- కోర్టులో పోరాడకుండా మీడియాను అడ్వకేట్ సుబ్బారావు తప్పుదారి పట్టిస్తున్నరు
- సింగర్ మంగ్లీ తమ్ముడు శివ చౌహన్
బషీర్ బాగ్, వెలుగు: సింగర్ మంగ్లీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆమె తమ్ముడు శివ చౌహన్ స్పష్టం చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబంపై జరుగుతున్న అసత్య ఆరోపణల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తీజ్ పండుగ, వెంచర్ ఆఫీస్ ప్రారంభం వంటి సందర్భాల్లో దిగిన ఫొటోలను మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో ముడిపెట్టడం బాధాకరమని అన్నారు.
రియల్ ఎస్టేట్ ప్లాట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో జరిగిన పరిచయాన్ని అడ్డుపెట్టుకుని, డబ్బులు తీసుకున్నట్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఎవరూ తమ పేర్లు ప్రస్తావించలేదని, అడ్వకేట్ సుబ్బారావు కోర్టులో పోరాడకుండా మీడియా ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తామెప్పుడూ ఎవరినీ బెదిరించలేదని, చట్టప్రకారమే ఈ ఆరోపణలను ఎదుర్కొంటామని శివ చౌహన్ పేర్కొన్నారు.

