ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం స్వామి వారి నిత్య కల్యాణం వైభవంగా జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి కల్యాణ క్రతువును షురూ చేశారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, సుముహూర్తాన మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహించారు. మంత్రపుష్పం నివేదించడంతో కల్యాణ క్రతువు ముగిసింది. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత స్వామికి రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు జరిగింది.


చేప పిల్లల విడుదలలో గోల్​మాల్

మత్స్యకారుల ఆందోళన
వైరా, వెలుగు: చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో గోల్​మాల్ జరిగిందని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. గురువారం వైరా రిజర్వాయర్ లో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఫిషరీస్  స్టేట్​ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ హాజరయ్యారు. చేపల సైజు 80ఎంఎం నుంచి 100ఎంఎం సైజు ఉండాల్సి ఉండగా, 40 నుంచి 60 ఎంఎం సైజు ఉన్న చేపలు మాత్రమే కాంట్రాక్టర్​ పంపించాడని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రిజర్వాయర్​లో ఈ చేప పిల్లలను విడదల చేయవద్దని నిరసన తెలిపారు. 10 డ్రమ్ముల్లో 18 వేల చేప పిల్లలు మాత్రమే ఉన్నాయని, అధికారులు మాత్రం లక్ష పిల్లలు ఉన్నట్లు చూపారని మత్స్యకారులు  ఆరోపించారు. వ్యాన్లలో చేప పిల్లలను తెచ్చి తమకు తెలియకుండానే వాటిని రిజర్వాయర్​లో పోసి అన్యాయం చేస్తున్నారని మత్స్యకారుల సంఘం సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే చేపల పిల్లల పంపిణీ కార్యక్రమంలో సరైన ఏర్పాట్లు చేయలేదని అధికారులు, మత్స్యకారుల సంఘంపై ఎమ్మెల్యే  ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్​ఫెడ్  వైస్  చైర్మన్  బొర్రా రాజశేఖర్, మున్సిపల్  చైర్మన్  జైపాల్  తదితరులు పాల్గొన్నారు. 

ఎగ్జామ్​ సెంటర్ల వద్ద 144 సెక్షన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రూప్-1 ఎగ్జామ్​ సెంటర్ల వద్ద 144 సెక్షన్​ అమలు చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్​ వినీత్​ తెలిపారు. ఎస్పీ ఆఫీస్​లో పోలీసు అధికారులతో గురువారం మీటింగ్​ నిర్వహించారు. ఎగ్జామ్ ​సెంటర్ల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, పాన్​ షాపులతో పాటు ఇతర దుకాణాలను మూసి వేయాలని, సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్​ అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, గుండాల, ఇల్లందు మండలాల నుంచి ఎగ్జామ్​కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని చెప్పారు. ఎగ్జామ్​ కో ఆర్డినేటర్​గా ఏఆర్​ అడిషనల్​ ఎస్పీ డి శ్రీనివాసరావు వ్యవహరిస్తారని తెలిపారు. డీఎస్పీలు వెంకటేశ్వరబాబు, రమణమూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు. 

కంట్రోల్​రూమ్  ఏర్పాటు
ఖమ్మం టౌన్: ఈ నెల 16న నిర్వహించే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేసినట్లు కలెక్టర్  వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1077, మొబైల్ నెంబర్ 9063211298 కాల్ చేయాలని సూచించారు. 
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
గ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆరు డిపోల నుంచి 110 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ ఎం ఎస్తేర్ ప్రభులత తెలిపారు. అభ్యర్థులు సకాలంలో ఎగ్జామ్​ సెంటర్లకు చేరుకొనేలా బస్  సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

అశ్వారావుపేట, వెలుగు: తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో సర్వేకొచ్చిన సిబ్బందిని ప్రశ్నిస్తూ గురువారం మండలంలోని పేటమాలపల్లి గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 911 లో 80 మంది రైతులు 200 ఎకరాలలో భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ భూములకు మాజీ సీఎం జలగం వెంగళరావు హయాంలో పాస్​ పుస్తకాలను ఇచ్చారని, అప్పటి నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. పట్టాలు ఉన్న భూములను సర్వే చేయడం ఏమిటని పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్​ అధికారులను నిలదీశారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి డిజిటల్ పాస్​ బుక్కులను అందజేయాలని డిమాండ్ చేశారు. హక్కు పత్రాలు తమకి అవసరం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరడంతో రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్ఐ కృష్ణ అక్కడికి చేరుకొని పాస్ బుక్​లను పరిశీలించి తహసీల్దార్  ఆఫీసుకు రావాలని రైతులకు సూచించారు. బాధిత రైతులు అల్లాడి వెంకట రామారావు, వీరస్వామి, కృష్ణ, గోపి, మంగరాజు, రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పోడు భూముల సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఖమ్మం టౌన్, వెలుగు: పోడు భూముల సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఫారెస్ట్​ ఆఫీసర్లతో పోడు భూముల సర్వేపై సమీక్షించారు. నెలాఖరులోగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. గురువారం నాటికి 2662 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపారు. పోడు చేస్తున్న భూమి కాకుండా కొత్తగా అటవీ భూమిని ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అడిషనల్​ కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఎఫ్​వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎఫ్​డీవోలు  ప్రకాశ్​రావు, మంజుల, ఎఫ్ఆర్వో రాధిక పాల్గొన్నారు.

