
- కార్మిక సంఘాలతో డీసీఎల్‌సీ మీటింగ్
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఆగస్టులో నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది. మంగళవారం హైదరాబాద్ లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (డీసీఎల్ సీ) శ్రీనివాసులు సమక్షంలో గుర్తింపు సంఘం ఎన్నికలపై కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి మేనేజ్మెంట్ చర్చించింది. నాలుగేండ్ల పీరియడ్‌తో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉండాలని మేనేజ్ మెంట్ ప్రతిపాదించింది. ప్రతి రెండేండ్లకు ఎన్నికలంటే బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నదని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు మెజారిటీ కార్మిక సంఘాలు ఓకే చెప్పాయి. మరికొన్ని సంఘాలు రెండేండ్ల పీరియడ్ తో ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి. మెజారిటీ సంఘాలు, మేనేజ్మెంట్ కలిసి నాలుగేండ్ల పీరియడ్ పై చీఫ్ లేబర్ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈనెల 24 లోపు సీఎల్సీ నుంచి అనుమతి వస్తుందని, అదే రోజు మీటింగ్‌కు కార్మిక సంఘాల నేతలు సమ్మతి తెలిపారు. అదే రోజు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని సింగరేణి డైరెక్టర్(పా) అంగీకరించినట్లు కార్మిక సంఘాల లీడర్లు పేర్కొన్నారు.