ఖాళీ బిందెలతో ఆరు కిలోమీటర్లు పాదయాత్ర

ఖాళీ బిందెలతో ఆరు కిలోమీటర్లు పాదయాత్ర

పాల్వంచ, వెలుగు: తాగునీరు ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ  గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మున్సిపల్​ ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గిరిజన గ్రామాలైన పెద్ద బంగారు జాల, తాటి గుంపు, మధ్య గుంపు, బాడిశ గుంపునకు చెందిన మహిళలు శుక్రవారం సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో గ్రామం నుంచి నడుచుకుంటూ వచ్చి మున్సిపల్​ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తాగునీరు లేక కష్టాలకు గురవుతున్నామన్నారు. 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఎన్నోసార్లు మున్సిపల్​ఆఫీసులో వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదన్నారు. కాలనీల్లో 300 పైగా కుటుంబాలు ఉన్నాయని, వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రజాపంథా సబ్ డివిజన్ కార్యదర్శి నిమ్మల రాంబాబు హెచ్చరించారు.