- 65 లక్షల మీటర్ల క్లాత్‌కు జనవరిలో ఆర్డర్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
- నాలుగు నెలల్లోనే 59 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి పూర్తి
- క్లాత్‌ను ఇప్పటికే ప్రొక్యూర్ చేసిన టెస్కో
- ఉత్పత్తితో కార్మికులకు నాలుగు నెలల పని
రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ల స్టూడెంట్లకు పంపిణీ చేసిన యూనిఫామ్ క్లాత్ మొత్తం సిరిసిల్లలోనే తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే యూనిఫాం క్లాత్ ఉత్పత్తి కోసం సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 65 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ ఇవ్వగా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్, పట్టణంలోని పవర్ లూమ్ కార్మికులు కలిసి నాలుగు నెలల్లోనే క్లాత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పత్తి పూర్తయిన క్లాత్‌ను ఇప్పటికే టెస్కో కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాం ఆర్డర్ కారణంగా నాలుగు నెలల పాటు కార్మికులకు పని దొరికినట్లు అయింది.
65లక్షల మీటర్ల యూనిఫాం క్లాత్
గత బీఆర్‌ఎస్ సర్కార్ సిరిసిల్ల నేతన్నల నుంచి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించుకున్నప్పటికీ డబ్బులు మాత్రం విడుదల చేయలేదు. మొత్తం రూ. 300 కోట్ల బకాయిలు రిలీజ్ చేయకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది. రాష్ట్రంలో డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సర్కార్ స్కూల్‌లో చదివే పిల్లల యూనిఫాం కోసం 65 లక్షల మీటర్ల క్లాత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది.
ఈ ఏడాది జనవరిలో ఆర్డర్ ఇవ్వగా కార్మికులు నాలుగు నెలల పాటు పనిచేసి క్లాత్ ఉత్పత్తిని పూర్తి చేశారు. రాజీవ్ విద్యా మిషన్ కోసం 35.90 లక్షల మీటర్ల చెక్స్ షర్టింగ్ క్లాత్ అవసరమంటూ సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లో ఆర్డర్ ఇచ్చారు. ఇందులో 29 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి కావడంతో దానిని ఇప్పటికే టెస్కో కోనుగోలు చేసింది. మిగిలిన ఆరు లక్షల మీటర్ల క్లాత్ ప్రస్తుతం ప్రొడక్షన్‌లో ఉంది. అలాగే 59 ఇంచుల పెద్ద పన్నాకు సంబంధించి 9 లక్షల మీటర్ల షర్టింగ్ ఆర్డర్ ఇవ్వగా 8 లక్షల మీటర్ల క్లాత్‌ను కొనుగోలు చేసింది.
అలాగే సిరిసిల్ల పట్టణంలోని కార్మికులకు 24.40 లక్షల మీటర్ల యూనిఫాం ఆ ర్డర్ ఇవ్వగా 21 లక్షల మీటర్ల క్లాత్ ప్రోక్యూర్‌మెంట్ జరిగింది. ఇంకా మూడు లక్షల మీటర్ల క్లాత్ ప్రొడక్షన్‌లో ఉంది. మరో 15 రోజుల్లో మొత్తం క్లాత్ ఉత్పత్తి పూర్తి కాగానే టెస్కో కొనుగోలు చేయనుందని ఆఫీసర్లు చెప్తున్నారు.
నాలుగు నెలల్లోనే క్లాత్ రెడీ చేసిన కార్మికులు
రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లకు ఇవ్వాల్సిన యూనిఫాం క్లాత్ ఉత్పత్తి ఆర్డర్‌ను ప్రతి ఏడాది నవంబర్‌లో ఇస్తుంటారు. కానీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా జనవరిలో ఆర్డర్ ఇచ్చారు. రెండు నెలల లేట్‌గా ఇచ్చినప్పటికీ కార్మికులు మాత్రం క్లాత్‌ను నాలుగు నెలల్లోనే రెడీ చేశారు. ఇచ్చిన గడువులోగా క్లాత్‌ను ఉత్పత్తిని చేసి టెస్కోకు అందజేశారు.
పెండింగ్ బకాయిలూ రిలీజ్
సిరిసిల్ల కార్మికులకు ఇవ్వాల్సిన రూ. 300 కోట్ల బకాయిలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.చీరలు ఉత్పత్తి చేయించుకొని బిల్లులు చెల్లించకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. అక్కడి వస్త్ర వ్యాపారులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా బతుకమ్మ చీరల బకాయిలకు సంబంధించిన రూ. 150 కోట్లను ఏప్రిల్‌లో రిలీజ్ చేసింది. మిగతా బకాయిలను సైతం విడతల వారీగా చెల్లిస్తామని సర్కార్ ప్రకటించింది. దీనికి తోడు కార్మికులకు పని కల్పించే ఉద్దేశంతో స్కూల్ యూనిఫాం ఆర్డర్‌ను సైతం ఇచ్చింది.
59 లక్షల మీటర్ల క్లాత్ ప్రొక్యూర్ చేశాం
సిరిసిల్ల నేతన్నల ద్వారా ఉత్పత్తి చేసిన 59 లక్షల మీటర్ల యూనిఫాం క్లాత్‌ను టెస్కో కొనుగోలు చేసింది. యూనిఫాం ఆర్డర్‌ను జనవరిలో ఇవ్వగా నాలుగు నెలల్లోనే క్లాత్ ఉత్పత్తి పూర్తి అయింది. ప్రొక్యూర్‌మెంట్ అయిన వెంటనే ఉత్పత్తికి సంబంధించిన అమౌంట్‌ను నేతన్న ఖాతాలో వేస్తారు. ఆర్‌వీఎం క్లాత్ ఉత్పత్తి ద్వారా కార్మికులను 4 నెలల పని దొరికింది.
- సాగర్, చేనేత జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల