సోషల్ మీడియా సతాయిస్తుంది!

సోషల్ మీడియా సతాయిస్తుంది!

మొన్న ఒక నైటంతా వాట్సాప్​లో ఫొటోలు అప్​లోడ్​ కాలేదు. స్టేటస్​ పెడదాం అనుకున్న వారైతే.. ‘లోడింగ్​.. లోడింగ్​.. ’ అనే ఎర్రర్​ చూసి విసుగెత్తిపోయారు. వాట్సాప్​ మాత్రమే కాదు.. సరిగ్గా అప్పుడే ఫేస్​బుక్​ కూడా మొరాయించింది.
పెట్టిన పోస్టులు అప్​డేట్​ కాక, కామెంట్లు కనబడక ఫేస్​బుక్​ ప్రేమికులను బాధపెట్టింది. మొన్న ట్విట్టర్​ గంటపాటు పనిచేయకుండా హ్యాంగ్​ అయింది. అసలు సోషల్​ మీడియా యాప్స్​ ఎందుకు హ్యాంగ్​ అవుతున్నాయి? తెలుసుకుందాం.

‘అరేయ్​.. నీకు వాట్సాప్​ వస్తుందా..?’ వాట్సాప్​ రాకపోవడంతో ఓ దోస్తుగాని ఆరా..

‘అరేయ్​.. ఏదో ఫొటో పంపినవ్​.. డౌన్​లోడ్​ అయితలేదు రా’ ఏం ఫొటో పంపిండో అన్న ఆత్రుత..

‘ఏమైందే.. నీకు కాబోయే మొగుడి ఫొటో పంపమంటే.. ఏదో డౌన్​లోడ్​ కాని పిక్​ పెట్టినవ్​.. మాకు పంపించడం ఇష్టం లేకపోతే డైరెక్టుగా చెప్పొచ్చుగా’ ఓ స్నేహితురాలి ఎత్తిపొడుపు..

‘ఏందిరా.. ఫేస్​బుక్​లో కిందున్న ఫొటోలో ఓ వింత ఉంది కనుక్కో.. అని ఫొటో పెట్టినవ్​.. అక్షరాలే తప్ప ఫొటో కనిపిస్తలేదు.. ఏం ఫొటో రా అది’

‘గత కొన్ని రోజులుగా నా అప్​లోడ్​ చక్రం తిరుగుతూనే ఉంది.. కానీ.. ఫొటో అప్​లోడ్​ అవడం లేదు’​ ఫేస్​బుక్​ ప్రేమికుల తిప్పలు..

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. మొన్నటికి మొన్న ఫేస్​బుక్, వాట్సాప్​ చాలాసేపు పనిచేయకుండా మొరాయించాయి. ఫొటోలు అప్​లోడ్​, డౌన్​లోడ్​ కాకుండా వినియోగదారులను తిప్పలు పెట్టాయి. ఇప్పుడు తాజాగా ట్విట్టర్​ పిట్ట కూడా గంటసేపు కూత లేకుండా మూగబోయింది. అసలు ఈ సోషల్​ మీడియా యాప్​లు ఎందుకు హ్యాంగ్​ అవుతున్నాయి. ఎవరైనా, ఏమైనా చేస్తున్నారా? అవే అలసిపోతున్నాయా? లేదంటే టెక్నికల్​ ఇష్యూనా? నిర్వహణా లోపమా?

ఇదే కారణం..

