నోట్ల రద్దుకు ఆరేళ్లు..

నోట్ల రద్దుకు ఆరేళ్లు..
  • చలామణీలో నగదు పెరిగింది
  • డిజిటల్​ జోరందుకుంది
  • రియల్​ ట్రాన్సాక్షన్లు ఇంకా బ్లాక్​లోనే

న్యూఢిల్లీ: ఆరేళ్ల కిందట అంటే నవంబర్ ​8, 2016 నాడు ప్రభుత్వం అమలు చేసిన డీమానిటైజేషన్​ (పెద్ద నోట్ల రద్దు) ఫలితాలపై నేటికీ చర్చ జరుగుతూనే ఉంది. బ్లాక్​మనీ, టెర్రర్​ ఫండింగ్ అరికట్టడంలో డీమానిటైజేషన్​ సఫలమైందని ప్రభుత్వం చెబుతుంటే, రియల్​ ఎస్టేట్ వంటి రంగాలలో నేటికీ క్యాష్​ లావాదేవీలు తగ్గనే లేదని విమర్శకులు చెబుతున్నారు. దేశంలో బ్లాక్​మనీని కట్టడి చేయడంతో పాటు, డిజిటల్​ పేమెంట్స్​ జోరు పెంచాలనే టార్గెట్​తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అప్పట్లో రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తాజా రిపోర్టు ప్రకారం దేశంలో కరెన్సీ చలామణీ అక్టోబర్​ 21 నాటికి రూ. 30.88 లక్షల కోట్లకు పెరిగింది. ఇంకోలా చెప్పాలంటే, డీమానిటైజేషన్​ పూర్తయి ఆరేళ్లవుతున్నా ఇంకా నగదు వినియోగం దేశంలో తగ్గలేదన్న మాట. నవంబర్​ 4, 2016 నాటికి చలామణీలో ఉన్న కరెన్సీతో పోలిస్తే ఇప్పుడు చలామణీలో ఉన్న కరెన్సీ దాదాపు 72 శాతం ఎక్కువ. అయితే 2015–16 నుంచీ క్రమంగా పేమెంట్​ సిస్టమ్స్​లో నగదు తగ్గుతోందని ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్టు ఒకటి వెల్లడించింది. 2015–16లో 88 శాతంగా ఉన్న క్యాష్​ పేమెంట్లు 2021–22 నాటికి 20 శాతానికి తగ్గిపోయినట్లు ఆ రిపోర్టు పేర్కొంది. 2026–27 నాటికి పేమెంట్​ సిస్టమ్స్​లో నగదు చెల్లింపులు మరింత తగ్గి 11.15 శాతానికే పరిమితమవుతాయని ఈ రిపోర్టు అంచనా వేస్తోంది.
డిజిటల్​ జోరు...
ఇదే టైములో డిజిటల్​ ట్రాన్సాక్షన్లు జోరందుకున్నాయి.  2015–16 నాటికి 11.26 శాతంగా ఉన్న డిజిటల్​ ట్రాన్సాక్షన్లు 2021–22 నాటికి ఏకంగా 80.40 శాతానికి పెరిగాయి. ఇవి మరింత పెరిగి 2026–27 నాటికి 88 శాతమవుతాయని ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్టు చెబుతోంది. డీమానిటైజేషన్​తో దేశం బ్లాక్​మనీ నుంచి విముక్తి సాధిస్తుందని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఆ విధంగా జరగలేదని కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​ మల్లికార్జున్​ ఖర్గే ఒక ట్వీట్​లో విమర్శించారు. దేశంలోని వ్యాపారాలను డీమానిటైజేషన్​ నాశనం చేసిందని, కొత్త ఉద్యోగాలు రాకుండా చేసిందనీ పేర్కొన్నారు. ఎకానమీ పడిపోవడానికి కారణమైన డీమానిటైజేషన్​ తప్పేనని ఇప్పటికీ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదని ఖర్గే వ్యాఖ్యానించారు. డీమానిటైజేషన్​ లక్ష్యాలేవీ నెరవేరలేదని మసాచుసెట్స్​ యూనివర్శిటీ ప్రొఫెసర్​ జయతి ఘోష్​  చెప్పారు. దేశపు ఎకానమీలో 85 శాతానికి కారణమైన ఇన్​ఫార్మల్​ సెక్టార్ ​వెన్నును డీమానిటైజేషన్​ విరిచేసిందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్​ దేశంలో గందరగోళానికి కారణమైందని సీపీఎం జనరల్​ సెక్రటరీ సీతారాం ఏచూరి ట్వీట్​ చేశారు. దేశపు ఎకానమీని ఈ డీమానిటైజేషన్ దెబ్బ కొట్టిందని అన్నారు. ఆరేళ్ల తర్వాత కూడా డీమానిటైజేషన్​ సక్సెసయిందా, లేదా అనేది తేలలేదని లోకల్​ సర్కిల్స్​ ఒక రిపోర్టులో తెలిపింది. రియల్​ ఎస్టేట్​ ట్రాన్సాక్షన్లలో ఇప్పటికీ నగదు (బ్లాక్​మనీ) చెల్లిస్తున్నారని పేర్కొంది.  చాలా వస్తువులతోపాటు  సర్వీసులకూ ఇప్పటికీ సరయిన రిసీట్స్​ ఉండటం లేదని తెలిపింది.