సింగూరుకు జలకళ..ఎగువ ప్రాంతంలోని కర్నాటక బేసిన్ నుంచి వస్తున్న వరద

సింగూరుకు జలకళ..ఎగువ ప్రాంతంలోని కర్నాటక బేసిన్ నుంచి వస్తున్న వరద
  • 21 టీఎంసీలకు చేరువలో నీటిమట్టం
  • ఇన్ ఫ్లో 3688 క్యూసెక్కులు, ఔట్​ఫ్లో 633 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కర్నాటక నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ వద్ద 29.917 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 20.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 3688 క్యూసెక్కులు ఉండగా, ఔట్​ఫ్లో 633 క్యూసెక్కులు కొనసాగుతున్నాయి. 523.600 మీటర్లకు 521.762 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు దాదాపు 3 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది.

సింగూర్ కింద ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొత్తం 80 వేల ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఈ వానానకాలం సాగుకు ప్రాజెక్టు భరోసా కల్పిస్తున్నప్పటికీ పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాతనే మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం అందోల్ నియోజకవర్గ పరిధిలో 30 వేల ఎకరాలకు కెనాల్ ద్వారా 100 క్యూసెక్యుల నీటిని అందిస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ నీటిని విడుదల చేశారు.  

ప్రస్తుతానికి 30 వేల ఎకరాలకు.. 

కాల్వల సీసీ లైనింగ్ పనులకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి సాగునీటికి సింగూరు నీళ్లు వదలాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ  కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేశారు. అప్పట్లో ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉండడం వల్ల 50వేల ఎకరాలకు 30 వేల ఎకరాలకు మాత్రమే సింగూర్ ఎడమ కాల్వలు, చెరువుల ద్వారా అందోల్, చౌటకూర్, పుల్కల్, మునిపల్లి మండలాలకు నీరందించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ప్రాజెక్టులో నీటి నిల్వ పెరిగితే మరో 20 వేల ఎకరాలకు కూడా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సింగూరు ప్రాజెక్టు జేఈ మహిపాల్ రెడ్డి తెలిపారు.

క్రాప్ హాలిడే తర్వాత..

సింగూరు ప్రాజెక్టులో నీటి కొరత, కాల్వల రిపేర్ల నేపథ్యంలో గడిచిన రెండు పంటలకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 50 వేల ఎకరాలకు నీరందించగా రెండు దఫాలుగా సాగునీటికి నోచుకోలేదు. మొదట్లో ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నాయని నీరు విడుదల చేయలేదు. తర్వాత కాల్వల రిపేర్ పనుల కారణంగా సాగునీరు అందకుండా పోయింది. 

ఘనపురం ప్రాజెక్టుకు..

సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల నీటిమట్టం దాటితేనే దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. మెదక్ జిల్లా వనదుర్గా ప్రాజెక్టు (ఘనపురం)కు ప్రతి ఏడాది వదలాల్సిన 4.6 టీఎంసీల నీటిని త్వరలో వదలనున్నట్టు తెలుస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు 8.5 టీఎంసీలు, సంగారెడ్డి జిల్లాలోని అందోల్, మునిపల్లి, పుల్కల్, చౌటకూర్, సదాశివపేట మండలాల పరిధిలో 50 వేల ఎకరాలు, 150 చెరువులకు ఏటా రెండు పర్యాయాలు సాగునీరు అందించాల్సి ఉంది.

మిషన్ భగీరథకు భరోసా

జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీటి అవసరాలకు సింగూర్ ప్రాజెక్టు  భరోసా కల్పిస్తోంది. ప్రాజెక్టు సమీపంలో రెండు వైపులా సంప్ హౌస్, ఫిల్టర్ హౌస్ ను నిర్మించారు. సింగూరులో నీటిమట్టం  పెరుగుతుండడంతో మరో నాలుగేళ్ల వరకు తాగునీటికి డోకాలేదని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలను సింగూర్ ప్రాజెక్టు ద్వారా తీరుస్తున్నారు. ప్రాజెక్టులో 16 టీఎంసీల కంటే తక్కువ నీటి నిల్వ ఉంటే కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. సింగూరు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.