మూగబోయిన సుస్వర ‘వాణి’

 మూగబోయిన సుస్వర ‘వాణి’

ఐదు పదుల సంగీత ప్రయాణం.. మధురగానంతో ఓలలాడించిన గాత్రం..  ఆమె స్వరం అజరామరం.. పాడిన ప్రతి పాట ఆణిముత్యం. క్లాసికల్ అయినా, కమర్షియల్ అయినా.. జానపదమైనా, భక్తి గీతమైనా... వాణీ జయరాం పాడితే అదొక అద్భుతం. భాష ఏదైనా ఆమె గొంతులో పలుకని రాగం లేదు. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన గానంతో మంత్ర ముగ్ధులను చేసిన సుస్వర ‘వాణి’ మూగబోయింది.

ఎనిమిదేళ్లకే కచేరి

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించారు వాణి. ఆమె అసలు పేరు కలైవాణి. తల్లిదండ్రులు దురైస్వామి, పద్మావతి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుండే కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి.. ఎంతో కష్టమైన ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు పాడేవారు. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ కూడా చేశారు. సినిమాల్లో పాటలు పాడాలనేది ఆమె కోరిక. కానీ శాస్త్రీయ సంగీతం తప్ప సినిమా పాటలను ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. పెళ్లి తర్వాత భర్త జయరాం ఆమెను సినిమాల్లో పాడేందుకు ప్రోత్సహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్‌‌ బ్రాంచ్‌‌లో వాణి ఉద్యోగం చేస్తున్న సమయంలో.. జయరాంతో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ముంబై షిప్ట్ అయ్యారు. 

తొలిపాటతోనే హిందీలో స్టార్‌‌‌‌డమ్

జయరాంకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే అప్పటికే కర్ణాటక మ్యూజిక్‌‌ నేర్చుకున్న వాణిను.. హిందుస్థానీ కూడా నేర్చుకోమని ప్రోత్సహించారు. దాంతో ముంబైలో చేస్తున్న ఎస్‌‌.బి.ఐ బ్యాంక్‌‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ ఖాన్ దగ్గర  హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నారు. రోజుకు పద్దెనిమిది గంటల పాటు రకరకాల వాయిస్ ఫామ్స్ ప్రాక్టీస్ చేసేవారు. తన టాలెంట్‌‌ గుర్తించిన ఉస్తాద్.. సంగీత దర్శకుడు వసంత్‌‌దేశాయ్‌‌కి ఆమెను పరిచయం చేశారు. ఆయన సంగీతంలో మరాఠీ నాటకం కోసం ఒక పాట పాడారామె. ఆ తర్వాత ఆమెను ‘గుడ్డి’ (1971) సినిమాతో ఆయనే సింగర్‌‌‌‌గా పరిచయం చేశారు. హీరోయిన్ జయా బచ్చన్‌‌కు కూడా అదే ఫస్ట్ హిందీ సినిమా కావడంతో కొత్త వాయిస్‌‌ కావాలని వాణీతో పాడించారు. ఇందులో మూడు పాటలు పాడగా.. ‘బోలే రే పపీహర’ అనే పాట సూపర్‌‌‌‌ సక్సెస్‌‌ సాధించింది. దీంతో ఓవర్‌‌‌‌ నైట్ స్టార్ డమ్ అందుకున్నారు వాణి. 

బాలీవుడ్ పాలిటిక్స్‌‌ పడలేక.. 

మొదటి పాటే సక్సెస్ సాధించడంతో ఆ తర్వాత అప్పటి టాప్‌‌ మ్యూజిక్ డైరెక్టర్స్‌‌ అయిన నౌషద్, శ్రీరామచంద్ర, గోపీ నయ్యర్, మదన్ మోహన్, ఆర్‌‌‌‌.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారెలాల్ లాంటి అందరితో వర్క్ చేశారామె. కిషోర్ కుమార్, మహ్మద్ రఫీ, మన్నాడీ, ముఖేష్ లాంటి పాపులర్ సింగర్స్‌‌తో కలిసి ఎన్నో సూపర్‌‌‌‌ హిట్ సాంగ్స్ పాడారు. కానీ ఒకానొక సమయంలో సడన్‌‌గా అవకాశాలు తగ్గాయి. అందుకు కారణం లతా మంగేష్కర్ అనే విమర్శలు ఉన్నాయి. తనకు పోటీ వస్తుందన్న అక్కసుతో పాటు ‘మీరా’ (1979) సినిమా కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందంటారు. ‘మీరా’ చిత్రానికి తన బ్రదర్‌‌‌‌ని సంగీత దర్శకుడిగా తీసుకోకపోతే ఆ చిత్రానికి పాటలు పాడనన్నారు లతా. సంగీత దర్శకుడిగా పండిట్ రవిశంకర్‌‌‌‌ను మార్చే ఉద్దేశం లేని డైరెక్టర్ గుల్జార్‌‌‌‌.. ఆ పాటలన్నీ వాణితో పాడించారు. దాంతో వాణీపై సీరియస్ అయిన లతా మంగేష్కర్.. అవకాశాలు రాకుండా చేశారంటారు. బాలీవుడ్‌‌ పాలిటిక్స్‌‌తో పాటు అదే సమయంలో సౌత్‌‌ నుండి అవకాశాలు రావడంతో మద్రాస్‌‌కు వచ్చేశారు వాణి. హిందీలో అవకాశాలు తగ్గడం వల్లే.. తాను సౌత్‌‌లో ఎక్కువ సినిమాలకు పాడగలిగానని చెప్పేవారు వాణి. జీవితంలో ప్రతి విషయాన్ని  ఆమె పాజిటివ్‌‌గా చూసేవారు. 

