కాళేశ్వరానికి వ్యతిరేకంగా రెండో రోజు రిలే నిరాహార దీక్ష

కాళేశ్వరానికి వ్యతిరేకంగా రెండో రోజు రిలే నిరాహార దీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లా సిరోంచలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కారణంగా తమ పంట భూములు నీట మునిగి నష్టపోతున్నామని సిరోంచ గ్రామస్థులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన ముంపు ప్రాంత రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొంటున్న రైతులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

లక్ష్మీ బ్యారేజ్ ద్వారా తాము తీవ్రంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముంపు కారణంగా నష్టపోయిన తమకు భూ సర్వే చేపట్టి తక్షణమే పరిహారం చెల్లించాలని అంటున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష కొనసాగిస్తామని బాధిత రైతులు స్పష్టం చేశారు.