ఎండాకాలం ఊరుకున్నరు.. వానాకాలం ముందటేసుకున్నరు

ఎండాకాలం ఊరుకున్నరు.. వానాకాలం ముందటేసుకున్నరు

సింగోటం రిజర్వాయర్​​లో నీళ్లను వదిలేసి రిపేర్లు చేస్తున్న ఇంజనీర్లు

నాగర్​కర్నూల్, వెలుగు : ఇంజనీరింగ్​ ఆఫీసర్లు ముందుచూపు లేకుండా వ్యవహరించడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. కేఎల్ఐ ఎత్తిపోతల పథకంలోని సింగోటం రిజర్వాయర్​ అలుగు, కట్ట, తూములు దెబ్బతిని ప్రమాదకరంగా ఉన్నాయని రెండేండ్ల నుంచి ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతుంటే లీడర్లు, ఆఫీసర్లు లైట్​గా తీసుకున్నారు. తొందరేముంది మొత్తం తెగినాంక చూసుకుందాంలే అన్నట్లు వదిలేశారు. సింగోటం రిజర్వాయర్​ కట్ట, అలుగు, తూముల రిపేర్లకు రూ. 95లక్షల ఫండ్స్​వచ్చి ఏడాది దాటింది. 

టెండర్​ ఫైనల్​ అయిన తర్వాత కూడా పనులు చేయకుండా ఊరుకున్నారు. మార్చి ఫస్ట్​ వీక్​ నుంచి ఏప్రిల్, మే రెండు నెలలు ఎండాకాలంలో పనులు చేసే అవకాశం ఉన్నా మొదలు పెట్టలేదు. తీరా వర్షాకాలం మొదలైన తర్వాత పనులు స్టార్ట్​ చేశారు. పనులు చేపట్టేందుకు వీలుగా రిజర్వాయర్​లో సగం నీటిని వదిలేశారు. వర్షాలు స్టార్ట్​ అయిన తర్వాత పనులు చేపట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపేర్లు లేట్​ అయితే తమకు సాగు నీరు అందుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది కింద ఫండ్స్..

కేఎల్ఐలోని ఫస్ట్​ లిఫ్ట్​ నుంచి ఎల్లూరు రిజర్వాయర్​లోకి నీటిని ఎత్తిపోసిన తర్వాత అక్కడి నుంచి సింగోటంలోని శ్రీవారి సముద్రం నిండుతుంది. ఇక్కడి నుంచి రెండవ లిఫ్ట్​ జొన్నల బొగడ రిజర్వాయర్​కు అటు నుంచి మూడవ లిఫ్ట్  గుడిపల్లిగట్టు రిజర్వాయర్​కు నీరు వెళ్తుంది. సింగోటం రిజర్వాయర్​ పనుల కోసం ఉన్న నీటిని వదలి జూలై, ఆగస్టులో కృష్ణాకు వరద వస్తే ఆ నీటిని తీసుకునే అవకాశం లేకుండా చేశారనే విమర్శలున్నాయి. కేఎల్ఐ ప్రాజెక్ట్​ కింద​ఆరుతడి పంటలకు మాత్రమే నీళ్లు ఇవ్వాలనే సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని వానాకాలంలో రిజర్వాయర్లు నింపడం లేట్​ అయినా పెద్దగా నష్టం ఉండదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. 

దాదాపు 95 ఏండ్ల కింద సురభి రాజులు సింగోటం దగ్గర  శ్రీవారి సముద్రం పేరుతో 1,600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందేలా చెరువు నిర్మించారు. ఆ తర్వాత దీన్ని కేఎల్ఐ రిజర్వాయర్​గా మార్చారు. ప్రస్తుతం 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అలుగు దగ్గర సైడ్​ వాల్​ కుంగిపోయింది. ఇక్కడి నుంచి వాటర్​ లీకేజీ పెరిగింది. కట్ట రివిట్​మెంట్​కు పగుళ్లు వచ్చి బలహీనంగా మారింది. ఈ రిపేర్లు చేసేందుకు ఏడాది కింద ఫండ్స్​ వచ్చినా టెండర్​ ఫైనల్​ కాకపోవడంతో పనులు స్టార్ట్​ కాలేదు. టెండర్​ ఖరారైన తర్వాత కూడా పనులు చేపట్టకుండా ఊరుకున్న ఇంజనీర్లు, వర్షాకాలం ముందు పనులు స్టార్ట్​ చేశారు. రిపేర్లు లేట్​ అయితే సింగోటం కింద ఉన్న జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీరు వచ్చే అవకాశం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు.