పొలిటికల్ ​పార్టీల సోషల్ వారియర్స్..గప్ చుప్

పొలిటికల్ ​పార్టీల సోషల్ వారియర్స్..గప్ చుప్
  • మూగబోయిన సోషల్​మీడియా గ్రూపులు, పేజీలు
  • దాదాపు రెండు నెలల పాటు నిమిషానికో మెసేజ్
  • పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తూనే ప్రత్యర్థులపై కౌంటర్​అటాక్
  • ఎగ్జిట్ పోల్స్ తర్వాత అంతా సైలెంట్

ఖమ్మం, వెలుగు : పొలిటికల్​పార్టీల సోషల్​ మీడియా గ్రూపులు, పేజీలు మూగబోయాయి. పోలింగ్  ముగిశాక సోషల్  టీమ్స్ ఒక్కసారిగా సైలెంట్  అయ్యాయి. ఎగ్జిట్​ పోల్స్​ వచ్చాక అన్ని పార్టీల సోషల్​ ఫ్లాట్ ఫామ్స్ ది అదే పరిస్థితి. దాదాపు మూడు నెలల పాటు పార్టీల లీడర్లు, అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ఎంత ప్రచారం చేశారో.. అంతకు మించిన ప్రచారం సోషల్ మీడియాలో చేసుకున్నారు. ఆయా పార్టీలు, నేతలు సొంతంగా టీమ్స్​ఏర్పాటు చేసుకుని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమ గురించి, పార్టీ కార్యక్రమాల గురించి చెప్పుకొంటూనే ప్రత్యర్థుల కామెంట్లకు కౌంటర్​అటాక్​ ఇస్తూ, విపరీతంగా సర్క్యులేట్​ చేయించుకున్నారు. వాట్సాప్, ఫేస్​బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రాం ఇలా దేన్నీ వదలకుండా ప్రచారం చేశారు. ఏ యాప్​ ఓపెన్​ చేసినా తమకు సంబంధించిన పోస్టులు, పార్టీ హామీలు, గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలు ప్రతీది గ్రామ స్థాయిలో అందరికీ తెలిసేలా నిమిషానికో పోస్టు పెట్టించారు. పోలింగ్​కు ఒకరోజు ముందు అధికారికంగా ప్రచారానికి గడువు ముగిసినా, పోలింగ్​ రోజు సాయంత్రం వరకు సోషల్​మీడియాలో ప్రచారం ఆగలేదు. ఒక్క ఓటు కూడా చేజారకూడదు అన్నట్లుగా చివరి నిమిషం వరకు సోషల్​టీమ్స్  పోరాటం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాక అంతా గప్ చుప్  అయ్యారు. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ కు సంబంధించిన పోస్టులు పూర్తిగా తగ్గిపోయాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడమే ఇందుకు కారణం. ఒకటి, రెండు సర్వేలు బీఆర్ఎస్  వైపు మొగ్గు చూపినా సోషల్​అకౌంట్ల హ్యాండ్లర్లు సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ కు పాజిటివ్​గా చెప్పిన సర్వేల స్క్రీన్​షాట్లు, కేసీఆర్, కేటీఆర్​ప్రకటనలను పోస్టు చేసి వదిలేశారు.

నోటిఫికేషన్లు నిల్

ప్రచారం మొదలైనప్పటి నుంచి నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు స్మార్ట్​ఫోన్లకు నిమిషానికో నోటిఫికేషన్  వస్తూనే ఉంది. పోలింగ్​ అయిపోవడంతో నిన్నటి నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు లేవు. సోషల్​గ్రూపులు, పేజీల్లో ఒకటి అరా పోస్టులు తప్ప ఏమీ పెట్టడం లేదు. గురువారం సాయంత్రం ఎగ్జిట్  పోల్స్  రిలీజ్  అయ్యాక పెట్టిన సర్వేల పోస్టులే కనిపిస్తున్నాయి. సర్వేల ఫలితాలు అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడం, కాంగ్రెస్​ గెలుస్తుందని చెబుతున్నా పోలింగ్​తర్వాత కేసీఆర్, కేటీఆర్​ వ్యాఖ్యలతో ఇరు పార్టీల లీడర్లు, క్యాడర్, సోషల్​మీడియా హ్యాండ్లర్లు కన్ఫ్యూజన్​లో పడిపోయారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోలింగ్  తర్వాత ఓటింగ్  సరళిపై సమీక్షలకే పరిమితం అవడం కూడా సోషల్​టీమ్స్​సైలెంట్​అవడానికి కారణంగా తెలుస్తోంది. అలాగే ఎన్నికల కోసమే పనిచేసిన వారి అగ్రిమెంట్ ముగియడంతో పోస్టింగ్స్​ తగ్గిపోయాయని చెబుతున్నారు. రిజల్ట్​వచ్చే దాకా ఇదే నిశ్శబ్దం కొనసాగేలా కనిపిస్తోంది.

