ముందుకెళ్లని సిరిసిల్ల కొత్త చెరువు సుందరీకరణ పనులు

ముందుకెళ్లని సిరిసిల్ల కొత్త చెరువు సుందరీకరణ పనులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు :  సిరిసిల్ల బ్యూటిఫికేషన్ లో భాగంగా చేపట్టిన కొత్త చెరువు సుందరీకరణ పనులు ఎనిమిదేండ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. సిరిసిల్ల టౌన్​లోని కరీంనగర్ రోడ్ ను ఆనుకుని ఉన్న చెరువును సిద్దిపేట కోమటి చెరువులా తీర్చుదిద్దుతామని మినిస్టర్ ​కేటీఆర్ ఎనిమిదేండ్ల క్రితం రూ.12 కోట్లు కేటాయించారు. ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు కూడా ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు పనులు పూర్తి కావడం లేదు. 

72 ఎకరాల్లో రూ.12 కోట్లు..

కొత్త చెరువు సుందరీకరణ పనులు రూ.12 కోట్లతో 72 ఎకరాల్లో ప్రారంభించారు. చెరువు ట్యాంక్ బండ్ 1.2 కిలోమీటర్లు నిర్మించారు. బండ్ పొడవునా గ్రానైట్, ఫ్లోరింగ్, రెయిలింగ్, సీటింగ్ ప్లాజాలు, యోగా పెవిలియన్లు ఏర్పాటు చేశారు. 4 ఎకరాల్లో పార్క్ నిర్మించారు. పిల్లలు ఆడుకునేందుకు అందులో టాయ్స్ ను ఏర్పాటు చేశారు. పైపై కనిపించే పనులు మొత్తం కంప్లీట్ చేశారు. 

ఐలాండ్ కట్టలే.. బోట్ పెట్టలే..

కొత్త చెరువు బ్యూటిఫికేషన్ లో అత్యంత ఆకర్షణగా నిలిచే ఐలాండ్ పనులను అధికారులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా నాలుగెకరాల్లో ఐలాండ్ ను నిర్మించి కొత్త చెరువు గేట్ నుంచి ఐలాండ్ చేరుకునేందుకు పడవ ప్రయాణం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఈ ప్రణాళిక కాగితాలకే పరిమితమయ్యింది. ఐలాండ్ కోసం రూ.6 కోట్లు మంజూరు చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. చెరువు వాటర్ మొత్తం తొలగిస్తే తప్ప ఐలాండ్ పనులు ముందుకు సాగవని ఇంజనీర్లు చెబుతున్నారు. సమ్మర్ లో చెరువులో నీళ్లు తక్కువుంటాయి కాబట్టి అపుడు పనులు మొదలుపెట్టి కంప్లీట్ చేసే వెసులుబాటు ఉన్నా అధికారులు పనులు ప్రారంభించడం లేదు. అలాగే లక్నవరంలాగా రోప్ వే ఏర్పాటు చేస్తామని ప్లానింగ్ సిద్ధం చేసి వాటి పనులు కూడా ప్రారంభించలేదు. ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగేందుకు రూ.16లక్షలతో ట్రైన్ కొనుగోలు చేసినా వాడుకలోకి తీసుకురాలేదు. మున్సిపల్ ఆఫీసర్లను అడిగితే నిధులు లేవని, సాంక్షన్ అయిన నిధుల వరకు పనులు పూర్తి చేశామని సమాధానం చెబుతున్నారు.

మూసి ఉంటున్న ఎంట్రెన్స్, ఎగ్జిట్ గేట్లు.. 

ట్యాంక్ బండ్ ఫ్లోరింగ్ పనులు పూర్తవడంతో చెరువును చూసేందుకు ప్రజలు వస్తున్నారు. అయితే ఎంట్రెన్స్ గేట్ కు తాళం ఉంటుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. సాయంత్రం మాత్రం పార్క్ లోకి రావడానికి రూ.20 టికెట్ పెట్టారు. మార్నింగ్ వాకర్స్ కు అనుమతి లేకపోవడంతో సంజీవయ్య నగర్ దొడ్డిదారిన కొత్త చెరువుపైకి వెళ్లి వాకింగ్ చేస్తున్నారు.

ప్రతిపాదనలు పంపాం

ఇప్పటి వరకు కొత్త చెరువు కు మంజూరైన నిధులతో పనులు పూర్తి చేశాం. కొత్తగా నిర్మించాల్సిన ఐలాండ్, రోప్ వే తదితర పనులకు ఫండ్స్ కోసం ప్రతిపాదనలు పంపాం. మంజూరు అయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ట్యాంక్ బండ్ నిర్మాణం, పార్క్, లైటింగ్, పనులు కంప్లీట్ అయ్యాయి.
- సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్