చిన్న పరిశ్రమల రంగం

చిన్న పరిశ్రమల రంగం

భా  రత పారిశ్రామిక రంగంలో చిన్నతరహా పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పన, దేశ జీడీపీ, ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ వాటాలను అందిస్తున్నది. చిన్నతరహా పరిశ్రమల రంగంలో చిన్నతరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, ఎగుమతి యూనిట్లు, అతి చిన్న పరిశ్రమలు, చిన్న తరహా సేవా ఎంటర్​ ప్రైజెస్​లు, చేతివృత్తులవారు, గ్రామీణ కుటీర పరిశ్రమలు, మహిళా వ్యవస్థాపకులు నిర్వహించే చిన్న యూనిట్లు భాగాలుగా ఉంటాయి.

1950 దశాబ్దంలో రూ. 5లక్షల పెట్టుబడి పరిమితి గల పరిశ్రమలను చిన్నతరహా పరిశ్రమలుగా నిర్వచించారు. 1977 నాటికి రూ.10 లక్షల లోపు పెట్టుబడి పరిమితి గల వాటిని చిన్నతరహా పరిశ్రమలని, రూ.15 లక్షల లోపు ఉన్నవాటిని అనుబంధ పరిశ్రమలనుపేర్కొన్నారు. లక్ష లోపు పెట్టుబడి ఉన్నవాటిని టైనీ పరిశ్రమలని పిలిచారు. 1991 నూతన పారిశ్రామిక తీర్మానంలో వీటి పరిమితిని అతి చిన్న పరిశ్రమలకు రూ.5 లక్షలకు, చిన్న పరిశ్రమలకు రూ.60 లక్షలకు, అనుబంధ పరిశ్రమలకు రూ.75 లక్షలకు పెంచారు. 1997లో అబిద్​ హుస్సేన్​ కమిటీ చిన్నతరహా పరిశ్రమలకు, అనుబంధ పరిశ్రమలకు తేడా చూపించొద్దని, పెట్టుబడి పరిమితిని రూ.3 కోట్లకు పెంచాలని సూచించారు.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2000లో దీన్ని రూ.కోటిగా, టైనీ పరిశ్రమలకు రూ. 25 లక్షలుగా నిర్ణయించారు. మైక్రో, స్మాల్​ అండ్​ మీడియం ఎంటర్​ప్రైజెస్​ డెవలప్​మెంట్​ యాక్ట్​ – 2006ను తీసుకువచ్చి చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితిని రూ. 5 కోట్లకు పెంచారు. తొలిసారిగా మధ్యతరహా పరిశ్రమలను ఈ వర్గీకరణలో చేర్చారు. పరిశ్రమలను మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్, సర్వీస్ సెక్టార్​ అని2 రకాలుగా వర్గీకరించారు. ప్లాంట్​ యంత్రాలపై చేసే స్థిర పెట్టుబడి ఆధారంగా మాన్యుఫాక్చరింగ్​ రంగంలోను, ఎక్విప్​మెంట్​పై చేసే పెట్టుబడి ఆధారంగా సేవారంగంలోనూ పరిశ్రమలను విభజించారు. 

రిజిస్టర్డ్, అన్​ రిజిస్టర్డ్​ చిన్న పరిశ్రమల యూనిట్లు: చిన్న పరిశ్రమల రంగం రిజిస్ట్రేషన్ అనేది స్వచ్ఛందం. జిల్లా పారిశ్రామిక కేంద్రాల వద్ద మొదట తాత్కాలిక ప్రాతిపదికన తర్వాత శాశ్వతంగానూ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. మాన్యుఫాక్చరింగ్​ యూనిట్లయితే 1948 ఫ్యాక్టరీ చట్టం ప్రకారం విద్యుత్​ను ఉపయోగించి 10 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధిని అందించే యూనిట్లు 2ఎం(i) కింద, విద్యుత్​ను వినియోగించకుండా 20 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధినందించే యూనిట్లు 2ఎం(ii) కింది రిజిస్టర్​ అవ్వాలి. సెక్షన్​ 2ఎం(i), 2ఎం(ii) కిందకు రాని కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సెక్షన్​ 85(i) లేదా 85 (ii) కింద నమోదవ్వాలి.

విద్యుత్​ను వినియోగించి 10 కంటే తక్కువ పనివారు ఉన్న వాటిని సెక్షన్​ 85 (i) కింద, విద్యుత్​ను ఉపయోగించకుండా 20 కంటే తక్కువ పనివారు ఉన్న వాటిని సెక్షన్​ 85(ii) కింద నమోదు చేయాలి. చిన్న పరిశ్రమల అభివృద్ధి కమిషనర్ ఆఫీస్​ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి మొదటి సెన్సస్​ను 1973–74లో నిర్వహించారు. రెండో 1990–91, మూడో 2002–03లో నిర్వహించారు. ఎంఎస్​ఎంఈ మంత్రిత్వశాఖ 2006–07లో నాలుగో అఖిలభారత స్థాయి సెన్సస్​ను నిర్వహించారు. ఇది 2011–12లో పూర్తయింది. నాలుగో సెన్సస్​లో మధ్యతరహా పరిశ్రమలను కూడా చేర్చారు. 

