కూర్చొనే ఉంటున్నారా..? అయితే కరోనా కంటే డేంజర్

కూర్చొనే ఉంటున్నారా..? అయితే కరోనా కంటే డేంజర్

చెమటోడ్చకుండా సుకుమారంగా ఉంటే.. కోటి కష్టాలు తప్పదు

కోవిడ్‌‌ ఎఫెక్ట్‌‌తో లైఫ్‌‌స్టైల్‌‌ పూర్తిగా మారింది. కష్టపడి ఒళ్లొంచే పనిచేయకున్నా ఆపీసు ఉద్యోగం చేసేటోళ్లు ఇంటికీ–ఆఫీసుకీ తిరగడానికైనా కొంచెం కష్టపడాల్సి ఒచ్చేది. గిప్పుడా కష్టం లేకపాయె. ఇప్పుడు భలేగుంది లైఫ్​ అని చాలామంది వర్క్‌‌ఫ్రమ్​హోమ్‌‌ను మస్తుగా ఎంజాయ్​ చేస్తున్రు. గిట్ల సెడెంటరీ లైఫ్‌‌స్టైల్ మస్త్ పెరిగింది. కరోనా ప్రికాషన్స్‌‌తో ఎవ్వళ్లూ గడప దాటట్లే. వర్క్​ఫ్రమ్​హోమ్‌‌తో కాలు కదిపేది లేకుండె. రెగ్యులర్​గా తెచ్చుకునే కూరగాయలు వారానికో పాలి తెచ్చుకుంటన్రు. కిరాణా సరుకులైతే నెలకో తాప తెచ్చుకుంటున్రు. కొన్ని వ్యాపారాలే బంద్​పెట్టిన్రు. స్కూళ్లు లేవ్. కరోనాని కట్టడి చేస్తున్నమని మనం అనుకుంటున్నం. గాని, కరోనాయే మనల్ని కట్టడి చేస్తున్నట్టుంది! కొన్ని దినాలు గిట్లనే ఉన్నరనుకో, కోవిడ్‌‌ని మించిన డేంజర్‌‌‌‌లో ఉంటమని అలర్ట్  చేస్తున్రు. ఈ విషయంలో  డాక్టర్ వై. కృష్ణమోహన్ చెప్పిన సూచనలు.

సెడెంటరీ లైఫ్‌‌స్టైల్ అంటే ఏంది?

రోజులో చేసే పనుల్లో అలసిపోయేంత శారీరక శ్రమ లేని జీవితాన్ని సెడెంటరీ లైఫ్‌‌స్టైల్ అంటరు. కూర్చుని పద్దులు రాసేటోళ్లు, కౌంటర్లో డబ్బులు లెక్కలు చూసుకునేటోళ్లు, ఇంటి పనులకూ మెషిన్లు వాడే హోమ్​ మేకర్స్, కంప్యూటర్ కొలువులు చేసేటోళ్లంతా చెమట పట్టకుండా పనులు చేస్తరు. గట్లాంటి పనులు చేసినా పొద్దుగాల లేకుంటే మాపటేల ఓ ముప్పావుగంట సేపు ఎక్సర్​సైజులు చేయాలె. గిది గూడ లేదంటే వాళ్లది సెడెంటరీ లైఫ్​ స్టైల్ అంటరు. ఒక్కమాటలో చెప్పాలంటే సుకుమారంగా బతకడం అన్నమాట.

గిదే లైఫ్‌‌స్టైల్‌‌

కరోనా వైరస్​ వచ్చినంక చాలా కంపెనీలు కోవిడ్​ రూల్స్‌‌కు తగ్గట్టే ఆఫీసులు నడుపుతున్నయ్. కరోనా వల్ల జాబ్​లేకుండా పోయినోళ్లు ఇంట్లనే ఉంటున్రు. జాబ్‌‌ ఉన్నోళ్లలో ఎక్కువగా కంప్యూటర్‌‌‌‌లనే పని. ఆ పని అయిపోయినంక ట్యాబ్‌‌లో సినిమా, ఫోన్​లో గేమ్స్.. ఇంకేం మస్త్​గా ఎంజాయ్​ చేస్తున్రు. జాబ్​లేనోళ్లు పుర్సత్‌‌గా రోజంత టీవీ చూస్తున్రు. ఇంతకుముందు చిన్న చిన్న పనులకు బయటికిపోయి, నలుగురిని కలిసేటోళ్లు కూడా ఇంట్లనే ఉంటున్నరు. గీ లైఫ్‌‌స్టైల్కి చాలా మంది ఇప్పుడిప్పుడే అలవాటైతున్రు. గిది స్టార్టింగ్. ఇప్పుడేం అనిపించదు గానీ, ముందు ముందు రోగాలు కచ్చితంగ ముసురుకుంటయట. ఎందుకట్లయితది, ఎసుంటి రోగాలొస్తయో అని తెలుసుకుంటే మంచిదే. గట్లనే ఏ రోగం రాకుండా లైఫ్‌‌స్టైల్ని మార్చుకుంటే ఇంకా మంచిది.

ఇట్లయితది మొదాల

బయటికిపోవడం, ట్రావెల్ చేయడం లాంటి మినిమమ్​ ఫిజికల్​యాక్టివిటీ గూడ లేకపోతే బాడీలోని సెల్స్‌‌లో మెటబాలిజం తగ్గిపోతది. ఎప్పుడైతే మెటబాలిజం తగ్గుతదో అప్పటి సంది బాడీలో ఉండే ఎడినోసిన్​ ట్రై ఫాస్పేట్స్​(ఎనర్జీ మాలిక్యూల్స్) ఖర్చవుడు తగ్గిపోతది. అట్లనే ఆ మాలిక్యూల్స్ అన్నీ ఫ్యాట్​గా మారిపోతుంటయ్. దీంతో కొవ్వు పెరుగుతది.

తిన్నదంతా దండుగే

బాడీలో మెటబాలిజం తగ్గితే డైజెస్టివ్​ సిస్టమ్​ కూడా వీక్ అయితది. అప్పుడు ఎంత తిన్నా దండగే. ఇమ్యూనిటీ కోసం ప్రొటీన్​ రిచ్​ ఫుడ్, విటమిన్స్, మినరల్స్​ కోసం ఎన్ని ఫ్రూట్స్​తిన్నా ఒంటబట్టవు. అబ్జార్ప్షన్ తగ్గితే రక్తం తగ్గిపోతది. ఇమ్యూనిటీ కూడా తగ్గుతది. హార్మోన్స్​ ఇన్​బ్యాలెన్స్​ మొదలైతది.

బాడీ వీక్​

ఒంటికి కష్టమైన పని లేకపోతే మజిల్స్​ ప్లాసిడ్ లాగా (కండరాలు బక్క చిక్కడం) మారిపోతయి. ఇట్ల కండరాలు తగ్గిపోయి మనిషి వీక్​ అయితడు.

బోన్స్‌‌లో పెయిన్​

డైజెస్టివ్​ సిస్టమ్‌‌లో అబ్జార్బ్​తగ్గితే బోన్స్​కి కావాల్సిన మినరల్స్ సరిగా అందయి. పోనీ, అందినా ఎముకలు గూడా అబ్షార్బ్​ చేయలేవు. ఎముకల్లో ఉండాల్సిన క్యాల్షియం, ఫాస్పరస్​లాంటి మినరల్స్ కంటెంట్ తగ్గిపోతది. అప్పటి సంది జాయింట్ పెయిన్స్ ​షురువైతయ్. గాయం ఉండదు. ఎక్స్‌‌రేలో ఏమీ ఏర్పడదు. అంతా మంచిగనే కనిపిస్తది. అయినా తట్టుకోలేని నొప్పి తిప్పలు పెడుతది. అన్‌‌నోన్​ పెయిన్​ ఉందంటే బోన్స్‌‌లో మినరల్స్ కంటెంట్ తగ్గినట్లే లెక్క.

మెటబాలిక్​ సిండ్రోమ్

ఫిజికల్‌‌ యాక్టివిటీ లేకుంటే బాడీలో ఎనర్జీ మాలిక్యూల్స్​ ఖర్చుకాకుండా ఫ్యాట్స్‌‌గా కన్వర్ట్ అయితయి. ఈ ఫ్యాట్​ వల్ల ఒబెసిటీ వస్తది. దానితో డయాబెటిస్, బీపీ రోగాలొస్తయి. మెటబాలిక్ సిండ్రోమ్​ వల్లే ఈ మూడు రోగాలు కట్టగట్టుకుని వస్తయి.

గుండెకు పోటు

బ్లడ్​తగ్గి, మజిల్స్​వీక్​ అయి గుండె కండరాలు కూడా సరిగా పనిచేయక బ్లడ్​ ప్రెజర్​ తగ్గుతది. కొలెస్ర్టాల్ పెరుగుతది. హార్ట్ డిసీజ్​లే కాకుండ ఒక్కోపాలి హార్ట్ అటాక్​ కూడా అస్తది. బ్రెయిన్​ స్ర్టోక్​వచ్చే ప్రమాదముంది.

డయాబెటిస్​

ఒబెసిటీకి, డయాబెటిస్ దగ్గరి చుట్టం. డయాబెటిస్ వస్తే ఒబెసిటీ వస్తది. ఒబెసిటీ వస్తే డయాబెటిస్​ వస్తది. ఎక్కువ బరువే కాకుండా హార్మోన్​ ఇన్​బ్యాలెన్స్​ కూడా ఉండి టైప్–2 డయాబెటిస్ అస్తది.

క్యాన్సర్​

సెడెంటరీ లైఫ్‌‌స్టైల్ వల్ల కొందరిలో క్యాన్సర్​వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లు శారీరక శ్రమ లేకుండా చాలా రోజులు వుంటే, వాళ్లలో ఉండే జీన్స్​ సంబంధమైన క్యాన్సర్​ లక్షణాలు తొందరగా బయటపడతాయి. కొలోన్​ క్యాన్సర్, బ్రెస్ట్​ క్యాన్సర్‌‌‌‌, యుటిరస్​ క్యాన్సర్​ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్​ ఉన్నవాళ్లు చాలా అలర్ట్ గా ఉండాలె.

బోలు ఎముకలు

పనిలేకుంటే బోన్​ డెన్సిటీ (క్యాల్షియం డెన్సిటీ) తగ్గి ఆస్టియో పొరోసిస్​ అస్తది. ఎముకలు బోలుగా అయిపోయితాయి. ఒబెసిటీ ఉంటే ఈ ప్రాబ్లమ్ డబుల్ అయితది. చిన్న చిన్న బరువులు పట్టినా, చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోతయ్​.

యాంగ్జయిటీ

ఒక్కసారిగా వెయిట్​ పెరగడం, బాడీ షేప్​ మారిపోతే యాంగ్జయిటీ కూడా పెరుగుతది. దానితో పని మీద శ్రద్ద తగ్గుతది. రిజల్ట్​మీద ఎఫెక్ట్​ పడుతది. నిద్ర సరిగా ఉండదు.

గిట్ల జేస్తే సేఫ్టీగ ఉంటం

ప్రతి ఒక్కరికీ సెల్ఫ్‌‌ ​మోటివేషన్​ ఉండాలె. తనంతట తానే పరిస్థితుల్ని అర్థంచేసుకోవాలె. ‘ఆఫీస్​ పని చేయాలె.  అట్లనే హెల్తీగా ఉండేందుకు కొంత టైమ్​ కేటాయించాలె. రెండూ అవసరమే అనుకోవాలె.

హౌజ్​ వర్క్స్, గార్డెనింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఫిజికల్​యాక్టివిటీతోపాటు మెంటల్ గా కూడ రిలాక్స్​ అవుతరు.

అవకాశం ఉంటే ప్రతి రోజూ 45 నిమిషాలు వర్కవుట్స్ చేయొచ్చు. హ్యాండ్​ వెయిట్స్​లిఫ్ట్ చేయొచ్చు. సైక్లింగ్ ​చేయొచ్చు. వాకింగ్​ చేయొచ్చు. ఇంట్లనే యోగా, ఎరోబిక్స్, డ్యాన్స్​ చేయొచ్చు.

స్థోమత ఉంటే ఇంట్లనే ఎక్సర్​సైజ్​ ఎక్విప్‌‌మెంట్స్​కొని, జిమ్​ ఏర్పాటు చేసుకోవచ్చు. 

వర్క్ ఫ్రమ్​హోమ్ ​చేస్తూ ఉంటే కుర్చీలోనే ఉండిపోకుండ గంటకోపాలి లేవాలె. అయిదు, పది నిమిషాలు నడవాలె.

కూర్చునే పని చేయాలని లేదు. గంటకోసారి నిలబడి కూడా పని చేయాలి. ల్యాప్‌‌టాప్‌‌ని నిలుచుని పనిచేసేందుకు అనుకూలంగా ఉండే హైట్‌‌లో పెట్టాలె. అడ్జస్టబుల్‌‌ టేబుల్స్‌‌ వాడాలె. అయిదు నుంచి పది నిమిషాలపాటు ఇట్ల నిలబడి చేయాలె.

ఏ పని చేస్తున్నా నిలబడి చేస్తే మంచిది.

ఫోన్​ మాట్లాడేటప్పుడు నిలబడి గాని, అటు ఇటు నడుస్తగానీ ఉండాలె. 

టీవీ చూస్తనే హాల్‌‌లో అటు ఇటు నడవాలె. రిమోట్ వాడకుండా స్విచ్‌‌లు నొక్కుతూ టీవీని ఆపరేట్ చేస్తే మధ్య మధ్యలో బాడీ మూవ్‌‌మెంట్స్‌‌ ఉంటయ్‌‌. 

ఇంటి చుట్టూ లేకుంటే ఇంటికి దగ్గర్లోనే 45 నిమిషాలు వాకింగ్​ చేయాలె. 

లిఫ్ట్​ మాని, మెట్లు ఎక్కాలె. ​

లావు పెరుగుతున్నట్లు అనిపిస్తే ఒబెసిటీ చెకప్​ చేయించుకోవాలె.