
జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ లాంటి చిత్రాలతో నిర్మాతలుగా మెప్పించిన అప్పిరెడ్డి, వెంకట్ రెడ్డి.. తాజాగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే సినిమా తీశారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జులై 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘మాది సూర్యాపేట జిల్లాలోని దొండపాడు అనే గ్రామం. ఊర్లో మాకు థియేటర్ ఉండడంతో సినిమాలపై ఆసక్తి పెరిగింది.
బిజినెస్ కోసం అమెరికా వెళ్లినప్పటికీ అక్కడ ఓ ఇంగ్లీష్ మూవీ తీశాం. 2017కి ఇండియా షిప్ట్ అయ్యాం. ఓవైపు వ్యాపారాలు చూసుకుంటూనే ఇక్కడా సినిమాలు చేస్తున్నాం. ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనేది ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్. కథ చాలా కొత్తగా, అందరూ నవ్వుకునేలా ఉంటుంది. స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఓ కుక్కను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. మూఢనమ్మకాలపై సెటైర్‌లా ఉంటూనే ఓ మెసేజ్ కూడా ఇచ్చాం. సంజయ్, ప్రణవి అద్బుతంగా నటించారు.
బ్రహ్మాజీ గారు ఈ కథను ఎంతో నమ్మి, ఆయనే ముందుండి ప్రమోట్ చేస్తుండడం హ్యాపీ. ఇక మా సంస్థలో మరో ఆరు ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఒకటి, రెండు సినిమాలు చేసి వెళ్లిపోవడం కాకుండా, లాంగ్ టర్మ్ ఇండస్ట్రీలో కొనసాగాలనే ప్లాన్‌తోనే వచ్చాం. ఈ ఏడాదిలోనే ఇంకో రెండు చిత్రాలు విడుదల చేయబోతున్నాం’ అన్నారు.