ధరణిలో 6 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్

ధరణిలో 6 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్

    

హైదరాబాద్, వెలుగు: ధరణిలో అసైన్డ్ భూములుగా ఉండి.. వాటిని పట్టాగా మార్చాలని అప్లికేషన్ వస్తే వాటిని చూడకుండానే రిజెక్ట్ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. పొరపాటున అసైన్డ్ లిస్ట్​లో పడిన భూములయినా సరే ఎమ్మార్వోలు పాజిటివ్​ రిపోర్ట్, ఆధారాలు ఉన్నా పట్టించుకోవద్దని.. అలాంటి వాటిని బల్క్​గా తిరస్కరించాలని స్పష్టం చేసింది. దీంతో ధరణిలో పొరపాటున తప్పు పడినా అవి ఇప్పట్లో సరిచేయరు. 

ధరణిలో వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా రిజెక్ట్ అయిన దాంట్లో గ్రీవియెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్ ఉండగా ఆ తరువాతి స్థానాల్లో పెండింగ్ మ్యుటేషన్, పాస్ బుక్ డేటా కరెక్షన్ కింద వచ్చినవే ఉండటం గమనార్హం. ధరణి తప్పులతో తమ పాసుపుస్తకాల్లో అసైన్డ్ అని వస్తే.. జీవితాంతం పట్టా ల్యాండ్స్ అట్లనే ఉండిపోవాలా అని రైతులు వాపోతున్నారు. కనీసం అప్లికేషన్​ వివరాలు, సమర్పించిన పత్రాలు, ఎమ్మార్వో రిపోర్ట్​కూడా పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

గ్రీవియెన్స్​ ల్యాండ్​ మ్యాటర్స్​లోనే ఎక్కువ 

ధరణి పోర్టల్​లో ఎక్కువ అప్లికేషన్లు వస్తున్న మాడ్యుల్స్​లోనే ఎక్కువ దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు తిరస్కరిస్తున్నారు. జులై  నెలాఖరు వరకు 6 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. గ్రీవియెన్స్ ల్యాండ్ మ్యాటర్స్​లోనే ఎక్కువ రిజెక్ట్ అయ్యాయి. ఇందులో 4.02 లక్షల దరఖాస్తులు వస్తే.. 1.47 లక్షలు రిజెక్ట్ చేశారు. ఇంకో 26 వేలు పెండింగ్​లో ఉన్నాయి. పెండింగ్ మ్యుటేషన్ కింద వస్తున్న ఆప్లికేషన్లను కలెక్టర్లు, సీసీఎల్ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. 

ఇప్పటి వరకు పెండింగ్ మ్యుటేషన్ల కింద 3.36 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 73 వేలు తిరస్కరించారు. ఇంకో 12 వేలు పెండింగ్ లో ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకం డేటా కరెక్షన్ కింద వచ్చిన అప్లికేషన్లు 2.04 లక్షలు ఉన్నాయి. ఇందులోనూ 67 వేల అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. ఇంకో 80 వేల అప్లికేషన్లు ప్రాసెస్ ఉన్నాయి. లక్షల సంఖ్యలో వస్తున్న అప్లికేషన్లను పరిష్కరించకుండానే రిజెక్ట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

సీసీఎల్ఏ ఆఫీస్​కు క్యూ కడుతున్న రైతులు

ధరణిలో అప్లై చేసుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ రోజూ వంద మందికి పైగా రైతులు హైదరాబాద్​లోని సీసీఎల్​ఏ ఆఫీసుకు వస్తున్నారు. తమ గోడును పట్టించుకోవాలని.. ధరణి సమస్య తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. మూడు నెలల కిందట వరకు అసలు ఉన్నతాధికారులు రైతులను కలవలేదు. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో.. సీసీఎల్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్​ రైతులు తీసుకొస్తున్న వినతులను విని పరిష్కారానికి ఆఫీసర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారంలో 4 రోజులు నవీన్ మిట్టల్ ​రైతులను కలుస్తున్నారు. ఒక్కో రోజు వందకు పైగా పట్టాదారులు సీసీఎల్​కు వచ్చి అధికారులను కలుస్తున్నారు.