సర్వేను పరిశీలించిన ఆర్డీవో
కారేపల్లి: మండలకేంద్రంలో నిర్వహిస్తున్న పోడు భూముల సర్వేను ఆర్డీవో రవీంద్రనాథ్​​ పరిశీలించారు. పోడు సాగుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీవో వెంట సింగరేణి 
తహసీల్దార్​ రవికుమార్​ ఉన్నారు.

పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం
మణుగూరు: రాష్ట్రంలో పోడు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మండలంలోని పగిడేరు గ్రామంలో పోడు సాగుదారుల సర్వేను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జడ్పీటీసీ పోశం నరసింహారావు, తహసీల్దార్ నాగరాజు, ఎఫ్ఆర్వో ద్వాలియ, ముత్యంబాబు పాల్గొన్నారు. 

గర్భిణి ఆత్మహత్య
మణుగూరు, వెలుగు: అశ్వాపురం మండలంలో ఏడు నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అశ్వాపురం ఎస్సై జితేందర్ తెలిపారు. మండలంలోని చింతిర్యాల క్రాస్ రోడ్ లో నివాసముంటున్న కొణతాల భవాని(25) గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్లు చెప్పారు. భార్యాభర్తల మధ్య  కొంతకాలంగా నెలకొన్న గొడవలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. 

తండ్రి మందలించాడని..
సత్తుపల్లి: పొలం పనులకు వెళ్లమని తండ్రి మందలించాడని మనస్తాపంతో మండలంలోని బేతుపల్లి గ్రామానికి చెందిన సిద్ధనబోయిన నందగోపాల్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి మందలించడంతో ఈ నెల 7న పురుగుమందు తాగగా, ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి పెదనాన్న సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెండ్లికి నిరాకరించడంతో..
పినపాక: ప్రేమించిన యువకుడు పెండ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన  ఇంటర్​ స్టూడెంట్​ ఇర్ప లలిత(20) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏడూళ్లబయ్యారం ఎస్సై టీవీఆర్​ సూరి తెలిపారు. అదే గ్రామానికి చెందిన వల్లెపు శివ, లలిత ప్రేమించుకున్నారు. హైదారాబాద్​ పనుల కోసం వెళ్లిన శివ ఇటీవల గ్రామానికి తిరిగి రాగా, పెండ్లి చేసుకుందామని ఆమె ఒత్తిడి చేయడంతో కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని నిరాకరించాడు. దీంతో లలిత పురుగుమందు తాగగా,కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పిడుగుపాటుకు మహిళ మృతి
కారేపల్లి: మండలంలోని భల్లునగర్​తండాకు చెందిన బానోత్​ శాంతి(32) తన భర్తతో కలసి మిర్చి తోటలో పని చేస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయింది. భార్యాభర్తలిద్దరూ చేలో చెరో వైపు పని చేస్తుండగా పిడుగు పడింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గుర్తు తెలియని మహిళ డెడ్​బాడీ లభ్యం
వైరా: వైరా రిజర్వాయర్ లో  గుర్తు తెలియని మహిళ మృతదేహం మత్స్యకారులకు కనిపించడంతో కొణిజర్ల పోలీసులకు సమాచారం అందించారు. చీకటి పడడంతో మృతదేహన్ని శుక్రవారం రిజర్వాయర్​ నుంచి బయటకు తీస్తామని పోలీసులు తెలిపారు.

చెరువులో మునిగి వ్యక్తి మృతి
ములకలపల్లి: మద్యం మత్తులో చెరువులో ఈతకు వెళ్లి చింతపేట గ్రామానికి చెందిన సోయం అరుణ్(38) చనిపోయాడు.​స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. సోయం అరుణ్, గడ్డం శివ, మడకం నాగరాజు మద్యం తాగి గ్రామ శివారులోని పెనుబల్లి వారి చెరువుకుఈతకు వెళ్లారు. శివ చెరువు ఒడ్డున ఉండగా నాగరాజు, అరుణ్ చెరువులో దిగారు. మద్యం మత్తులో ఒడ్డుకు రాలేక అరుణ్ మునిగిపోయాడు. చెరువులో గాలించగా అరుణ్  మృతదేహం దొరికింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్​ తెలిపారు.

