
న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు ఉన్న ఆన్లైన్ షాపింగ్ కంపెనీ స్నాప్‌డీల్ తన రూ. 1,250 కోట్ల ఐపీఓని వాయిదా వేసింది. ఈ సంవత్సరం తమ ఇనీషియల్పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్లాన్‌లను నిలిపివేయాలని నిర్ణయించుకున్న స్టార్టప్‌ల జాబితాలో ఇది కూడా చేరింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పోటీ పడుతున్న స్నాప్‌డీల్, ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టాక్‌లలో అమ్మకాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వెనకడుగు వేసింది. తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి)ని ఉపసంహరించుకోనివ్వాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)ని కోరింది. "ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, కంపెనీ డీఆర్‌హెచ్‌పీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.
గ్రోత్ క్యాపిటల్, మార్కెట్ పరిస్థితులను బట్టి కంపెనీ భవిష్యత్తులో ఐపిఓ గురించి ఆలోచిస్తాం" అని స్నాప్‌డీల్ ప్రతినిధి తెలిపారు. బోట్, ఫార్మ్ ఈజీ, డ్రూమ్ కూడా స్నాప్‌డీల్ మాదిరే ఐపీఓలను వాయిదా వేసుకున్నాయి. జొమాటో, పేటీఎం, నైకా, నజారా టెక్నాలజీస్ వంటి అనేక టెక్ కంపెనీల పబ్లిక్ లిస్టింగ్ తర్వాత స్నాప్‌డీల్ గత డిసెంబర్‌లో ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. స్నాప్‌డీల్ ప్రతిపాదిత ఐపీఓను సెబీ ఇంకా ఆమోదించలేదు. 2010లో కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ స్థాపించిన స్నాప్‌డీల్ ఐపీఓ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆర్గానిక్ గ్రోత్‌కు ఉపయోగించాలని ప్లాన్ చేసింది. స్నాప్‌డీల్ ఐపీఓ విలువ రూ. 1,250 కోట్లు కాగా, కంపెనీ ప్రస్తుత పెట్టుబడిదారుల నుండి 3.07 కోట్ల షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఉంటుందని గతంలో ప్రకటించింది. అయితే స్నాప్‌డీల్ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో నష్టాలను చవిచూసింది. 2020-‑–21లో దీని ఆదాయాలు 44 శాతం తగ్గి రూ. 471.8 కోట్లకు పడిపోయాయి. నష్టాలు సగానికి పైగా తగ్గి రూ. 125.4 కోట్లకు చేరుకున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వివరాలను ఇంకా ప్రచురించలేదు. ఓఎఫ్ఎస్ కింద, స్టార్ ఫిష్ , వండర్‌ఫుల్ స్టార్స్, సికోవియా క్యాపిటల్, కెన్నెత్ స్టువర్ట్ గ్లాస్, మిరియడ్ ఆపర్చునిటీస్ మాస్టర్ ఫండ్, అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డ్, లారెంట్ అమౌయల్, మైల్‌స్టోన్ ట్రస్టీషిప్ సర్వీసెస్ తమ షేర్లను అమ్మాలని భావించాయి.