స్లమ్ ప్రిన్సెస్.. ల‌గ్జ‌రీ బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా 14 ఏళ్ల బాలిక

స్లమ్ ప్రిన్సెస్.. ల‌గ్జ‌రీ బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా 14 ఏళ్ల బాలిక

ముంబైలోని ధారవి మురకివాడల్లో నివసించే 14ఏళ్ల మలీషా ఖర్వా.. తన టాలెంట్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు కలలు గన్న జీవితాన్ని పొందేందుకు ఎదురుచూస్తోన్న పలువురు అమ్మాయిలకు కూడా ఆమె స్ఫూర్తిగా నిలుస్తోంది. మూడేళ్ల క్రితం ఆమె ప్రతిభను గమనించిన ఓ హాలీవుడ్ డైరెక్టర్.. ఆ తర్వాత ఆమె తన జీవితంలో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటీవలే ఓ ప్ర‌ఖ్యాత ల‌గ్జ‌రీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియ‌ల్స్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ మొద‌లు పెట్టిన ద యువ‌తి క‌లెక్ష‌న్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానూ నియ‌మించింది.

ఓ ఫ్యాషన్ షోలో నటి ప్రియాంక చోప్రా ర్యాంప్ వాక్ ను చూసినపుడే మలీషా.. తన కెరీర్ పై కలలు కనడం ప్రారంభించింది. 2020లో హాలీవుడ్ న‌టుడు రాబ‌ర్ట్ హోఫ్‌మ‌న్ మలీషాను బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆమె కోస‌మే గో ఫండ్ మి పేజ్‌నూ మొద‌లు పెట్టాడు. ఇన్‌స్టాలో 2లక్షల 25వేల ఫాలోయ‌ర్లు ఉన్న అమీషా.. కొన్ని కొన్ని పోస్టుల్లో ప్రిన్సెస్ ఫ్రం ద స్ల‌మ్ అనే హ్యాష్‌ట్యాగ్‌నూ పెడుతుంది.

తాజాగా ద యువ‌తి క‌లెక్ష‌న్ అనే సోషల్ సర్వీస్ ను ముందుండి న‌డిపించనుంది. గ‌త నెల‌ ఫారెస్ట్ ఎసెన్షియ‌ల్స్ విడుద‌ల చేసిన ఓ వీడియో తాజాగా వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె ఆ సంస్థ స్టోర్‌లోకి వెళ్లి అక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన త‌న ప్ర‌చార చిత్రాల‌ను చూస్తుంది. అది చూసి అంతులేని ఆనందంతో త‌న మొహం వెలిగిపోతుంది. ఎందుకంటే మీ క‌ల‌లే ముఖ్యం (BecauseYourDreamsMatter) అనే హ్యాష్‌టాగ్‌ తో షేర్ చేసిన ఈ వీడియో.. ఇప్పుడు నెటిజ‌న్ల మ‌న‌సు దోచుకుంటోంది.

ఈ వీడియోకు ఇప్ప‌టి వ‌ర‌కు 50 ల‌క్ష‌ల పైగా వ్యూస్ రాగా, 4 లక్ష‌ల‌కు పైగా కామెంట్లు వ‌చ్చాయి. ఈ క్యాంపెయిన్‌పై స్పందించిన మ‌లీషా.. ఫారెస్ట్ ఎసెన్షియ‌ల్‌తో ఒప్పందం ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మాలు అన్నింటి కంటే పెద్ద‌ద‌ని తెలిపింది. మోడ‌ల్ కావాలనేది త‌న ఆశ‌య‌మే అయిన‌ప్ప‌టికీ చ‌దువే త‌న‌కు మొద‌టి ప్ర‌ధాన్య‌మ‌ని చెప్పుకొచ్చింది.

రెండు హాలీవుడ్ సినిమాల్లో అవకాశం..

ఇప్పటికే రెండు హాలివుడ్ సినిమా అవకాశాలను సొంతం చేసుకున్న మోడల్ మలీషా.. అర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన లివ్ యువర్ ఫెయిరీ టేల్ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా కనిపించింది.

 

https://www.instagram.com/reel/CqnTztIAiIb/?utm_source=ig_embed&ig_rid=9cc3b146-bcbb-4e5d-870c-f54d69b2a1a1