పక్కా ప్లానింగ్ తో రంగంలోకి..

ఎన్నికలకు దాదాపు రెండు, మూడు నెలల ముందు అన్ని పార్టీలు నియోజకవర్గాల్లో సోషల్ మీడియా టీమ్స్ ను రంగంలోకి దింపాయి. పార్టీలకు అనుబంధంగా హైదరాబాద్  నుంచి కొన్ని అకౌంట్లను హ్యాండిల్ చేస్తుండగా, ఆయా పార్టీల టికెట్  దక్కించుకున్న అభ్యర్థులు, ఇతర నేతలు తమ సెగ్మెంట్లలో టీమ్స్ ను నియమించుకున్నారు. ప్రత్యేకంగా సాలరీలు ఇచ్చి మరీ కొంతమంది టెక్నికల్ ఎక్స్ పర్టులను తీసుకున్నారు. తమ పార్టీ కార్యకలాపాలను, అభ్యర్థి చేసిన అభివృద్ధి పనులపై మీమ్స్, పోస్టింగులను ఆయా గ్రూపులు, పేజీల్లో సర్క్యులేట్ చేయడమే ఆ ఎక్స్ పర్టుల పని. ఇక ప్రత్యర్థి పార్టీల ప్రచారాలను తిప్పికొట్టడం, ప్రత్యర్థి నేతలపై దుమ్మెత్తిపోయడం వంటి అంశాల్లో వారు యాక్టివ్​గా పనిచేశారు. ఆ పోస్టింగులను ఆయా పార్టీలకు సంబంధించిన యూత్  సభ్యులు, ఇతర కార్యకర్తలు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి షేర్ చేసి, వైరల్  చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి కొందరు, నామినేషన్లు ఫైనల్  అయ్యాక మరికొందరు తమ సోషల్ మీడియా టీమ్ ల పనితీరును అంచనా వేసుకున్నాయి. బలహీనంగా ఉన్నామనుకున్న నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు ప్రత్యేకంగా హైదరాబాద్  నుంచి ఎక్స్ పర్ట్  సంస్థలను సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసం రూ.లక్షల్లో డబ్బులు చెల్లించి తీసుకున్నారు. పోలింగ్  ముగియడంతో అభ్యర్థులతో ఆయా టీమ్స్​అగ్రిమెంట్ పూర్తయిందని సమాచారం. ఇప్పుడు కేవలం పార్టీకి చెందిన కార్యకర్తలతోపాటు ఆయా అభ్యర్థుల పీఆర్  బృందాలే పనిచేస్తున్నాయి.

మళ్లీ లోక్​సభ ఎన్నికలకే

దాదాపు నెల రోజుల పాటు జరిగిన హోరాహోరీ ఎన్నికల యుద్ధం రేపటి కౌంటింగ్​తో  ముగియనుంది. ఓటింగ్  సరళి, ఎన్నికల ఫలితాలపై క్లారిటీ లేకపోవడం, గెలుపుపై ధీమా లేకపోవడం వంటి కారణాలతో అభ్యర్థులు, పార్టీలు సైలెంట్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో కూడా ఆయా పార్టీల యాక్టివిటీ కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. లోక్​సభ ఎన్నికలు వస్తేనే మళ్లీ సోషల్​మీడియా టీమ్స్​యాక్టివ్​ కానున్నాయి.