స్మార్ట్‌‌‌‌ సిటీ గడువు ముగిసే.. పనులు మిగిలే !

స్మార్ట్‌‌‌‌ సిటీ గడువు ముగిసే.. పనులు మిగిలే !
  • మార్చి 31తోనే స్కీమ్‌‌‌‌ గడువు ముగిసిందన్న కేంద్రం
  • మరోసారి పొడిగించేందుకు నో చెప్పిన కేంద్రమంత్రి టోకెన్‌‌‌‌ సాహు
  • వరంగల్‌‌‌‌ టెండర్లు పూర్తి కాకుండానే ఆగనున్న రూ. 73.43 కోట్ల పనులు
  • మధ్యలో ఆగిన పనులకు సంబంధించిన రూ. 219 కోట్లు వచ్చుడూ కష్టమే..
  • కరీంనగర్‌‌‌‌లో రూ. 100 కోట్ల పనులపై ప్రభావం

వరంగల్/కరీంనగర్, వెలుగు : స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌లో భాగంగా గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌ గడువు మార్చి 31తోనే ముగియడం.. కొన్ని పనులు పెండింగ్‌‌‌‌లో ఉండడంతో గడువు పెంచాలని తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని కోరినా వారు ఒప్పుకోలేదు. దీంతో రెండు నగరాల్లో టెండర్లు పూర్తి కాకుండానే కొన్ని పనులు ఆగిపోగా.. మరికొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 40 నుంచి 50 శాతం మేర పూర్తి అయిన పనులకు రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. 

నిధులివ్వని గత సర్కార్‌‌‌‌

గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ను 2017లో స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌కు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 500 కోట్లు కలిపి మొత్తం రూ. 1000 కోట్లతో ఐదేండ్లలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలో ఉన్న టైంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోగా.. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి పనుల వివరాలు, బిల్లులు సైతం పంపకపోవడంతో పనులు పెండింగ్‌‌‌‌లో పడ్డాయి. ఐదేండ్ల గడువు 2022లోనే ముగియాల్సి ఉండగా... కేంద్రం గడువును 2024 వరకు పెంచింది. అప్పటికి కూడా పనులు పూర్తి కాకపోవడంతో గడువును పెంచాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, రాష్ట్ర ఎంపీలు కేంద్రాన్ని రిక్వెస్ట్‌‌‌‌ చేయడంతో గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. 

తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా టైం లేకపోవడంతో పనులు పూర్తి కాలేదు. దీంతో గడువును మరోసారి పొడిగించాలని వరంగల్‌‌‌‌ ఎంపీ కడియం కావ్య ఇటీవల పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో కేంద్రాన్ని కోరారు. అయితే స్మార్ట్‌‌‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌‌‌ గడువును మరోసారి పొడిగించే అవకాశమే లేదని కేంద్రమంత్రి టోకెన్‌‌‌‌ సాహు స్పష్టం చేశారు. పైగా టెండర్ల దశలో ఉన్న పనులతో పాటు, అసంపూర్తిగా ఉన్న పనులకు కూడా నిధుల విడుదల ఉండబోదని, వాటిని ప్రత్యేక సంస్థల ద్వారానే పూర్తి చేయాలని తేల్చి చెప్పారు.

వరంగల్‌‌‌‌కు ఆగిన రూ.219.46 కోట్లు

స్మార్ట్‌‌‌‌ సిటీ గడువు ముగియడంతో గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌కు రావాల్సిన  రూ.219.46 కోట్లు ఆగిపోయాయి. నగరంలో మొత్తం రూ.944.67 కోట్లతో 108 ప్రాజెక్ట్‌‌‌‌లు చేపట్టారు. ఇందులో రూ.542.29 కోట్ల విలువైన 70 పనులు పూర్తయ్యాయి. మరో రూ.328.96 కోట్లతో చేపట్టిన 34 పనులు మధ్యలో ఉండగా.. రూ.73.43 కోట్ల విలువైన నాలుగు పనులు టెండర్‌‌‌‌ దశలో ఉన్నాయి. ఆయా పనులకు సంబంధించి కేంద్రం నుంచి రూ.123.13 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.96.33 కోట్లు కలిపి మొత్తం రూ.219.46 కోట్లు రావాల్సి ఉంది. 

స్మార్ట్‌‌‌‌ సిటీ గడువు ముగిసిన నేపథ్యంలో డబ్బులు ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో పనులు పూర్తి చేయడం కష్టంగా మారనుంది. గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లో టెండర్లు పూర్తి కాని రోడ్ల అభివృద్ధి, భద్రకాళి చెరువులో మ్యూజికల్‌‌‌‌ లైటింగ్‌‌‌‌, ప్లానెటోరియం పునఃప్రారభం పనులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇవే కాకుండా భద్రకాళి బండ్, వడ్డేపల్లి బండ్‌‌‌‌, ఉర్సుగుట్ట చెరువు సుందరీకరణ, స్ట్రోమ్‌‌‌‌ వాటర్‌‌‌‌ డ్రైనేజీ వంటి పనులపై ఎఫెక్ట్‌‌‌‌ పడనుంది.