‘సీతారామ’ సొరంగం.. ముందుకు పడలే..!

‘సీతారామ’ సొరంగం.. ముందుకు పడలే..!
  • పాలేరు లింక్​ కెనాల్ నిర్మాణానికి నిర్ణయం

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రాజెక్టులో సొరంగం పనులు ముందుకు సాగడం లేదు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, ఆయకట్టు స్థిరీకరించడం కోసం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. రూ.3 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టుకు ఓకే చేయగా, నిధుల విడుదలలో ఆలస్యంతో ఏళ్ల తరబడి పనులు కొనసాగుతున్నాయి. పాలేరు లింక్ ​కెనాల్16వ ప్యాకేజీలో దాదాపు ఏడాది క్రితం ఈ సొరంగం పనులను స్టార్ట్​చేశారు. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మధ్యలో 14.22 కిలోమీటర్ల దూరం కాలువలు తవ్వాల్సి ఉంది. 12 కిలోమీటర్ల సొరంగం, ఓపెన్​ఛానల్ ను నిర్మించడం ద్వారా సుమారు రూ.100 కోట్ల మేర ఖర్చు తగ్గుతుందని అధికారులు లెక్కలు వేశారు. భూసేకరణ భారం తగ్గడంతో సీసీ నిర్మాణాలు కూడా తగ్గుతాయని భావించారు. గతేడాది మార్చిలోనే సొరంగం ప్రతిపాదనల ఫైల్ ను ఉన్నతాధికారులకు పంపించారు. అప్పటి నుంచి క్లియరెన్స్​కోసం వెయిట్ చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఎప్పుడు అడిగినా సీఎం కేసీఆర్ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాలని, జీవో రావాలని, ఒకట్రెండు వారాల్లో వచ్చే అవకాశముందని చెప్పుకొస్తున్నారు. అయితే సొరంగంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రాక గ్రామాల్లో భూమిని కోల్పోతున్న రైతులు మాత్రం టెన్షన్​ పడుతున్నారు. 

భారం తగ్గుతుందని పరిహారం ఆపారు..

అశ్వాపురం నుంచి పాలేరు రిజర్వాయర్​కు గోదావరి నది ద్వారా నీటిని తరలించేందుకు లింక్​ కెనాల్​ను నిర్మిస్తున్నారు. ఈ కాలువ తవ్వకం కోసం 884 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 759 ఎకరాలకు అవార్డు ప్రకటించారు. ఇప్పటి వరకు 294 ఎకరాలు సేకరించి రూ.54 కోట్ల పరిహారం విడుదల చేశారు. ఇంకా 590 ఎకరాలను సేకరించాల్సి ఉంది. అయితే సొరంగం ఆలోచనతో ఆ భూములకు పరిహారాన్ని చెల్లించలేదు. ఈ ప్యాకేజీలో 64.5 కిలోమీటర్ల నుంచి 73.5 కిలోమీటర్ల మధ్య సుమారు 39 మీటర్ల లోతుగా డీప్​కట్ చేసి కాలువ తవ్వాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏడున్నర కిలోమీటర్ల మేర టన్నెల్(సొరంగం) తవ్వడం ద్వారా రూ.90 కోట్ల మేర భూసేకరణ భారం తగ్గనుంది. దీంతోపాటు రూ.20 కోట్ల వరకు కాంక్రీట్ స్ట్రక్చర్స్​నిర్మాణ ఖర్చు తగ్గుతుందని అంచనా వేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి గ్రీన్​ సిగ్నల్ రాక మిగిలిన చోట పనులు చేస్తున్నారు. 

రైతులకనుగుణంగా కోర్టు తీర్పు..

తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు నుంచి కూసుమంచి మండలం పోచారం వరకు సొరంగం తవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు కొందరు తమకు చెల్లించే పరిహారం సరిపోదంటూ కోర్టుకెళ్లారు. దీంతో వారిలో కొందరు రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో రెండు వారాల క్రితం దాదాపు రూ.30 కోట్లను అధికారులు వారి అకౌంట్లలో జమచేశారు. ఇంకా 15వ ప్యాకేజీలో 13 ఎకరాలకు రూ.2.5 కోట్లు పెండింగ్ ఉండగా,14వ ప్యాకేజీలో 651 ఎకరాలకు రూ.64.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో 19 ఎకరాలకు రూ.2 కోట్లు డబ్బులు రిలీజ్ కాగా, 39 ఎకరాల ప్రభుత్వ భూమి పోను మిగిలిన 592 ఎకరాలకు రూ.68.5 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 

ఎన్నికల్లో లబ్ధి పొందాలని...

ఇక సత్తుపల్లి లింక్​ కెనాల్ రుద్రాక్షపల్లి, బుగ్గపాడు, యాతాలకుంటకు చెందిన రైతులకు పరిహారం పెండింగ్ ఉంది. వీటిని త్వరగా చెల్లించాలంటూ గత వారం సీఎం కేసీఆర్ ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిసి రిక్వెస్ట్ చేశారు. ఇటీవల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే విషయంపై సీఎంను కలిశారు. దీంతో తాజాగా ప్యాకేజీ 9లో భూసేకరణకు రూ.28.40 కోట్లు, ప్యాకేజీ10లో నాగుపల్లి, బుగ్గపాడు, రుద్రాక్షపల్లిలో భూసేకరణకు రూ.23.94 కోట్లు మంజూరయ్యాయి. యాతాలకుంట దగ్గర1.61 కిలోమీటర్ల పొడవున 5 మీటర్ల టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు. ముందుగా సత్తుపల్లి ట్రంక్​కెనాల్​నిర్మాణాన్ని పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ కు సీతారామ ద్వారా నీళ్లందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే నీటిని తరలించడం ద్వారా లబ్ది జరుగుతుందనే ఆలోచనలో అధికార పార్టీ లీడర్లున్నారు. 

భూములు తియ్యకుండా సొరంగమే తవ్వాలె..

రెండేళ్ల కింద నా పంట భూమిలో సార్లు సర్వే చేసిండ్రు. 2.02 ఎకరాల భూమి తీసుకుంటున్నమని చెప్పిండ్రు. దీని పైసలు మాత్రం ఇప్పటికీ ఇయ్యలేదు. సొరంగంతో మా భూములు తీసుకునే అవసరం లేదని సార్లు అంటున్నరు. మా రెవెన్యూ పరిధిలోనే దాదాపు 350 ఎకరాల వరకు రైతులకు పైసలు ఇయ్యలేదు. సొరంగం తవ్వితేనే విలువైన భూములను మేం నష్టపోకుండా ఉంటాం.
– శ్రీనివాస్​ రెడ్డి, రైతు, బీరోలు