రామాలయ భూమి పూజకు మట్టిని పంపనున్న ఆర్‌‌ఎస్ఎస్

రామాలయ భూమి పూజకు మట్టిని పంపనున్న ఆర్‌‌ఎస్ఎస్

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం భూమి పూజ ఆగస్టు 5న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఈ భూమి పూజకు మట్టిని పంపాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్ణయించింది. ఈ మేరకు సంఘ్ హెడ్‌క్వార్టర్స్ అయిన నాగ్‌పూర్‌‌‌ నుంచి మట్టిని సేకరించి అయోధ్యకు పంపనున్నట్లు వీహెచ్‌పీ వర్గాలు తెలిపాయి. విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)కు విదర్భ ప్రంత్ ప్రముఖ్‌గా ఉన్న గోవింద్‌ షిండే ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

‘దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భూమితోపాటు నీళ్లను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయి. వేలాది మంది వీటిని తీసుకొని మార్చిలో జరగాల్సిన రామాలయ భూమి పూజకు వెళ్లాల్సింది. కానీ కరోనా కారణంగా అది జరగలేదు. ఇప్పుడు ఆగస్టు 5న పూజ నిర్వహణకు అంతా సిద్ధమైంది. మేం వెళ్లగలిగే ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి అయోధ్యకు పంపాలని నిర్ణయించాం. దీంట్లో భాగంగా ఆర్‌‌ఎస్ఎస్ హెడ్‌ క్వార్టర్ అయిన నాగ్‌పూర్‌‌, రామ్‌తెక్‌లోని శ్రీ రామ మందిర్ నుంచి మట్టిని సేకరించాం. ఐదు నదుల సంగమమైన అంభోరా నుంచి నీళ్లను తీసుకున్నాం. భూమి పూజ వేడుకలో భాగమవ్వాలనేదే మా కోరిక’ అని గోవింద్ షిండే చెప్పారు.