సంగారెడ్డి, పటాన్ చెరు సెగ్మెంట్లలో.. బీఆర్ఎస్​లో అసమ్మతి లీడర్ల సెగ

సంగారెడ్డి, పటాన్ చెరు సెగ్మెంట్లలో.. బీఆర్ఎస్​లో అసమ్మతి లీడర్ల సెగ
  •  టికెట్​ రాని నేతల ఇండ్ల చుట్టూ తిరుగుతున్న సిట్టింగులు
  •  సంగారెడ్డి, పటాన్ చెరు సెగ్మెంట్లలో బల ప్రదర్శనలు
  •  జహీరాబాద్ లో సామాజిక వర్గాల తిరుగుబాటు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో బీఆర్​ఎస్​లో సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ లీడర్ల నుంచే తలనొప్పి పెరుగుతోంది. టికెట్లు రానివాళ్లు రెబల్స్​ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొందరు చివరికి  తమకే టికెట్​ వస్తుందని ధీమాగా ఉన్నారు.  దీంతో సిట్టింగ్​ ఎమ్మెల్యేలు ఆయా లీడర్లను బుజ్జగించే పనిలో పడ్డారు. లీడర్ల ఇంటికి వెళ్లి తమకే మద్దతు ఇవ్వాలని కోరక తప్పడం లేదు. కొందరు నేతలు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు సహకరిస్తుండగా.. మరికొందరు తగ్గమని చెబుతున్నారు. 

ప్రస్తుతం సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బుజ్జగింపులు, బలప్రదర్శనలతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.  ఇక్కడి రాజకీయ పరణామాలను సిటింగ్ ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ కు చేరవేస్తున్నారు. మరోవైపు అసమ్మతి నేతలు పార్టీ మారే ప్లాన్​లో కూడా ఉన్నారు. దాని కోసం కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు వినిపిస్తోంది. 

పటాన్ చెరులో...

పటాన్ చెరు లో బీసీ నేత నీలం మధు అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులకు ఎక్కడ కూడా అధికార పార్టీ   టికెట్ ఇవ్వలేదని  పటాన్ చెరులో  టికెట్​ ఇస్తే గెలిచి చూపిస్తానని సవాల్​ విసురుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో బీసీ నేతలను ఏకం చేస్తుండటం సిట్టింగ్ ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లేదా బీజేపీ లో చేరాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెసుతన్నట్టు సమాచారం. వారం పది రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని పూర్తిస్థాయి నియోజకవర్గాన్ని చుట్టేయాలని నీలం మధు ప్లాన్ చేస్తున్నట్టు అనుచరులు తెలిపారు. అయితే విషయాన్ని గ్రహించిన పార్టీ హై కమాండ్ బుజ్జగింపుల నేపథ్యంలో హైదరాబాద్ కు రావాలని  పిలిపించి, మాట్లాడింది.  

జహీరాబాద్ లో...

జహీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు ఇటీవల పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత నరోత్తం, సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ తలనొప్పిగా మారారు.  ఈ ఇద్దరు కూడా జహీరాబాద్ టికెట్ ఆశించి అధికార పార్టీలో చేరగా చివరకు భంగపాటు తప్పలేదు. అయితే నియోజకవర్గంలో మంచి పట్టు సాధించిన ఇద్దరు నేతలను బుజ్జగించే ప్రయత్నంలో ఎమ్మెల్యే మాణిక్ రావుఉన్నారు. 

ఈ క్రమంలో ఢిల్లీ వసంత్ ను ఇటీవల కలిసిన సిట్టింగ్ ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరగా, ఆయన సున్నితంగా తీరస్కరించినట్టు తెలిసింది. తన సామాజిక వర్గానికి దళిత బంధుతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలలో అన్యాయం జరిగిందని ప్రస్తావించిన ఆయన తన వర్గం కోసం ఎన్నికల బరిలో ఉండాల్సిందేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపోతే టికెట్ ఆశించి పార్టీలో చేరిన నరోత్తంకు సీఎం కేసీఆర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్టు ఆయన వర్గీయుల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జహీరాబాద్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

సంగారెడ్డిలో...

సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న చింత ప్రభాకర్ సొంత పార్టీ ముఖ్య నేతల ఇంటింటికీ తిరిగి మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి అధికార పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఓ లీడర్ ఇంటికి వెళ్లి చింత మద్దతు కోరారు. ‘ తన అనుచరులను ఇంతకాలం అణగదొక్కి , తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి, ఇప్పుడు మద్దతు ఎలా అడుగుతున్నార’ ఆయన మండిపడ్డట్టు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఇంటికి వెళ్లగా ఆ టైంలో ఆయన లేకపోయేసరికి అతని భార్య, కొడుకును మద్దతు కోరగా..మాణిక్యంతో మాట్లాడాలని సూచించారు. ఇదిలా ఉంటే టికెట్టు ఆశించి భంగపడ్డ సదాశివపేటకు చెందిన ముదిరాజ్ సంఘం నేత పులిమామిడి రాజుకు మద్దతుగా సంఘం నేతలు బల ప్రదర్శన చేస్తున్నారు. పైగా రాజు బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.