ODI World Cup 2023: లంకేయుల పేలవ ప్రదర్శన.. శ్రీలంక క్రికెట్ బోర్డు సెక్రటరీ రాజీనామా

ODI World Cup 2023: లంకేయుల పేలవ ప్రదర్శన.. శ్రీలంక క్రికెట్ బోర్డు సెక్రటరీ రాజీనామా

భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ మహా సంగ్రామం కొందరికి వినోదాన్ని పంచుతుంటే, మరికొందరికి తీవ్ర శోకాన్ని మిగిల్చుతోంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. ఓడిన జట్లపై ఆయా దేశాల క్రికెట్ అభిమానులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. క్రికెట్ బోర్డుల్లో అవినీతి, అవకతవకలు, రాజకీయ నాయకుల జోక్యం పెరగడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని దుయ్యబడుతున్నారు. దీంతో ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయా జట్ల క్రికెట్ బోర్డు పెద్దలు ఒక్కొక్కరిగా వైదొలుగుతున్నారు. 

కొన్నిరోజుల క్రితం దాయాది పాకిస్తాన్ జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే శ్రీలంక క్రికెట్ బోర్డు సెక్రటరీ రాజీనామా మోహన్ డిసిల్వా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ కప్‌లో లంకేయుల పేలవ ప్రదర్శన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీని రాజీనామా చేయవలసిందిగా ఆ దేశ క్రీడా మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలోనే మోహన్ డిసిల్వా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, భారత్‌తో జరిగిన లంక ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. 358 పరుగుల లక్ష్య ఛేదనలో 55 పరుగులకే కుప్పకూలి.. వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. వన్డే ప్రపంచ కప్‪లలో అత్యల్ప స్కోర్ చేసిన ఐసీసీ టెస్ట్‌ హోదా కలిగిన ఒక జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. 

రెండే విజయాలు

ఈ టోర్నీలో ఇప్పటివరకూ శ్రీలంక ఏడు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవడం తప్ప లంకేయులకు సెమీస్ చేరే అవకాశాలు లేవు.

ALSO READ :- ODI World Cup 2023: కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. వరల్డ్ కప్ మ్యాచ్ రద్దు!