అయోధ్యకు సిరిసిల్ల బంగారు చీర

అయోధ్యకు సిరిసిల్ల బంగారు చీర

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్వామి వారి పాదాల చెంతన సిరిసిల్ల బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ ఈ చీరను తయారు చేశారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి ఈ బంగారు చీరను అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల వద్ద ఈ చీరను ఉంచనున్నారు. గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సిరిసిల్లలోని హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను పరిశీలించారు.

శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను ఆ చీరలో పొందు పర్చారు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో ఈ చీరను తయారు చేశారు. చీరను తయారు చేసిన హరిప్రసాద్‌‌‌‌ను బండి సంజయ్ అభినందించి, సత్కరించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీర చాలా అద్భుతంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలో పట్టె చీరను తయారు చేసిన ఘనత సిరిసిల్లకు ఉందని గుర్తుచేశారు. ఇంతటి నైపుణ్యం ఉన్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని సంజయ్‌‌‌‌ హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ అధికార ప్రతినిది రాణి రుద్రమ, పార్టీ నాయకులు రెడ్డబోయిన గోపి, నాగుల శ్రీనివాస్ ఉన్నారు.