగుల్లోనూ ఆశలు చిగురించాయి.