కుట్రకోణాన్ని తోసిపుచ్చలేం

కుట్రకోణాన్ని తోసిపుచ్చలేం
  • హత్రాస్ తొక్కిసలాటపై యోగి సర్కారుకు సిట్  నివేదిక
  • ఆర్గనైజర్లు నిజాలు దాచి కార్యక్రమం నిర్వహించారు
  • ఏర్పాట్లు సరిగా చేయలేదు
  • ఆరుగురు అధికారులను సస్పెండ్  చేసిన ప్రభుత్వం

లక్నో:  హత్రాస్ తొక్కిసలాట వెనుక కుట్రకోణాన్ని తోసిపుచ్చలేమని సిట్  నివేదిక తెలిపింది. ఈ మేరకు యోగి సర్కారుకు సిట్  తన నివేదికను సమర్పించింది. 121 మంది చనిపోయిన తొక్కిసలాట వెనుక నిర్వాహకుల నిర్లక్ష్యంతో పాటు స్థానిక అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని తెలిపింది. సత్సంగానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని తెలిసినా స్థానిక అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని, రద్దీని నియంత్రించడంలో యంత్రాంగం మొత్తం ఫెయిలైందని సిట్  వెల్లడించింది.

‘‘పోలీసులు, అధికారులెవరూ సత్సంగం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కార్యక్రమంపై సీనియర్  అధికారులకు సమాచారం ఇవ్వలేదు. తొక్కిసలాటకు నిర్వాహకులే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం కూడా ఉండవచ్చు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది” అని సిట్  నివేదిక పేర్కొందని అధికారులు తెలిపారు.

కార్యక్రమం జరిగిన వేదికను పరిశీలించకుండానే స్థానిక సబ్ డిస్ట్రిక్ట్  మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అనుమతి ఇచ్చారని, సత్సంగం గురించి సీనియర్  అధికారులకు ఆయన కనీస సమాచారం కూడా ఇవ్వలేదని సిట్  రిపోర్టు పేర్కొంది. దీంతో అధికారులు ఈవెంట్ ను లైట్ గా తీసుకున్నారని వివరించింది. అలాగే నిర్వాహకులు నిజాలు దాచి కార్యక్రమం నిర్వహించారని, భారీ ఎత్తున జనాన్ని ఆహ్వానించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదని సిట్  వెల్లడించింది.

ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్  సూచించింది. సిట్  నివేదిక నేపథ్యంలో ఘటనపై యోగి సర్కారు కొరడా ఝుళిపించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి గాను ఆరుగురు అధికారులను సిట్  నివేదిక ఆధారంగా సర్కారు సస్పెండ్  చేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్  అయిన వారిలో స్థానిక సబ్ డిస్ట్రిక్ట్  మేజిస్ట్రేట్ (ఎస్డీఎం), సర్కిల్  ఆఫీసర్, తహసీల్దార్, ఇన్ స్పెక్టర్, ఔట్ పోస్ట్  ఇన్ చార్జితో పాటు మరో అధికారి ఉన్నారు.