8 ఏండ్లుగా స్కూళ్లకు ఒక్క రూపాయీ కేటాయించలే : ​ఆకునూరి మురళి

8 ఏండ్లుగా స్కూళ్లకు ఒక్క రూపాయీ కేటాయించలే : ​ఆకునూరి మురళి
  • ఎడ్యుకేషన్​పై సీఎం కేసీఆర్​ ఎందుకు రివ్యూ చేస్తలే?
  • ఒకటి, రెండు నెలల్లో కొత్త పార్టీ పెడ్తామని ప్రకటన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టించారని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి మండిపడ్డారు. ‘‘సర్కార్​ విద్యను నాశనం చేశారు. ఎడ్యుకేషన్​కు కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. కోఠారి కమిషన్ సూచనలను అమలు చేయడం లేదు. మన ఊరు – మన బడి గురించి మంత్రి హరీశ్​రావు గొప్పగా చెప్పారు. కానీ..  తీరా బడ్జెట్ కాపీల్లో నిధుల కేటాయింపే లేదు. మన ఊరు – మన బడి పేరిట మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. దీనికి బడ్జెట్​లో ఎన్ని కోట్లు కేటాయించారో చెప్పాలి” అని డిమాండ్​ చేశారు. కొత్తగూడెంలోని తన ఇంట్లో గురువారం మీడియాతో ఆకునూరి మురళి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్​లో 11.5 శాతం విద్యకు కేటాయిస్తే ప్రత్యేక రాష్ట్రంలో దశలవారీగా 6.2 శాతానికి తగ్గించారన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎడ్యుకేషన్​కు బడ్జెట్​లో  20 శాతం కేటాయింపులు ఉండాలని కోఠారి కమిషన్ సూచిస్తే కేవలం 6.2 శాతం కేటాయించడం ఏంటని ప్రశ్నించారు.  ‘‘8 ఏండ్లలో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. టీచర్లు, డీఈవోలు, ఎంఈవోలు ఎలా పనిచేస్తున్నారనే దానిపై సీఎం రివ్యూ చేయడమే మరిచిపోయారు” అని విమర్శించారు. వర్సిటీలు ఖాళీలతో కునారిల్లుతున్నాయన్నారు.  బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యను ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. 

రాజకీయాలను వ్యాపారంగా మార్చారు

రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని, ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా కేసీఆర్ 104 చోర్ అనే పాలన ఉందని మురళి విమర్శించారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చారని దుయ్యబట్టారు. దళిత బంధు మోసపూరిత స్కీం అని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా డబ్బులు పంచాయని,  ఎలక్షన్ కమిషన్​కు రుజువులతో ఫిర్యాదు అందజేసినా ఫలితం లేకుండాపోయిందన్నారు. మంత్రులు, కార్పొరేషన్ చైర్​పర్సన్లు, ఎమ్మెల్యేలు నెల రోజులు మునుగోడులో మకాం వేసి, సిగ్గులేకుండా జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ వాదం పోయిందని, బంగారు తెలంగాణగా మారిందని గొప్పలు చెప్పుకుంటూ ఇప్పుడు బీఆర్ఎస్ పేరిట కేసీఆర్ దేశంపై పడ్తున్నారు. అధికార పాకులాటే తప్ప కల్వకుంట్ల కుటుంబానికి మరొకటి లేదు” అని ఆయన విమర్శించారు. 

కూనంనేని, తమ్మినేనికి ఎన్నిమూటలు ముట్టాయి

టీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకున్నందుకు కమ్యూనిస్టు నేతలు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంకు ఎన్ని మూటలు ముట్టాయో, ఎన్ని విల్లాలు దక్కాయో చెప్పాలన్నారు. కమ్యూనిజం చాలా గొప్పదని, క్యాడర్​లో ఎంతో మంది నిజాయితీతో ఉన్నా కొందరు నాయకులు కుల పిచ్చితో కమ్యూనిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కూడా కరెక్ట్​గా లేదని, ఆ పార్టీలో నేతలు కొట్టుకోవడంతోనే సరిపోతున్నదని ఆయన విమర్శించారు. ఒకటి రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నానని, దీని కోసం మేధావులు, ప్రొఫెసర్లతో మాట్లాడుతున్నట్లు  తెలిపారు.

కాళేశ్వరం ఓ చెత్త ప్రాజెక్టు

కాళేశ్వరం ఓ చెత్త ప్రాజెక్ట్ అని ఆకునూరి మురళి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘ఎదుటి వాళ్లను అణగదొక్కడం, మళ్లీ అధికారంలోకి రావడం ఎట్లా అనే ఆలోచనలే తప్ప అభివృద్ధిపై ప్రణాళికలు చేసే టైం సీఎం, మంత్రులకు లేదు” అని విమర్శించారు. పేదల అభివృద్ధిని పక్కన పెట్టి మతం పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు.