స్మాల్​ శాటిలైట్​ లాంచింగ్​ వెహికల్

స్మాల్​ శాటిలైట్​ లాంచింగ్​ వెహికల్

స్మాల్​ శాటిలైట్​ లాంచింగ్​ వెహికల్​ – డీ2 (ఎస్​ ఎస్​ఎల్‌‌‌‌వీ–డి2) ప్రయోగాన్ని ఇస్రో షార్​లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇండియా  విజయవంతంగా పరీక్షించింది.  ఎస్​ఎస్​ఎల్​వీ–డి2 రాకెట్​ ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు గల ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​–07, అమెరికా అంటారిస్​ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్​–1, చెన్నై స్పేస్​కిడ్జ్​ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్​–2లను భూమికి 450 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో ప్రవేశ పెట్టారు. అతి తక్కువ ఖర్చు, ఐదు రోజుల వ్యవధిలో రాకెట్​ను రూపొందించి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపిన దేశంగా భారత్​ తన పేరును నమోదు చేసుకుంది. 

ఉపగ్రహాల వివరాలు 

ఈఓఎస్-07: ఇది 156.3 కిలోల బరువున్న ఉపగ్రహం. ఇస్రో ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ మిషన్​ లక్ష్యం మైక్రోశాటిలైట్​ బస్​, కొత్త సాంకేతికతలకు అనుకూలమైన పేలోడ్​ సాధనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం. ఈ ఉపగ్రహం ద్వారా భూమిపైన, సముద్రాల్లోని వాతావరణ మార్పులను గుర్తించవచ్చు. 

జానుస్-1: బరువు 10.2కిలోలు. అంటారిస్​ సాఫ్ట్​వేర్​ ప్లాట్​ఫారం ఆధారంగా స్మార్ట్​ శాటిలైట్​ మిషన్​. జానుస్​–1 ఉపగ్రహం ఐఓటీ, కమ్యూనికేషన్​ సిస్టమ్స్​తో సహా ఐదు పేలోడ్​లను తీసుకెళ్లింది. 

ఆజాదీశాట్​-2: బరువు 8.7 కిలోలు. ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 75‌‌‌‌‌‌‌‌0 మంది బాలికల సంయుక్త ప్రయత్నం. దీనిని చెన్నైలోని స్పేస్​ కిడ్జ్​ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేశారు.

ఎస్​ఎస్​ఎల్​వీ-డి2 రాకెట్​

ఈ రాకెట్​ బరువు 12‌‌‌‌‌‌‌‌0 టన్నులు. దీని వ్యాసం 2 మీటర్లు కాగా, పొడవు 34 మీటర్లు. దాదాపు 500 కిలోల బరువు గల ఉపగ్రహాలను ఈ వాహకనౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించారు.