
ముంబై: వ్యక్తుల ఐడింటిటీ నిర్ధారణకు స్మార్ట్ఫోన్లనే యూనివర్శల్ ఆథంటికేటర్గా వాడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, ఓటీపీలను ఆథెంటికేషన్ కోసం వాడుతున్నారు. ఈ స్కోప్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సీఈఓ సౌరభ్ గర్గ్ చెప్పారు. స్మార్ట్ఫోన్లను ఆథంటికేటర్గా వాడే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని, దీంతో ఎక్కడ నివశించే ప్రజలైనా ఆథంటికేషన్ సులభంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మొబైల్ కనెక్షన్లుండగా, 80 కోట్ల స్మార్ట్ఫోన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీలు రెండూ చాలా ముఖ్యమైనవిగా గర్గ్ పేర్కొన్నారు. సింగిల్ ఐడెంటిటీగా మారే దిశలో ఆధార్ ప్రయాణిస్తోందని అన్నారు. ఆధార్ ఆధారంగా చేపట్టిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ (డీబీటీ) వల్ల ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్లు ఆదా అయిందని, లీకేజ్‌లు, డూప్లికేషన్ అరికట్టడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకింగ్, టెలికం రంగాలు రెండూ ఆధార్ నెంబర్‌ను బాగా అందిపుచ్చుకున్నాయని, 70 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఆధార్‌తో సీడ్ అయ్యాయయని చెప్పారు. ఫుల్ కేవైసీకి రూ. 3 , ఆథంటికేషన్కు 50 పైసలు మాత్రమే ఇప్పుడు యూఐడీఏఐ ఛార్జ్ చేస్తున్నట్లు గర్గ్ వెల్లడించారు. ఇప్పటిదాకా దేశంలో 130 కోట్ల ఆధార్ కార్డులున్నాయని, 99.5 శాతం జనాభా కవర్ అయ్యారని, మిగిలిన వారికీ ఆధార్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గర్గ్ వివరించారు.