తెలుగుతో.. ఎన్నెన్నో జన్మల బంధం

‘స్వప్నం’ అనే మలయాళ సినిమా కోసం ఫస్ట్ టైమ్‌‌ సౌత్‌‌లో పాడారు వాణి. ఆ పాటలు పాపులర్ అవడంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ బిజీ అయ్యారు. తమిళ, కన్నడ, మలయాళభాషల్లో ఎక్కువ పాటలు పాడి పదకొండేళ్ల పాటు నెంబర్‌‌‌‌ వన్ సింగర్‌‌‌‌గా రాణించారు. అక్కడితో పోల్చితే తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా దాదాపుగా అన్ని పాటలు సూపర్ హిట్స్. తెలుగులో ఆమె గొంతును పరిచయం చేసింది ఎస్‌‌.పి.కోదండపాణి. ‘అభిమానవంతులు’ సినిమా కోసం ‘ఎప్పటివలె కాదురా స్వామి’ పాట పాడించారాయన. ఆ తర్వాత నోము, పూజ, గుప్పెడు మనసు, మరో చరిత్ర, సీతామాలక్ష్మి, శంకరాభరణం, సీతాకోక చిలుక, స్వర్ణ కమలం, ఘర్షణ, స్వాతికిరణం చిత్రాల్లో పాడారు. తమిళ కుటుంబమే అయినా తన తల్లి పెరిగిందంతా కర్నూల్‌‌లో కావడంతో.. తెలుగు పదాలను ఎలా పలకాలో మొదటి నుండి నేర్చుకున్నారు. అది వాణీ జయరాం తెలుగులో పాడిన పాటలకు ఎంతో హెల్ప్ అయింది. మంగళగిరి చేనేత చీరలంటే ఆమెకు ఎక్కువ ఇష్టం. ఎక్కువగా ఆ చీరలే కట్టుకునేవారు. ఎక్కువగా కె.విశ్వనాథ్‌‌ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. ఆయన కన్నుమూసిన రెండవ రోజునే వాణీ జయరాం మరణించారు. 

సింగర్‌‌‌‌గా 50 ఏళ్ల ప్రస్థానం

ఇటీవలే ప్రొఫెషనల్ సింగర్‌‌గా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు వాణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఉర్దూ, మరాఠి, బెంగాలీ, బోజ్‌‌పురి, తుళు, ఒరియా లాంటి 19 భాషల్లో పది వేలకు పైగా పాటలు పాడారు. ఆమె పాడిన చాలా పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి.  కె.వి.మహదేవన్‌‌, ఎం.ఎస్‌‌.విశ్వనాధన్‌‌, ఇళయరాజా, పెండ్యాల, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు గార్ల సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. కాస్త కష్టమైన ట్యూన్ అనగానే వాణీ జయరాంని పిలిచేవారు సంగీత దర్శకులు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ అంతే సునాయాసంగా పాడేవారు వాణి. సినిమా పాటలతో పాటు భజనలు, గజల్స్‌‌, ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడారు. వివేకానంద ఫాలోవర్ అయిన ఆమె.. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా వినయంగా నడుచుకోవాలి అనేవారు. డ్రాయింగ్, పెయింటింగ్స్ వేయడంతో పాటు హిందీలో, తమిళంలో కవితలు, పాటలు రాసేవారు. తమకు పిల్లలు లేకున్నా సంగీతమే ఆ లోటు తీర్చిందంటారు వాణి. 2018లో భర్త జయరాం కన్నుమూశారు.

ఆణిముత్యాల్లో కొన్ని...

 ఎన్నెన్నో జన్మల బంధం (పూజ)
 నేనా పాడనా పాట (గుప్పెడు మనసు) 
 నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా (వయసు పిలిచింది) 
 విధి చేయు వింతలన్నీ.. (మరో చరిత్ర) 
 పలుకే బంగారమాయెనే.. (శంకరాభరణం)
 మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా (సీతాకోక చిలుక)
 శ్రీ సూర్య నారాయణ (మంగమ్మ గారి మనవడు) 
 ఇన్ని రాశుల యునికి (శ్రుతిలయలు)
 అందెల రవమిది (స్వర్ణ కమలం)
 ఒక బృందావనం (ఘర్షణ)
 తెలి మంచు కరిగింది.. (స్వాతి కిరణం)
 ఆనతి నీయరా.. (స్వాతికిరణం)
 శ్రుతి నీవు.. గతి నీవు (స్వాతి కిరణం)

వాణీ జయరాం గొంతులోని మాధుర్యానికి మూడు సార్లు ఆమెను జాతీయ అవార్డు వరించింది. బాలచందర్ తీసిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగల్’ చిత్రంలోని పాటకు మొదటి జాతీయ అవార్డును అందుకున్నారు వాణీ జయరాం. ఆ తర్వాత విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే’ పాటకు రెండోసారి జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయనే తీసిన ‘స్వాతి కిరణం’లోని ‘ఆనతి నీయరా హరా’ పాటకు మూడో జాతీయ అవార్డు వరించింది. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ అవార్డులను అందుకున్నారామె. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్‌‌ని  కూడా ప్రకటించింది. అది అందుకోక ముందే ఆమె తుదిశ్వాస విడిచారు.