క‌రోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ నేత‌: గుంపుగా చేరి.. ప‌టాకులు పేలుస్తూ స్వాగ‌తం

క‌రోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ నేత‌: గుంపుగా చేరి.. ప‌టాకులు పేలుస్తూ స్వాగ‌తం

రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ కేసులు భారీగా పెరుగుతున్న ముంబైలో మ‌హారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత చంద్ర‌కాంత్ హందోర్ (57) సోష‌ల్ డిస్టెన్స్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించారు. క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న కోలుకుని ఆస్పత్రి నుంచి నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళ్తున్న ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీ సంఖ్య‌లో గుమ్మిగూడి స్వాగతం చెప్పారు. చంద్ర‌కాంత్ క‌రోనా నుంచి కోలుకోవ‌డాన్ని ఉత్స‌వంలా జ‌రుపుతూ డ్ర‌మ్స్ తో ధూమ్ ధామ్ చేశారు. ప‌టాకులు పేల్చి నానా హంగామా చేశారు. బాధ్య‌త క‌లిగిన నాయ‌కుడిగా ఇలాంటివి వ‌ద్ద‌ని, క‌రోనా వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పి వాళ్ల‌ను ఇళ్ల‌కు వెళ్లాల్సిందిగా చెప్పాల్సిందిపోయి.. చంద్ర‌కాత్ కారులో నుంచి దిగి.. చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ మొత్తాన్ని కొంత మంది వీడియో తీసి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. దీనిపై ప్ర‌తిప‌క్ష బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు. ఓ వైపు మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌యం సృష్టిస్తుంటే.. లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం ఘోర‌మ‌ని, ఇది ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకోవ‌డ‌మేన‌ని ప‌లువురు విమ‌ర్శించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,82,143 క‌రోనా కేసులు నమోదు కాగా.. అందులో 86,984 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టికే 5,164 మందిని ఈ మ‌హమ్మారి బ‌లితీసుకుంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 86,984 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 65,168 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 2,197 మంది మ‌ర‌ణించారు. అందులో మంబై సిటీలోనే 38 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసుల న‌మోద‌య్యాయి.