ప్లాంటేషన్ లో మొక్కలు నరికివేత
చండ్రుగొండ,వెలుగు: మండలంలో పోడు సర్వే జరుగుతున్న నేపథ్యంలో రావికంపాడు గ్రామ శివారులోని ఫారెస్ట్  ప్లాంటేషన్ మొక్కలను పోడుదారులు నరికారు. గురువారం చండ్రుగొండ ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు నరికిన మొక్కలను పరిశీలించారు. ప్లాంటేషన్ లో 250 మొక్కలు నరికారని, గ్రామంలో పోడు సర్వేని నిలిపేసి మొక్కలు నరికిన ఐదుగురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా పోడు సాగు చేయాలని ఫారెస్ట్ లో మొక్కలు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యావలంటీర్ల గౌరవ వేతనాలు రిలీజ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పెండింగ్​లో ఉన్న విద్యావలంటీర్ల గౌరవ వేతనాలు రిలీజ్​ అయ్యాయని డీఈవో సోమశేఖరశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 2020 నుంచి మార్చి వరకు పని చేసిన వారికి సంబంధించిన గౌరవ వేతనాలు ఎస్టీవోలలో జమ అయ్యాయని తెలిపారు. భద్రాచలం ఎస్టీవో పరిధిలో రూ.25,36,338, మణుగూరు ఎస్టీవో పరిధిలో రూ.28,72,791, కొత్తగూడెం ఎస్టీవో పరిధిలో రూ.33,90,411, ఇల్లందు ఎస్టీవో పరిధిలో రూ. 21,22,242, అశ్వారావుపేట పరిధిలో రూ. 39,33,912 లకు సంబంధించిన రిలీజ్  ఆర్డర్లను​సబ్​ ట్రెజరీ ఆఫీసులకు పంపినట్లు పేర్కొన్నారు. బిల్లులు ప్రిపేర్​ చేసి వెంటనే గౌరవ వేతనాలు అందించాలని సూచించారు.

విద్యావలంటీర్ల గౌరవ వేతనాలు రిలీజ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పెండింగ్​లో ఉన్న విద్యావలంటీర్ల గౌరవ వేతనాలు రిలీజ్​ అయ్యాయని డీఈవో సోమశేఖరశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 2020 నుంచి మార్చి వరకు పని చేసిన వారికి సంబంధించిన గౌరవ వేతనాలు ఎస్టీవోలలో జమ అయ్యాయని తెలిపారు. భద్రాచలం ఎస్టీవో పరిధిలో రూ.25,36,338, మణుగూరు ఎస్టీవో పరిధిలో రూ.28,72,791, కొత్తగూడెం ఎస్టీవో పరిధిలో రూ.33,90,411, ఇల్లందు ఎస్టీవో పరిధిలో రూ. 21,22,242, అశ్వారావుపేట పరిధిలో రూ. 39,33,912 లకు సంబంధించిన రిలీజ్  ఆర్డర్లను​సబ్​ ట్రెజరీ ఆఫీసులకు పంపినట్లు పేర్కొన్నారు. బిల్లులు ప్రిపేర్​ చేసి వెంటనే గౌరవ వేతనాలు అందించాలని సూచించారు.

లెదర్ పార్క్ స్థలాన్ని కాపాడాలి
మధిర, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలోని లెదర్ పార్క్ స్థలాన్ని కాపాడాలని తహసీల్దార్​ ఆఫీస్ ముందు గురువారం  ఎమ్మార్పీఎస్, చర్మకారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కటుకూరి శ్యాంరావు మాట్లాడుతూ లెదర్​పార్క్​ స్థలాన్ని కాపాడాలని కోరారు. లెదర్ పార్క్ స్థలం కబ్జా చేస్తున్న వారిని శిక్షించాలని  డిమాండ్ చేశారు. తహసీల్దార్​ రాంబాబుకు వినతిప్రతం అందజేశారు. 

విధుల్లోకి మధిర లాయర్లు
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.శ్రీనివాసరావు చొరవతో మధిర కోర్టు న్యాయవాదులు గురువారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో శిథిలమైన పాత కోర్టు భవనాన్ని తొలగించి కొత్త కాంప్లెక్స్​ నిర్మించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు మూడు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. జిల్లా జడ్జి చొరవ తీసుకొని హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ తో చర్చలు జరిపారు. వీలైనంత త్వరలో కోర్టు నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.

టేకులవాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు
చండ్రుగొండ,వెలుగు: తుంగారం గ్రామ శివారులోని టేకులవాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత తెలిపారు. గురువారం టేకులబంజరు, సుంకరబంజరు, జర్పులాతండా గ్రామాలను సందర్శించారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం రాలేదని, టేకులవాగు ప్రాజెక్టులోకి వరద నీరు రాకుండా మట్టి అడ్డు వేశారని ఇటీవల గ్రామస్తులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్​ ఆదేశాలతో ఆర్డీవో గ్రామాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఇరిగేషన్  ఆఫీసర్ల తో మాట్లాడి ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తామని, రైల్వే లైన్  పరిహారం డబ్బులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీవో వెంట తహసీల్దారు రవికుమార్  ఉన్నారు.