ఎన్​ఎస్​ఎస్​ 73వ రౌండ్​ (2015‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌16): ఎన్​ఎస్​ఎస్​ఓ, మినిస్ట్రీ ఆఫ్​ స్టాటిస్టిక్స్​ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్​ వారు 2015–16 సంవత్సరానికి 73వ రౌండ్​ను ఎంఎస్​ఎంఈలపై నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం 633.88 లక్షల వ్యవసాయేతర ఎంఎస్​ఎంఈలు ఉన్నాయి. అవి అందించే ఉపాధి 11.10కోట్లు. 1948 ఫ్యాక్టరీ చట్టం, 1956 కంపెనీ చట్టం, ఎన్​ఐసీల కిందకు వచ్చే నిర్మాణ కార్యకలాపాలు దీని నుంచి మినహాయించారు. 

    కార్యకలాపాలు వారీగా విడదీస్తే వ్యాపార రంగంలో 36శాతం, ఇతర సేవల్లో 33శాతం మాన్యుఫాక్చరింగ్​ రంగంలో 31శాతం ఉన్నాయి.
    ప్రాంతాలవారీగా విడదీస్తే గ్రామాల్లో 51శాతం, పట్టణాల్లో 91శాతం ఉన్నాయి.
    కేటగిరి వారీగా విడదీస్తే సూక్ష్మ పరిశ్రమలు 99.47శాతం, చిన్న పరిశ్రమలు 0.52శాతం, మధ్యతరహా పరిశ్రమలు 0.008శాతం ఉన్నాయి. 
    ఈ ఎంఎస్​ఎంల్లో 79.63శాతం పురుషుల యాజమాన్యంలో మిగిలిన 20.37శాతం స్త్రీల యాజమాన్యంలో ఉన్నాయి. 
    సాంఘిక వర్గాల వారీగా పరిశీలిస్తే 
ఇతర యాజమాన్యంలో 32.95శాతం, ఇతర వెనుకబడిన వారి యాజమాన్యంలో 49.72శాతం ఉన్నాయి. ఎస్సీల ఆధ్వర్యంలో 12.45శాతం, ఎస్టీల ఆధ్వర్యంలో 4.10శాతం ఉన్నాయి.

ఉపాధి: ఎన్​ఎస్​ఎస్​ఓ వారి 73వ రౌండ్​ (2015-16) ప్రకారం ఎంఎస్ఎంఈలు 11.10కోట్ల మందికి ఉపాధిని అందిస్తున్నాయి. కార్యకలాపాల వారీగా పరిశీలిస్తే వ్యాపార రంగం 35శాతం మందికి ఉపాధిని అందిస్తుంది. గ్రామాల కంటే పట్టణాల్లోనే (55శాతం) ఎక్కువ ఉపాధి లభిస్తుంది. సూక్ష్మ పరిశ్రమలు (97శాతం) ఎక్కువ ఉపాధిని అందిస్తున్నాయి. పురుషులకు (76శాతం) ఎక్కువ ఉపాధి లభిస్తున్నది. 

రాష్ట్రాలవారీ పంపిణీ: రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్​ (14.2శాతం), పశ్చిమబెంగాల్​ (14శాతం), తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ (4.1శాతం) 11వ స్థానంలో ఉంది. ఉపాధి ఎక్కువగా అందించేది ఉత్తరప్రదేశ్​. తెలంగాణ 40 లక్షలకు ఉపాధి అందిస్తోంది.

ఆత్మనిర్భర్​ భారత్​ అభియాన్​లో చిన్న పరిశ్రమల నిర్వచనాన్ని సవరించారు. మాన్యుఫాక్చరింగ్​ రంగం, సేవా రంగాల మధ్య తేడా తొలగించారు. ప్లాంట్​, యంత్రాలు లేదా ఎక్విప్​మెంట్​పై పెట్టుబడి పరిమితి పెంచి, టర్నోవర్​ ప్రాతిపదికను ప్రతిపాదించారు. ఈ నిర్వచనం 2020, జులై 1 నుంచి వర్తిస్తుంది. 

సూక్ష్మ పరిశ్రమ: పెట్టుబడి రూ.కోటి లోపు, టర్నోవర్​ రూ.5కోట్ల లోపు ఉండాలి. 

చిన్న పరిశ్రమ: పెట్టుబడి రూ.10కోట్లు లోపు, టర్నోవర్ రూ.50కోట్ల లోపు ఉండాలి.

మధ్యతరహా పరిశ్రమ: పెట్టుబడి 50కోట్ల లోపు, టర్నోవర్​ 250 కోట్ల లోపు ఉంటే అది మధ్యతరహా పరిశ్రమ అవుతుంది.