
కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలసుబ్రమణ్యం శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 5న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఎక్మో ట్రీట్‌మెంట్‌తో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 01:04 గంటలకు చనిపోయారు. దాదాపు 50 రోజులపాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన 1946, జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో జన్మించారు. ఆయన 40 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఆయన పాటలు పాడారు. అత్యధిక పాటలు పాడిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు పలు పురస్కారాలు దక్కాయి. ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు.
బాలు పూర్తి జీవిత చరిత్ర
సుప్రసిద్ధ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా పలు చిత్రపరిశ్రమలకు సుపరిచితుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ బహుమతులు సాధించాడు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
జననం
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 (వయస్సు: 74 సంవత్సరాలు) కోనేటమ్మపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నివాసం – చెన్నై, తమిళనాడు. ఇతర పేర్లు – బాలు, గాన గంధరర్వుడు. వృత్తి – నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు. క్రియాశీలక సంవత్సరాలు 1965 – ప్రస్తుతం. మతం – శైవ బ్రాహ్మణ హిందూ. జీవిత భాగస్వామి – సావిత్రి. పిల్లలు – చరణ్ & పల్లవి. తల్లిదండ్రులు – శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (తండ్రి) శకుంతలమ్మ (తల్లి)
బాల్యం, విద్యాభ్యాసం
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. బాల్యంనుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు. చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు.
నటనలో ప్రవేశం
బాలు 1969లో మొదటిసారిగా పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైన చిత్రాలలో నటించారు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేశాడు. ఆయన సినిమాల్లోనే కాక టీవీ రంగంలో కూడా పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.
వృత్తి జీవితం
బాలసుబ్రహ్మణ్యం మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా జీవితం ప్రారంభించాడు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని పేరే పెట్టుకున్నాడు. చాలా మంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ తుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్థానంలో 11 భాషలలో 40 వేల పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.
1990లో వచ్చిన కేలడి కన్మణి అనే తమిళంలో చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించాడు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. డబ్బింగ్ కళాకారుడిగా కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్‌కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశాడు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం 2016 వరకు కొనసాగింది.
పురస్కారాలు
బాలు కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో గవర్నరు రంగరాజన్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. గోవాలో 2016 నవంబరులో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2016) ప్రదానం చేశారు.
భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
బాలుకు భార్య పేరు సావిత్రి. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్‌ను వివాహమాడింది.