
‘అయిదంకెల జీతమని ఆనందంగా చేరితే అరిగోసలేందిరా నాయనా!’’ అనుకునేటోళ్లు ఎంతోమంది. ‘కూసుని చేసే ఉద్యోగమేగా నీకేందిర బయ్’ అంటరు. కానీ కూసుంటే తెలుస్తది. ఆ కుర్చీల ఉండే బాధ. కదిలే గిర్రలు,చెక్కలేకుండా మెత్తలున్నయని… చాలామంది ‘అబ్బో భలే లైఫ్’ అనుకుంటరు. చూసుకొని మురిసే ఉద్యోగులు ఏడుస్తూ చెప్పుకునే సమస్యలు చాలా ఉన్నయ్. సాఫ్ట్‌వేర్, ఐటీ, కన్సల్టెన్సీ, బీపీఓ… చాలా సర్వీసుల్లో ఏసీ గదుల్లో కూర్చునే కొలువంటే మస్త్ డిమాండ్ ఉంది. చేతికి మట్టంటదు. ఒంటికి ఎండ తగలదు. టైమ్‌కు పోయి టైమ్‌కి రావొచ్చు. ఇదంతా నిజమే కానీ ఈ ఉద్యోగాలు చేసేటోళ్లకు ఇప్పుడు కొత్త బాధలు వచ్చిపడినయ్. ఆ కుషన్ కుర్చీలే ముళ్లకంపల్లా ఉంటున్నాయని బాధపడుతున్నరు. ఆడా మగ తేడాలేకుండా అందరి సమస్యా ఈ ఒళ్లు నొప్పులు. ఈ నొప్పులు వయోబేధాన్ని కూడా చెరిపేసినయ్. పెద్ద వయసులో వచ్చే నడుము నొప్పి, కాళ్లు గుంజుడు పెండ్లి కూడా కాని పోరగాళ్లను పీడిస్తున్నయంటే సమస్య ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. వెన్నుపూసలు అరిగిపోయి, జారిపోయి నొప్పితో లబోదిబోమని దవాఖానలో చేరేటోళ్లలో కుర్చీల్లో కూసోని పనులు చేసేటోళ్లే ఎక్కవని డాక్టర్లంటున్నారు. వీళ్లకే రావడానికి కారణం ఒక్కటే. కూర్చుని పనిచేసే చోట ఎట్ల కూసోవాలో అట్ల కూసోవట్లేదట. ఇట్లనే కూసోండని చెప్పినా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఉంటున్నారు. అసలు కీ బోర్డు ముందు ఎట్ల కూసోవాలో, కంప్యూటర్‌ని ఎట్ల వాడాలో తెలియని వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. కూర్చుని పనిచేసే ఉద్యోగుల నడుమునొప్పులు, కాళ్లు గుంజుడు, భుజాల నొప్పి, మెడ పట్టేసుడుకి ఈ మూడు కారణాలట. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా నొప్పి తగ్గదు. అరిగిన డిస్క్‌లకు ఆపరేషన్ చేసుకోవాల్సిందే. అరగని వాటిని కాపాడుకోవడానికి ఎట్ల కూసోవాలో అట్ల కూసోవాల్సిందే. తెల్సిందా!
…కొంత మంది కీ బోర్డుని ఉపయోగిస్తున్నప్పుడు మో చేతులను చైర్ హ్యాండిల్స్‌పై ఉంచకుండా లోపలికి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల భుజాలపై ఒత్తిడి పడుతుంది. ఎక్కువ రోజులు ఇట్లనే పని చేస్తే భుజాలనొప్పి వస్తుంది.
…ఎక్కువ సేపు టేబుల్‌పై పనిచేస్తూ ఫైల్స్ క్లియర్ చేస్తూ ఉంటే భుజాల నొప్పి, మెడనొప్పి వస్తుంది. ఈ నొప్పి నుంచి బయటపడాలంటే టేబుల్‌కు, కుర్చీకి ఏటవాలుగా ప్యాడ్ పెట్టుకుని పనిచేయాలి. మోచేతులు ఫ్రీగా ఉంటే భుజాల నొప్పి పోతుంది.
…వేళ్ల మధ్యలో పెన్ను ఉంచుకుని కీ బోర్డుని ఉపయోగించొద్దు.
…మెడను పక్కకు వంచి డెస్క్‌టాప్‌పై పనిచేస్తూ ఉంటారు. ఈ పద్దతి మానుకోవాలి. ఇది ఒకవైపు కండరాలపై ఒత్తిడి పెంచుతుంది. రక్తసరఫరాను కూడా తగ్గిస్తుంది. మెడ నొప్పులు వస్తాయి.
…వచ్చిన వ్యక్తులతో మాట్లాడేందుకు డెస్క్‌టాప్‌ను పక్కకు పెడతారు. ఇలా ఉపయోగించకుండా అవసరాన్ని బట్టి కుర్చీని జరుపుకుంటూ ఉండాలి. లేదా డెస్క్‌టాప్‌కు బదులు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించాలి.
….ఫైల్స్‌తో పని కానిచ్చేయాలని కీ బోర్డుని పక్కకు పెట్టి ఉపయోగిస్తే భుజాల నొప్పులు వస్తాయి.
….ప్రతి 15 నుంచి 20 నిమిషాలకోసారి పని ఆపాలి. కుర్చీలోంచి లేచి ఒక నిమిషం నిల్చోవడం, లేదా నడవడం చేయాలి. ఇది కుదరకపోతే డెస్క్‌టాప్ పనికి గంటకోసారి విరామం ఇవ్వాలి. అయిదు నిమిషాలు నిల్చోవడం లేదా నడవడం చేయాలి.
మానిటర్ దూరం: తలను వంచకుండా మానిటర్‌లో సగభాగం చదవగలిగేంత దూరంలో మానిటర్‌ను ఉంచాలి. ఇలా తల వంచకుండా చదువుతున్నప్పుడు కంటి కండరాలు గుంజకుండా ఉండాలి. గుంజుతున్నట్లయితే దూరంలో మార్పులు చేయాలి.టేబుల్ ఎత్తు మోచేతికి సమానంగా ఉండాలి.
పాదాలు నేలను తాకుతూ ఉండాలి. పొట్టిగా ఉంటే కుర్చీని కొద్దిగా కిందికి దించాలి. బాగా పొట్టిగా ఉన్న వాళ్లు పాదాలు కింద ఆనేందుకు పీటలు (ఫుట్ రెస్ట్) ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల తొడలు, మోకాలు మధ్య భాగం ఒత్తుకుపోకుండా ఉంటుంది. పాదాలకు రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది. కీ బోర్డ్‌పై పని చేస్తున్నా, టేబుల్‌పై చేతులు ఉంచినా మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలి. కూర్చుని ఉన్నప్పుడు తల నిటారుగా ఉండాలి.
మెడ వంచకుండా కిందకి చూడటం అలవాటు చేసుకోవాలి. ఇలా చూస్తే కనిపించే దూరంలో మానిటర్‌ను సెట్ చేసుకోవాలి. కీ బోర్డు ఉపయోగిస్తున్నప్పుడు నడుము కుర్చీకి ఆన్చి ఉంచాలి. 90 డిగ్రీల కోణంలో నిటారుగా కూర్చోవాలి. లేదా కొద్దిగా వెనుకకు వాలి అయినా కూర్చోవచ్చు. భుజాలు కుర్చీకి ఆన్చినప్పుడు కుర్చీకి ఆన్చి ఉంచిన నడుముకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. తొడలు నడుముకి 90 డిగ్రీల నుంచి 110 డిగ్రీల కోణంలో ఉండాలి.