
- ఆగస్టు నుంచి కోల్ ఇండియా క్రీడా పోటీలు
- సింగరేణిలో ఇంటర్నల్ క్రీడలపై ఇంకా లేని స్పష్టత
- సంస్థ బడ్జెట్ క్రీడలకు నిధులు పెంచకపోవడంతో ఇబ్బందులు
కోల్‌బెల్ట్, వెలుగు : కార్మిక క్రీడాకారుల పట్ల సింగరేణి నిర్లక్ష్యం చేస్తోంది. క్రీడల్లో ప్రోత్సహిస్తామని, సౌలత్లు కల్పిస్తామని క్రీడా పోటీల సందర్భంగా సింగరేణి యాజమాన్యం, ఆఫీసర్లు చెబుతుంటారు. మూడేండ్లుగా కార్మిక క్రీడా కారులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, షూలు, మెటీరియల్పంపిణీ చేయలేదు. కేవలం సంస్థలో ఇంటర్నల్పోటీల నిర్వహణ సమయంలోనే యాజ మాన్యం హడావుడి చేస్తుందని క్రీడాకారులు విమర్శిస్తున్నారు. ఇప్పటికీ సింగరేణి క్రీడాకారులు పాత సామగ్రితోనే క్రీడాపోటీల్లో పాల్గొంటున్న దుస్థితి నెలకొంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సొంత ఖర్చులతోనే కొనుగోలు చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు.
సింగరేణివ్యాప్తంగా 11 ఏరియాల్లో ఏరియా, సింగరేణి, కోలిండియా స్థాయి పోటీల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాత మెటీరియల్ లోనే వివిధ క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. మరోవైపు సింగరేణి యాజమాన్యం ఏటా క్రీడల నిర్వహణకు మంజూరు చేసే బడ్జెట్అరకొరగా ఉంటుంది. క్రీడాకారులు బడ్జెట్ పెంచాలని ఎన్నిసార్లు విన్నవించినా యాజమాన్యం స్పందించడంలేదు. దీంతో ఉన్న దాంట్లోనే సర్దుకుపోతున్నారు. సింగరేణిలోని స్టేడియాలు, గ్రౌండ్ల అభివృద్ధిపైనా యాజమాన్యం నిర్లక్ష్యమే చూపు తుంది. ఏవైనా పోటీలు ఉంటే రెండు, మూడు రోజుల ముందే హడావుడిగా ఏర్పాట్లు చేస్తుంది. అనంతరం ఏం పట్టించుకోదు.
ఇంటర్నల్ పోటీలెప్పుడో..
కోలిండియా స్థాయి పోటీల తేదీలు ఖరారు కాగా.. సింగరేణిలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. కోలిండియా పోటీల్లో ఎనిమిది రాష్ట్రాల్లోని బొగ్గు కంపెనీల క్రీడాకారులు పాల్గొంటారు. సింగరేణి స్థాయిలో ఇంటర్నల్పోటీల్లో ప్రతిభ చూపినవారిని కోలిండియా, పబ్లిక్సెక్టార్కంపెనీల పోటీలకు పంపుతుంది. సింగరేణి క్రీడాకారులను సిద్ధం చేయడంతో పాటు జట్ల ఎంపికకు ఇంటర్నర్పోటీలు నిర్వహించడంలేదు. ఆగస్టు నుంచి కోలిండియా పోటీలు, తొలి బీసీసీఎల్ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్పోటీలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్‌లో డబ్ల్యూసీఎల్ఆధ్వర్యంలో వెయిట్, పవర్‌లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, అక్టోబర్‌లో క్యారమ్స్(సీఐఎల్), నవంబర్‌లో టేబుల్‌టెన్నిస్(ఎన్సీఎల్), కల్చరల్పోటీలు(డబ్ల్యూసీఎల్) కబడ్డీ(సింగరేణి), డిసెంబర్లో అథెటిక్స్(ఈసీఎల్), ఫుట్‌బాల్(ఎన్సీఎల్), హాకీ(ఎస్ఈసీఎల్) పోటీలు జరుగుతాయి. ఆయా పోటీలకు పంపాలంటే ముందుగా సింగరేణి ఇంటర్నల్పోటీల నిర్వహణకే రెండు నెలలు పడుతుంది. సింగరేణిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే కార్మిక క్రీడాకారులు ఉన్నప్పటికీ.. వారికి సరైన ప్రాక్టీసు చేసుకోవడానికి యాజమాన్యం ఏర్పాట్లు చేయడంలేదు.
ఏడేండ్లుగా స్పోర్ట్స్ఆఫీసర్ లేక..
సింగరేణిలో క్రీడల అభివృద్ధితో పాటు స్టేడియాలు, గ్రౌండ్ల డెవలప్, పోటీల నిర్వహణ చూసుకునే, క్రీడల నిర్వహణ బాధ్యులను కూడా నియమించడంలేదు. ఏడేండ్ల కిందట పూర్తిస్థాయి సింగరేణి స్పోర్ట్స్ఆఫీసర్ రాజ కొమురయ్య రిటైర్డ్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించకుండా ఇతర విభాగాల ఆఫీసర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏరియా, రీజియన్ పరిధిలో క్రీడల నిర్వహణ చూసే స్పోర్ట్స్సూపర్వైజర్లు కూడా రిటైర్ అవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు రీజియన్సూపర్వైజర్లు రిటైర్డు కాగా, మరో రెండేండ్లలో ఇంకో ఐదుగురి సర్వీసు ముగియనుంది. కొత్తవారి ఎంపికపైనా దృష్టి సారించడంలేదు.
స్పోర్ట్స్డ్రెస్లు, మెటీరియల్ అందించాలి
సింగరేణిలో క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సాహించాలి. మూడేండ్లుగా కార్మిక క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూలు, మెటీరియల్ఇవ్వడంలేదు. యాజమాన్యం వెంటనే స్పోర్ట్స్ డ్రెస్‌లు, మెటీరియల్అందించాలి - దేవి భూమయ్య, ఐఎన్టీయూసీ లీడర్