ప్రకృతి సేద్యం మీద ప్రేమతో

ప్రకృతి సేద్యం మీద ప్రేమతో

నేలతల్లి పచ్చగా ఉండాలంటే ప్రకృతి సేద్యాన్ని మించింది లేదు. ఇదే విషయాన్ని తాను ఆచరించడమే కాకుండా రైతులకి చెబుతున్నాడు. సేంద్రియ వ్యవసాయంతో పాటు పర్యావరణ పరిరక్షణ, యోగాసనాల మీద జనాలకి అర్థమయ్యేలా చెప్పి,  ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే చూడాలనేది అతడి కోరిక. అందుకే ‘మానవతా విశ్వ విద్యాలయం’  ఏర్పాటు చేశా అంటున్న ఇతడి పేరు  అల్లూరి శ్రీనివాస్.  వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో ఉంటున్న శ్రీనివాస్​ సాఫ్ట్​వేర్​ ఎంప్లాయి.   


ఆవు మూత్రం, ఆవు  పేడ, ఇతర జీవ ఎరువులతో పండించిన పంటలనే తినాలి అంటాడు శ్రీనివాస్​. తెల్లని వరి అన్నం, చక్కెర, ఉప్పు, నూనె వంటివి ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయంటాడు. ఆ విషయాల గురించి ప్రచారం చేయాలని  మిరాసిపల్లిలో 60 ఎకరాల్లో ‘మానవతా విశ్వ విద్యాలయం’ ఏర్పాటుచేశాడు.  ఔషధ మొక్కలు, ఇతర చెట్ల పెంపకంతో పాటు పలు అంశాలపై రైతులకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు.  
చదువుకునే రోజుల్లో...
కంప్యూటర్ అప్లికేషన్స్​లో పిజి చేశాడు శ్రీనివాస్. ఇండియాలో  కొన్నాళ్లు, ఆ తర్వాత లండన్​లో మరికొన్నాళ్లు సాప్ట్​వేర్ ఇంజనీర్​గా పనిచేశాడు. సాఫ్ట్​వేర్​ జాబ్​ చేస్తున్న అతను సోషల్​ యాక్టివిస్ట్​గా మారడానికి కారణం ఉంది. గ్రాడ్యుయేషన్​  చేస్తున్న టైమ్​లో పేదపిల్లలు ఆకలితో అలమటించడం,  పోషకాహారలోపంతో బాధపడడం చూశాడు.  ఆర్థికంగా బాగా సెటిల్​ అయ్యాక అలాంటి పిల్లల కోసం ఏదైనా చేయాలి అనుకున్నాడు. 1991 లో ‘విశ్వ మానవతా సంస్థ’ ఏర్పాటు చేశాడు. మనదేశంలోనే కాకుండా అమెరికా, లండన్​లో కూడా ఈ సంస్థకు బ్రాంచెస్​ ఉన్నాయి.  దానికి అనుబంధంగా అనాథ శరణాలయాలు, యోగా సెంటర్స్​, హోమియో హాస్పిటల్స్, ఎడ్యుకేషన్​ సెంటర్స్​ పనిచేస్తున్నాయి. స్టూడెంట్లకు పర్సనాలిటీ డెవలప్‌‌మెంట్‌‌, కెరీర్ గైడెన్స్‌‌పై ర్క్​షాప్స్​ ఏర్పాటు చేస్తారు. వాటితో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా పెడుతున్నాడు శ్రీనివాస్​. ఎనిమిది వేల మంది వలంటీర్లు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. 
సింప్లిసిటీ అతడి నైజం
లండన్​లో సొంతంగా ‘సంధాత టెక్నాలజీస్’ అనే సాఫ్ట్​వేర్​ కంపెనీ పెట్టాడు.  దేనికీ లోటు లేని జీవితం. కానీ, శ్రీనివాస్​కి సింపుల్​గా బతకడం అంటే ఇష్టం. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోడు. రెండు జతల కాటన్​ డ్రెస్​లు ఉంటాయంతే. వాటినే ఉతికి మళ్లీ వేసుకుంటాడు.  యోగా ట్రైనర్​ కూడా అయిన శ్రీనివాస్​ దేశ విదేశాల్లో యోగా నేర్పిస్తుంటాడు. బ్రిటన్ పార్లమెంట్​తో పాటు, ఐక్యరాజ్య సమితిలో కూడా యోగా ట్రైనింగ్​ఇచ్చాడు. పర్యావరణం మీద  అవగాహన కల్పించడం కోసం లండన్ నుంచి హైదరాబాద్​ వరకు దాదాపు 14 దేశాల గుండా 11వేల కిలోమీటర్ల  దూరం సైకిల్ యాత్ర చేశాడు. కాశీ నుంచి  కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి, ప్రకృతి సేద్యం గురించి ప్రచారం చేశాడు.   - బక్షి శ్రీధర్​ రావు, వనపర్తి, వెలుగు 


రెండు రాష్ట్రాల రైతులకి ట్రైనింగ్​ 
‘‘మిరాసిపల్లిలో  60 ఎకరాల బంజరు భూమిని  వ్యవసాయానికి అనువుగా మార్చేందుకు ఐదేళ్లు పట్టింది. పంట సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించాలనే ఆలోచనతో ‘మానవతా విశ్వ విద్యాలయం’ పెట్టా. ఔషధ మొక్కలతో పాటు రకరకాల మొక్కల పెంపకం మీద రైతులకి అవేర్​నెస్​ కల్పిస్తున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లోని  రైతులకు పంటని కాపాడుకోవడం, సేంద్రియ వ్యవసాయం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడం వంటి అంశాల్లో  ఫ్రీగా ట్రైనింగ్​ ఇస్తున్నా.   ఇప్పటివరకు1500 మందికి పైగా రైతులు ఈ విధానాన్ని  పాటిస్తున్నారు”   - శ్రీనివాస్