ఈ నెల 2వ తారీఖు నాడు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ లాంటి సోషల్​ మీడియా యాప్స్​ పని చేయకుండా మొరాయించాయి. సర్వర్​ డౌన్​ అయి వినియోగదారులను ఇబ్బంది పెట్టాయి. యూజర్లు పెట్టిన పోస్టులు, ఫొటోలు కనిపించకుండా కంగారుపెట్టాయి. ఈ సమస్య కొంతమందికో, కొన్ని దేశాల్లోనే వస్తే ఏమో అనుకోవచ్చు. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెట్టింది. పంపించిన ఫైల్స్​, ఫొటోలు పంపినట్టు చూపిస్తున్నాయి కానీ.. అవతలి వారికి కనిపించడం లేదు. మొదట్లో చాలామంది ఈ సమస్యకు కారణం నెట్​వర్కో, టెక్నికల్​ ఇష్యూనో అనుకున్నారు. కానీ.. ఈ మూడు యాప్స్​ నిర్వహించే సర్వర్​ ఒక్కటే కావడం దీనికి ముఖ్య కారణం. మూడు అప్లికేషన్లు ఒకే సర్వర్​ మీద పని చేయడం వల్ల సర్వర్​ మీద లోడ్​ ఎక్కువై అలా పనిచేయకుండా ఆగిపోయిందని విచారణలో తేలింది. రెండు నెలల క్రితం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. లక్షలాది సోషల్​ మీడియా వినియోగ దారులు ఇలాంటి ప్రాబ్లమ్​ ఎదుర్కొన్నారు. కంప్లైంట్లు చేశారు.

యూట్యూబ్​, ట్విట్టర్​ కూడా..

వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లే అనుకుంటే.. యూట్యూబ్​, ట్విట్టర్​లు కూడా మొరాయించాయి. ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్లు లేకుండా వినియోగదారులను అలరిస్తున్న ఈ రెండు సోషల్​ మీడియా యాప్స్​ తమ వంతుగా హ్యాంగ్​ అయ్యాయి. యూట్యూబ్​ గతేడాది అక్టోబర్​ నెలలో నలభై నిమిషాల పాటు టెక్నికల్​ ప్రాబ్లమ్స్​తో గంటసేపు నిలిచిపోగా.. తాజాగా ట్విట్టర్​  కూడా మొన్న గురువారం నాడు గంటపాటు మొండికేసింది.
ఫోన్​లలో ట్విట్టర్​ యాప్​, ట్విట్టర్​ వెబ్​సైట్​ గంటసేపు పనిచేయకుండా ‘మీరు పెట్టిన ట్వీట్​ పోస్ట్​, అప్​లోడ్​ కావడం లేదు’ అనే మెసేజ్​ చూసి చాలామంది ట్విట్టర్ ​యూజర్లు కంగారుపడిపోయారు. ఫేస్​బుక్, వాట్సాప్​లాంటి యాప్స్​ సామాన్యులు కూడా వాడుతుంటారు. సెలబ్రిటీలు ఎక్కువగా వాడే.. ట్విట్టర్​ సేవలు కూడా గంటసేపు నిలిచిపోవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు.

మళ్లీ అవుతదా?

సోషల్​ మీడియా యాప్స్​ ఇలా క్రాష్​కావడం, హ్యాంగ్​ కావడం ఇది మొదటిసారి కాదు. ఇది వరకు కూడా చాలాసార్లు ఇలాగే జరిగింది. సేవలకు డిస్టర్బెన్స్​ కలిగిన ప్రతీసారి సదరు యాప్​ యాజమాన్యం, సిబ్బంది స్పందిస్తూ.. ‘ఇలాంటి ఘటన మరోసారి జరగదు’ అని స్టేట్​మెంట్లు ఇస్తున్నాయి. సమస్యకు పరిష్కారం చేయడానికి గంటో, రెండు గంటలో తీసుకొని ఇలా ప్రకటనచేసి అప్పటివరకైతే గండం గట్టెక్కుతున్నారు. కానీ.. మళ్లీ ఇలాంటి సమస్య రాదని కన్​ఫర్మ్​​గా చెప్పగలరా అంటే.. ఎవరి దగ్గరా జవాబు లేదు.. ఉండదు కూడా. ఎందుకంటే.. టెక్నికల్​ ఇష్యూ విషయంలో ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే.. ఎప్పుడు రష్​ పెరుగుతుందో.. ఎప్పుడు క్రాష్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం. కాబట్టి.. మళ్లీ సోషల్​ మీడియా యాప్స్​ హ్యాంగ్​ అవుతాయా? మొరాయిస్తాయా? అనే ప్రశ్నకు ‘నో’ అని కచ్చితంగా చెప్పలేం.