నేల కోతతో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత భారీగా తగ్గుతోంది

నేల కోతతో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత భారీగా తగ్గుతోంది

ఏ దైశమైతే సారవంతమైన నేలను కలిగి ఉంటుందో ఆ దేశం సుసంపన్నంగా సుభిక్షంగా ఉంటుంది. ఎప్పటిదాకా నేల నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటుందో అప్పటిదాకా పుడమి తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. భూ ఉపరితలంలో ఉండే పై పొర మట్టి భూమి మనుగడకు ఎంతో అవసరం. కానీ భూ ఉపరితలంపై లభించే ఈ సారవంతమైన మట్టి రోజురోజుకీ క్షీణించి, నాణ్యత లోపించి అనేకమైన సమస్యలను, సవాళ్లను సృష్టిస్తోంది. గాలి వేగం, నీటి ప్రవాహ వేగం, వాగులు, వంకలు, నదుల్లో ప్రవాహం వేగం, అడవులు, పచ్చిక బయలు క్షీణించడం, ఎక్కువ దుక్కులు చేయడం, అశాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక, నగరీకరణ అవసరాలకు పై పొర మట్టిని తవ్వడం వంటే అనేక కారణాల వల్ల భూసారం కొట్టుకుపోతున్నది.

నీటికోత ఎక్కువైతే..

మనదేశంలో నేల కోతకు ముఖ్యమైన కారణం నీటి ప్రవాహం. నేల రకం, నేల స్వభావం, నేల వాలు ప్రకారం నేలకోత మారుతూ ఉంటుంది. నీరు, గాలి ద్వారా సంభవించే నేలకోత దాదాపు 160,24,167 మిలియన్‌‌ హెక్టార్లుగా నమోదయ్యంది. నేషనల్‌‌ బ్యూరో ఆఫ్​ సాయిల్‌‌ సర్వే అండ్‌‌ ల్యాండ్‌‌ యూజ్‌‌ ప్లానింగ్‌‌ వారు మన దేశంలో 119.2 మిలియన్‌‌ హెక్టార్ల నేలలు కోతకు గురి అయినట్లు అంచనా వేశారు. సగటున హెక్టారుకు ఏడాదికి 16.35 టన్నుల పై పొర మట్టి అంటే దేశ వ్యాప్తంగా 5334 మిలియన్‌‌ టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. ఇందులో దాదాపు 29 % సముద్రంలోకి, 10 % చెరువులు, డ్యామ్‌‌ల్లోకి చేరుతోంది. మిగిలిన 61% ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేరుతోంది.

ఇలా నేలలు కోతకు గురి అవడం వల్ల దాదాపు 63.85 మిలియన్‌‌ హెక్టార్లు అంటే దేశ వ్యాప్తంగా 20.17% భూములు నిరర్థక భూములుగా మారినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నేలమీద లభించే సారవంతమైన పై పొర మట్టి కొట్టుకుపోవడం కారణంగా నేల సారం తగ్గిపోయి నాణ్యత లోపించి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతోంది. దీనివల్ల దేశంలో ఏటా 7.2 మిలియన్‌‌ టన్నుల ఉత్పత్తి అంటే దేశ ఉత్పత్తిలో నాలుగు నుంచి 6.3% తగ్గిపోతోంది. ఈ తగ్గుదల దేశ స్థూల ఆదాయంలో ఒకటి నుంచి 1.7%గా నమోదవుతోంది. అంటే 74 మిలియన్‌‌ టన్నుల పోషక పదార్థాల ఉత్పత్తి నష్టపోతున్నాం.దీని ద్వారా సంభవించే మరొక ముఖ్యమైన నష్టం చెరువులు, ప్రాజెక్టులు పూడికతో నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యం కోల్పోవడం.

దీని కారణంగా ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ 93 టీఎంసీలు, నాగార్జున సాగర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌ 96 టీఎంసీలు, తుంగభద్ర ప్రాజెక్ట్‌‌ 28 టీఎంసీల నిల్వ సామర్థ్యం కోల్పోయాయి. ఈ కారణంగా నాగార్జున సాగర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌ కింద 65 వేల ఎకరాలు, తుంగభద్ర ప్రాజెక్ట్‌‌ కింద 19 వేల ఎకరాల్లో వరి సాగుకు నీరు అందకుండా పోయింది. అదేవిధంగా ప్రతి ఏటా నాగార్జునా సాగర్‌‌‌‌లోనికి 1.77 టీఎంసీలు, శ్రీశైలం 2.06 టీఎంసీలు, తుంగభద్ర 5 టీఎంసీలకు సమానమైన పూడిక చేరుకుంటుంది.

సేవ్‌‌ ద సాయిల్‌‌

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (వాట్‌‌ షెడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూసార నీటి సంరక్షణ పనుల కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయినా అనుకున్న ఫలితాలు కనిపించడం లేదు. ఇందుకు ముఖ్య కారణం రైతుల్లో అవగాహనా లోపం,  ప్రభుత్వ శాఖల సమన్వయం లోపం. రైతులు ప్రతి ఏటా తమ పొలాల నుంచి టన్నుల కొద్దీ సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంటే నిర్లక్ష్యం వహించి, మరోపక్క చెరువుల్లోకి చేరిన మట్టిని వ్యయ ప్రయాసలకోర్చి తమ పొలాలకు తరలిస్తున్నారు. ఇది నీటిని నేల మీద ఒలకపోసి, ఒలకపోసిన నీటిని మరలా ఎత్తుకోవడంలా ఉంది.

ఈ నేల కోతలాగే కొనసాగితే మునుముందు నేలలు నిస్సారమై పంట దిగుబడులు తగ్గి, ఆహార కొరత ఏర్పడుతుంది. వాలు భూముల్లో నిరవధిక సమతల కందకాలు ఏర్పాటు చేయడం వల్ల నేల కోతను అరికట్టొచ్చు. ఎరువుల వాడకం తగ్గి రైతుల ఖర్చు తగ్గుతుంది. నేలలో తేమ శాతం ఎక్కువుంటే పంట ఎండి పోకుండా ఉంటుంది. చెరువుల్లో, ప్రాజెక్ట్లలో పూడిక తగ్గి వాటి జీవితకాలం పెరగడమే కాక సాగు విస్తీర్ణం తగ్గకుండా ఉంటుంది. అలాగే ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములుగా చేయాలి. సద్గురు జగ్గి వాసుదేవ్‌‌ చేపట్టిన ‘సేవ్‌‌ ద సాయిల్‌‌’ వంటి కార్య క్రమాలను మరింత ఎక్కువగా చేపట్టాలి. భూ సారాన్ని సంరంక్షించుకుందాం.. భావి తరాల ఆహార భద్రతకు నిచ్చెన వేద్దాం అనేది నినాదంగా మారాలి. - శివ ప్రసాద్‌‌ మల్లెల, జాయింట్‌‌ కమిషనర్‌‌‌‌, యంజీఎన్‌‌ఆర్‌‌‌‌ఈజీఎస్‌‌(ఏపీ)